Amazon: అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు!

ఉద్యోగాల తొలగింపు విషయంలో అమెజాన్‌ సైతం మెటా, ట్విటర్‌ బాటలోనే పయనిస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఇ-కామర్స్‌ దిగ్గజం కొంతమంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.

Published : 17 Nov 2022 10:10 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) సైతం ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. సంస్థలో ఇకపై కొన్నిరకాల ఉద్యోగాలు అవసరం లేదని నిర్ణయించినట్లు హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కఠినమైన నిర్ణయమైనప్పటికీ తప్పడం లేదని లింప్‌ పేర్కొన్నారు. దీనివల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు కొత్త పని వెతుక్కోవడానికి కావాల్సిన సహకారం కూడా అందిస్తామని తెలిపారు. అయితే, ఎంతమందిని తొలగించనున్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. దాదాపు 10,000 మంది ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే.

‘‘చాలా లోతైన సమీక్షల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులను స్థిరీకరించాలని నిర్ణయించాం. దీని పర్యవసానంగా కొన్ని రకాల ఉద్యోగాలు సంస్థకు ఎప్పటికీ అవసరం లేదని తేల్చాం. ఈ వార్త చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రతిభ కలిగిన కొంతమంది ఉద్యోగుల్ని కోల్పోవాల్సి వస్తోంది’’ అని లింప్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు అంశాన్ని అమెజాన్‌ అధికార ప్రతినిధి కెల్లీ నాన్‌టెల్‌ సైతం ధ్రువీకరించారు.

ప్రధానంగా డివైజెస్‌, రిటైల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగాల్లో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీఎసీ తెలిపింది. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. రెండు నెలల్లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టడాన్ని కూడా నిలిపేసినట్లు ఇటీవలే అమెజాన్‌లో ఓ ఉన్నతాధికారి వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని