Anand Mahindra: అగ్నిపథ్‌ ఆందోళనలపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్.. అగ్నివీరులకు ఆఫర్‌

సైనిక నియామకాల కోసం కేంద్ర తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ ఉదయం ‘అగ్నిపథ్‌’ నిరసనలపై

Updated : 20 Jun 2022 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌ (Agnipath)’ పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) విచారం వ్యక్తం చేశారు. ఈ ఉదయం ‘అగ్నిపథ్‌’ నిరసనలపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మహీంద్రా.. అగ్నివీరులకు (Agniveers) ఓ ఆఫర్‌ కూడా ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

‘‘అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలు విచారకరం. గతేడాది ఈ పథకం గురించి తెలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. ఈ పథకంతో అగ్నివీరులు (Agniveers) పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయి. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్‌ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్‌ స్వాగతిస్తోంది’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో వెల్లడించారు.

అయితే, ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే.. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్‌ ఎలాంటి పోస్ట్‌ ఇవ్వనుంది? అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా బదులిచ్చారు. ‘‘అగ్నివీరులకు కార్పొరేట్‌ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. నాయకత్వం, టీం వర్క్‌, దేహ దారుఢ్యంలో శిక్షణ పొందిన అగ్నివీరులు.. కార్పొరేట్‌ పరిశ్రమకు వృత్తిపరమైన పరిష్కారాలను అందించగలరు. కార్యకలాపాల నుంచి పాలనా వ్యవహారాలు, సప్లయ్‌ ఛైన్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ వారికి అవకాశాలుంటాయి’’ అని మహీంద్రా రాసుకొచ్చారు.

అగ్నిపథ్‌ పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ఆందోళనలకు మద్దతిస్తూ నేడు పలు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే నిరసనలు కొనసాగతున్నప్పటికీ.. కేంద్రం మాత్రం అగ్నిపథ్‌ (Agnipath)పై వెనక్కి తగ్గట్లేదు. ఈ పథకం కింద నియామకాల కోసం త్రివిధ దళాలు నిన్న షెడ్యూళ్లను ప్రకటించాయి. త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్‌ ఉద్దేశమని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ స్పష్టంచేశారు. అటు అగ్నివీరులు (Agniveers)గా రిటైర్‌ అయిన వారికి రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పించేందుకు కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని