Education Loan: అంతర్జాతీయ విద్యా రుణాల గురించి తెలుసుకోండి

విదేశీ విద్యనభ్యసించడానికి, రుణం పొందడానికి విద్యార్థులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అవేంటో చూడండి.

Published : 14 Mar 2023 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు ఒక కలగా ఉండేది. చాలా మందికి అంతర్జాతీయ విద్య వ్యయప్రయాసలతో కూడుకున్నది.  గతంలో కంటే అంతర్జాతీయ విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఎక్కువయ్యారు. అయితే, పెరుగుతున్న పోటీతో పాటు అంతర్జాతీయ విద్య ఖరీదైనదిగా మారింది. విద్యా రుణాలు పొందడం కష్టం అయ్యింది. బ్యాంకులు విద్యా రుణాలు తిరస్కరించడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. చాలా వరకు విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు ఈ రుణాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక బలమైన కారణం. విద్యార్థుల ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి..

విద్యా పనితీరు

మీ విద్యా రుణం ఆమోదం పొందడంలో సరైన అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు ఒక ముఖ్యమైన అంశం. బ్యాంకులు, NBFCలు అధిక క్రెడిట్‌ స్కోర్‌ల కంటే విద్యార్థి స్థిరత్వాన్ని చూసి రుణం మంజూరుకు మొగ్గు చూపుతాయి. ఒక సంవత్సరం పాటు అడ్మిషన్‌ ఆలస్యం కావడం, ఒక సెమిస్టర్‌ వాయిదా వేయడం లేదా ఇంటర్నల్‌ ఎగ్జామ్‌ని చాలాసార్లు ఎటమ్ట్‌ చేయడం వంటివి రుణ దరఖాస్తుపై పేలవ ప్రదర్శనగా ప్రతిబింబిస్తాయి. విద్యార్థికి సంబంధించిన విద్యాభ్యాసంలో అంతరాయాలను బ్యాంకులు పరిగణనలో తీసుకుంటాయి. దీని వెనుక ఉన్న తర్కం ఏంటంటే.. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థి తగినంతగా సంపాదించగల సామర్థ్యాన్ని బ్యాంకులు ముందుగానే అంచనా వేస్తాయి. 

విశ్వవిద్యాలయం, కోర్సు

బ్యాంకులు విద్యార్థులను భవిష్యత్‌ కోసం పెట్టుబడిగా పరిగణిస్తున్నందున, ప్రవేశం పొందిన కళాశాల కూడా రుణ అవకాశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ లేదా యూకేలోని రస్సెల్‌ గ్రూప్‌ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలను బ్యాంకులు మెరుగైనవిగా భావిస్తున్నాయి. అలాగే, కొన్ని కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి.

గమ్యం

విద్యార్థి చదువును ఆశిస్తున్న దేశాన్ని కూడా బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటాయి. మెక్సికో, జపాన్‌, చైనా, ఉక్రెయిన్‌ వంటి దేశాలతో పోలిస్తే U.S, U.K, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన ఉన్నత స్థాయి, ఉన్నత విద్యతో అనుసంధానం గల దేశాలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. స్థిరమైన, బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు మెరుగైన ఉపాధి, అభివృద్ధి అవకాశాలను అందించడమే దీనికి కారణం.

రుణం ఎలా పొందాలి?

దరఖాస్తు దశ నుంచి ఆమోదం వరకు మొత్తం రుణ ప్రక్రియ/ పంపిణీకి బ్యాంకులు సమయం తీసుకుంటాయి. రుణాన్ని వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ముందుగా, విదేశీ విద్య కోసం ఎంచుకున్న కోర్సు బ్యాంకులు గుర్తించాయా లేదా అనేది తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి. ఎంత మొత్తంలో రుణం అవసరమో, విద్యార్థి సొంతంగా ఏర్పాటు చేసుకోగల మొత్తం ఎంతో చూసుకోవాలి. ఈ విదేశీ రుణాల కోసం వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను, ఇతర ఫీజులను సరిపోల్చాలి.

క్రెడిట్‌ స్కోరు

బ్యాంకు/NBFCకు మీ క్రెడిట్‌ స్కోరు చాలా ముఖ్యమైంది. సాధారణంగా, సిబిల్‌ స్కోరు 600 లేదా అంతకంటే తక్కువ ఉంటే అది రుణం ఇచ్చే సంస్థ దృష్టిలో ఆకర్షణీయం కాదు. రుణ బాధ్యతను తీసుకునే సహ-దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోరు కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.

చివరిగా: మొత్తం మీద అంతర్జాతీయ విద్యా రుణం కోసం దరఖాస్తు చేయడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ. అన్ని దశలను ప్లాన్‌ చేయడానికి.. మీ విలువైన సమయాన్ని వెచ్చించడమే కాకుండా అవసరమైన నిపుణుల సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మీ మొదటి ప్రయాణంలోనే సక్సెస్‌ కావచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని