వృత్తి నిపుణుల‌కు ప్రొఫెష‌న‌ల్ లోన్‌

ప‌్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి మీరు బ్యాంక్ శాఖకు వెళ్ల‌ల్సిన ప‌నిలేదు.

Updated : 11 Oct 2022 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవ‌స‌ర‌మైన వారికి బ్యాంకులు ఎటువంటి పూచీక‌త్తూ లేకుండా వ్య‌క్తిగ‌త రుణం అంద‌చేస్తున్నాయి. ఏ ఇత‌ర రుణం క‌న్నా కూడా ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాన్ని అసుర‌క్షిత రుణంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. వీటికి ఎలాంటి ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇదే తరహాలో ఎంపిక చేసిన వృత్తి నిపుణుల‌కు పై రుణాన్ని (వ్య‌క్తిగ‌త రుణాన్ని) పోలి ఉండే రుణాన్ని అందించ‌డానికి రుణ సంస్థ‌లు ముందుకొస్తున్నాయి. వీటికి ప్రొఫెష‌న‌ల్ లోన్‌గా రుణ సంస్థలు పేర్కొంటున్నాయి.

ప్రొఫెషనల్‌ లోన్‌ ఎవరికి?

ఎవ‌రైనా డాక్ట‌ర్ లేదా సీఏ వంటి వృత్తి నిపుణులు అయితే, వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని ఎదురుచూసేవారికి, వేగంగా రుణం అవ‌స‌రం ప‌డేవారు ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఈ వృత్తిప‌ర‌మైన రుణం పొంద‌టానికి రుణం ఇచ్చే సంస్థ‌కు నిర్దిష్ట మొత్తానికి ఎటువంటి హామీ అవ‌స‌రం లేదు. అయితే, రుణ మొత్తం నిర్దేశిత ప‌రిమితిని మించి ఉంటే తాక‌ట్టు, పూచీక‌త్తు చూపెట్ట‌వ‌ల‌సి ఉంటుంది.

ఈ వృత్తిప‌ర‌మైన రుణాలు వైద్యులు, న్యాయ‌వాదులు, ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్లు వంటి నిర్దిష్ట రంగాల్లో ప‌నిచేసే నిపుణుల కోసం ఉద్దేశించినవి. ఈ రుణాలు అసుర‌క్షిత‌మైన రుణాలుగా ప‌రిగ‌ణిస్తారు. ఇటువంటి రుణాలు ఈ నిపుణుల‌కు త‌మ వృత్తిని విస్త‌రించుకోవ‌డానికి, అప్‌గ్రేడ్ చేయ‌డానికి లేదా వారు ఏవైనా ఇతర వృత్తిప‌ర‌మైన అవ‌స‌రాల కోసం నిధుల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

రుణ అర్హ‌త ప్ర‌మాణాలు
స్వ‌యం ఉపాధి పొందుతున్న వ్య‌క్తుల‌యితే గ‌త 2 సంవ‌త్స‌రాల‌లో ఆడిట్ చేసిన ఫైనాన్షియ‌ల్ ఐటీఆర్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వారి వ్యాపారం క‌నీసం 2 ఏళ్ల పాటు ర‌న్నింగ్‌లో ఉండి కొన‌సాగుతూ ఉండాలి. వారు వైద్యులు, సీఏలు మొద‌లైన నిపుణులు అయితే ప్రాక్టీస్ చేయ‌డానికి లైసెన్స్‌లు కూడా క‌లిగి ఉండాలి.

వ‌డ్డీ రేట్లు

క్రెడిట్ స్కోర్ 750 అంత‌కంటే ఎక్కువ ఉంటే ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్ల‌తో సుల‌భంగా రుణాన్ని పొందొచ్చు. వృత్తిప‌ర‌మైన రుణాల వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా వృత్తిప‌ర‌మైన అర్హ‌త‌ను బ‌ట్టి 14% నుంచి 20% వ‌ర‌కు ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే, ప్రొఫెష‌న‌ల్ లోన్ సుల‌భ‌మైన అర్హ‌త ప్ర‌మాణాలు, త్వ‌రిత రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదంతో ల‌భిస్తాయి. ఇటువంటి రుణాలలో నిర్దిష్ట నిపుణుల‌కు వ‌డ్డీ రేట్ల వ‌ద్ద కూడా ప్రాధాన్య‌ం అందుతుంది. అయితే, ఇటువంటి రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు వివిధ రుణ సంస్థ‌ల వ‌డ్డీ రేట్ల‌ను స‌రిపోల్చుకుని త‌నిఖీ చేసుకోవాలి. అంతేకాకుండా రుణ నిబంధ‌న‌లు, ష‌ర‌తులు, అద‌న‌పు ఖ‌ర్చులు, ఇత‌ర ఫీజులు, ముంద‌స్తుగా రుణాన్ని చెల్లిస్తే ప‌డే రుసుములు, ఈఎంఐల‌ను త‌ప్ప‌కుండా త‌నిఖీ చేసుకోవాలి.

అప్పు మొత్తం
వృత్తిప‌ర‌మైన రుణం కొన్ని ల‌క్ష‌ల లేదా కోటి అంత‌కంటే ఎక్కువ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది వృత్తిప‌ర‌మైన ప్రొఫైల్‌, అర్హ‌త‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. వ్యాపార అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ప్రొఫెష‌న‌ల్ లోన్‌ని ఉప‌యోగించుకోవ‌చ్చు. వ‌్యాపారాన్ని విస్త‌రించాల‌ని ఎదురు చూస్తున్న ప్రొఫెష‌న‌ల్ అయితే త‌క్ష‌ణ ఆమోదం కోసం ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ
ప‌్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి మీరు బ్యాంక్ శాఖకు వెళ్ల‌ల్సిన ప‌నిలేదు. ఈ రోజుల్లో దాదాపు అన్ని ఆర్థిక సంస్థ‌లు ఆన్‌లైన్‌లో ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి మీకు అవ‌కాశాల్ని ఇస్తున్నాయి. మీకు బ్యాంక్‌తో ఇప్ప‌టికే సంబంధం ఉన్న‌ట్ల‌యితే మీరు ఎక్కువ సంప్ర‌దింపులు లేకుండా త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వేగంగా రుణాన్ని పొందొచ్చు. బ్యాంకు శాఖ‌ను భౌతికంగా సంద‌ర్శించ‌కుండానే వృత్తిప‌ర‌మైన రుణానికి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని, పూర్తిచేయ‌వ‌చ్చు. రుణ సంస్థ అర్హ‌త ప్ర‌మాణాల‌కు అనుగుణంగా మీ ద‌ర‌ఖాస్తు ఉంటే రుణం వేగంగా పంపిణీ అయిపోతుంది.

అసుర‌క్షిత రుణం
ప్రొఫెష‌న‌ల్ రుణం అసుర‌క్షిత రుణం కాబ‌ట్టి.. ఇది కూడా వ్య‌క్తిగ‌త రుణం లాంటిదే. రుణాన్ని పొందేందుకు ఎలాంటి ఆస్తిని తాక‌ట్టు పెట్ట‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం ప్రొఫెష‌న‌ల్ లోన్ అర్హ‌త ప్ర‌మాణాల‌ను పూర్తిచేసి, రుణ ఆమోదం పొంద‌డానికి వెరిఫికేష‌న్ కోసం మీ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి.

రుణ చెల్లింపు కాల వ్య‌వ‌ధి
రుణ ఈఎంఐల‌ను చెల్లించ‌డానికి రుణ సంస్థ‌లు సౌక‌ర్య‌వంత‌మైన కాల‌వ్య‌వ‌ధులను ఇస్తున్నాయి. రుణాన్ని చెల్లించే సామ‌ర్ధ్యానికి అనుగుణంగా ఈఎంఐలు ఎన్ని ఉండాలో ఎంపిక చేసుకోవ‌చ్చు. రుణ చెల్లింపు కాల వ్య‌వ‌ధి 12-84 నెల‌ల మ‌ధ్య ఉండ‌వ‌చ్చు.

క‌నీస అర్హ‌త‌లు
ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు రుణ సంస్థ‌ వేర్వేరు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను విధిస్తుంది. రుణ ఆమోదానికి ముందు వారికి క‌నీస ఆదాయం అవ‌స‌రం. వృత్తి నైపుణ్య అనుభ‌వం, వ‌య‌స్సు, క్రెడిట్ స్కోర్ మొద‌లైన‌వి రుణ సంస్థ‌లు త‌నిఖీ చేస్తాయి. క‌నీస అవ‌స‌ర ప‌త్రాల‌తో ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఇప్పుడు చాలా సుల‌భం.

ప్ర‌త్యేక ఆఫ‌ర్లు
దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల‌, ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్ (సీఏ) దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నందున.. స‌మాజంలో వారికుండే పేరు ప్ర‌తిష్ట‌లక‌నుగుణంగా వారి స‌హ‌కారాన్ని గుర్తించ‌డానికి పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌ ఈ నిపుణుల కోసం ప్ర‌త్యేక రుణ ఆఫ‌ర్‌ల‌తో ముందుకు వ‌చ్చింది. ఈ రుణ ఆఫ‌ర్‌లు 2022 జులై 1 నుంచి ఒక నెల పాటు అందుబాటులో ఉంటాయి. ఇందులో వైద్యులు, సీఏలు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రొఫెష‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

చివరిగా

కొవిడ్ ప‌రిస్థితుల్లో డాక్ట‌ర్ల‌కు, వృత్తి నిపుణుల‌కు అనేక విష‌మ ప‌రిస్థితులు, స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. వారి వృత్తి జీవితంలో, కార్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌కు చాలా ఖ‌ర్చులు, బాధ్య‌త‌లు పెరిగాయి. వారి వృత్తుల్లో డిజిట‌లైజేష‌న్‌, రోగుల క‌నీస సౌక‌ర్యాల‌ను అందించ‌డానికి, మౌలిక సదుపాయాల‌ను పెంచ‌డానికి ఖ‌ర్చులు బాగా పెరిగాయి. ఇటువంటి ఖ‌ర్చులు భ‌రించ‌డానికి వారికి ప్రొఫెష‌న‌ల్ లోన్ అవ‌స‌ర‌మ‌యింద‌ని రుణ సంస్థ‌లు భావించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని