ర‌ద్ద‌యిన బీమా పాల‌సీని పునరుద్ధరించడం మంచిదేనా?

గ్రేస్ పీరియ‌డ్‌లో కూడా బీమా పాల‌సీ ప్రీమియం చెల్లించ‌క‌పోతే లైఫ్ క‌వ‌రేజ్‌ని దెబ్బ‌తీసుకున్న‌ట్లే అవుతుంది.

Published : 07 Dec 2021 13:25 IST

జీవిత బీమా పాల‌సీ ప్రీమియం గ‌డువు తేదిలోగా చెల్లించాలి. బీమా బ్రాంచ్ ఆఫీసుల‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ప్రీమియం చెల్లించ‌డానికి అవ‌కాశం ఇస్తున్నాయి బీమా సంస్థ‌లు. బ్యాంక్ అకౌంట్ నుండి ప్రీమియం మొత్తం బీమా సంస్థ‌కు వేళ్లేలా కూడా `ఎల‌క్ట్రానిక్ ఆటో పే` ఆప్ష‌న్‌ను పెట్టుకోవ‌చ్చు. దీని వ‌ల‌న పాల‌సీ గ‌ల వ్య‌క్తి ప్రీమియం చెల్లించ‌డం మ‌రచిపోయినా.. బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా చెల్లింపు జ‌రిగిపోతుంది.

అయితే గ‌డువు తేదీలోపు ప్రీమియం చెల్లించ‌క‌పోతే, సాధారణంగా 30 రోజుల గ్రేస్ పీరియ‌డ్ (వెసులుబాటు) ఇస్తారు. ఆ గ‌డువులోగా ప్రీమియం చెల్లిస్తే పాల‌సీ అమ‌లులో ఉంటుంది. గ్రేస్ పీరియ‌డ్‌లో కూడా బీమా పాల‌సీ ప్రీమియం చెల్లించ‌క‌పోతే లైఫ్ క‌వ‌రేజ్‌ని దెబ్బ‌తీసుకున్న‌ట్లే అవుతుంది. పాల‌సీదారు అకాల మ‌ర‌ణానికి గురైతే వారిపై ఆధార‌ప‌డిన వారి ఆర్ధిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం ఎంత ముఖ్య‌మో, ప్రీమియంలు గ‌డువుతేదిలోగా చెల్లించ‌డం కూడా అంతే ముఖ్యం. పాల‌సీ ప్రీమియం చెల్లించే తేదికి ఒక నెల ముందే బీమా సంస్థ‌లు మెయిల్స్‌, ఫోన్‌కు సంక్షిప్త సందేశాల‌ను పంప‌డం జ‌రుగుతుంది. గ్రేస్ పీరియ‌డ్‌లో పాల‌సీ అమ‌లులోనే ఉంటుంది. కాబ‌ట్టి ఆ వ్య‌వ‌ధిలో పాల‌సీదారుకు ప్రాణాపాయం జ‌రిగితే.. నామినీ క్లెయిమ్‌లు, పాల‌సీ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌తో అనుసంధానించ‌బ‌డిన అన్ని ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు అర్హులే. పాల‌సీ ర‌ద్ద‌యితే పాల‌సీదారు ఎలాంటి క్లెయిమ్ పొంద‌లేరు. నిర్దిష్ట స‌మ‌యం త‌ర్వాత దానిని పున‌రుద్ధరించ‌లేరు.

గ్రేస్ పీరియ‌డ్‌లో కూడా ప్రీమియం చెల్లించ‌క‌పోతే పాల‌సీ  ర‌ద్ద‌వ్వ‌డ‌మే కాకుండా పాల‌సీదారునికి పాల‌సీ ద్వారా క‌వ‌ర్ చేయ‌బ‌డే ప్ర‌యోజ‌నాలు కూడా ర‌ద్దు అవుతాయి. కొన్ని కంపెనీలు ర‌ద్ద‌యిన పాల‌సీల‌ను పున‌రుద్ద‌రించ‌డానికి ప్ర‌త్యేకంగా ప్ర‌చారాల‌ను నిర్వ‌హిస్తుండ‌గా, పాల‌సీదారులు త‌ప్ప‌నిస‌రిగా పాల‌సీ వివ‌రాల‌ను త‌నిఖీ చేసుకుని ర‌ద్ద‌యిన పాల‌సీని పున‌రుద్ధరించుకోవ‌డానికి బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలి.  జీవిత బీమాలో పాల‌సీని పున‌రుద్ధరించ‌డానికి బీమా సంస్థ‌లు 2 నుండి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ్య‌వ‌ధిని అందిస్తున్నాయి. వాస్త‌వానికి ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(ఐఆర్డీఏ) మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం 2019కి ముందు జీవిత బీమా పాల‌సీల‌కు గ‌రిష్టంగా 2 ఏళ్ల పునరుద్ధరణ వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత చేసిన పాల‌సీల‌కు గ‌రిష్టంగా 5 ఏళ్ల వ్య‌వ‌ధి ఉంటుంద‌ని నిర్దేశిస్తుంది. పాల‌సీ పున‌రుద్ధరించిన‌ట్ల‌యితే ప్ర‌యోజ‌నాలు మ‌ళ్లీ కొన‌సాగుతాయి.

పాల‌సీదారుడు ర‌ద్దయిన పాల‌సీని పున‌రుద్ద‌రించే ప్ర‌మాణాల‌ను వివ‌రించే ప‌త్రాన్ని త‌ప్ప‌క చ‌ద‌వాలి, బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలి. ర‌ద్ద‌యిన పాల‌సీని పున‌రుద్ద‌రించ‌డానికి పాల‌సీదారు ఒక ప్రామాణిక పున‌రుద్ద‌ర‌ణ ఫార‌మ్‌పై సంత‌కం చేయాలి. నియ‌మించ‌బ‌డిన మెడిక‌ల్ సెంట‌ర్‌లో మెడిక‌ల్ చెక‌ప్ కోసం వెళ్ల‌వ‌ల‌సి ఉంటుంది. ర‌ద్ద‌యిన పాల‌సీని పునరుద్ద‌ర‌ణ చేసేట‌పుడు అప్ప‌టి వ‌ర‌కు బ‌కాయి ఉన్న ప్రీమియంలపై వ‌డ్డీ, స‌కాలంలో చెల్లించ‌నందుకు జ‌రిమానా మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. పున‌రుద్ధరించ‌బ‌డిన పాల‌సీకి కొత్త నిబంధ‌న‌లు, ష‌ర‌తులు కూడా ఉండ‌వ‌చ్చు. ర‌ద్ద‌యిన పాల‌సీని పున‌రుద్ధరించే బ‌దులు కొత్త పాల‌సీని కొనుగోలు చేయాల‌ని మీరు భావించిన‌ప్ప‌టికీ, బీమా చేసిన వ్య‌క్తి వ‌య‌స్సు, ఆరోగ్య ప‌రిస్థితుల‌లో మార్పు కార‌ణంగా పాత పాల‌సీతో పోలిస్తే కొత్త పాల‌సీకి ప్రీమియం చాలా ఎక్కువుగా ఉంటుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు గ‌డువు తేదిలోపు బీమా ప్రీమియం చెల్లించ‌డం మంచిది. దుర‌దృష్ట‌వ‌శాత్తు బీమా పాల‌సీ ర‌ద్ద‌యితే.. ర‌ద్ద‌యిన పాల‌సీని పునురుద్ధరించుకోవ‌డ‌మే చాలా మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని