Lenskart: ఆసియా మార్కెట్‌పై లెన్స్‌కార్ట్‌ కన్ను.. జపాన్‌ కంపెనీలో మెజార్టీ వాటా!

Lenskart acquires japan Owndays: జపాన్‌కు చెందిన ఓన్‌ డేస్‌ (Owndays) కంపెనీలో లెన్స్‌కార్ట్‌ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

Published : 30 Jun 2022 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు చెందిన కళ్లజోళ్ల ఉత్పత్తుల సంస్థ లెన్స్‌కార్ట్‌ (Lenskart) దృష్టి ఇప్పుడు ఆసియా మార్కెట్‌పై పడింది. ఇప్పటి వరకు భారత్‌కే పరిమితమైన ఈ సంస్థ ఇతర దేశాలకూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన ఓన్‌డేస్‌ (Owndays) కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. విలీన ప్రాతిపదికన ఈ ఒప్పందం కుదిరింది. దీంతో ఈ విలీన కంపెనీ ఆసియాలోనే అతిపెద్ద కళ్లజోడు ఉత్పత్తుల సంస్థగా అవతరించనుంది. ఈ డీల్‌ విలువ మొత్తం 400 మిలియన్‌ డాలర్లని ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది.

1989లో టోక్యో వేదికగా ఓన్‌డేస్‌ కంపెనీ ఏర్పాటైంది. 2013లో ఆ కంపెనీ ఓవర్సీస్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం జపాన్‌తో పాటు మరో 12 దేశాల్లో 460 స్టోర్లను నిర్వహిస్తోంది. మరోవైపు భారత్‌లో 2010లో లెన్స్‌కార్ట్‌ తన ప్రయాణం మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌కు లెన్స్‌కార్ట్‌లో పెట్టుబడులు ఉన్నాయి. దేశీయంగా ప్రస్తుతం కళ్లజోళ్ల విభాగంలో అతిపెద్ద ఈ-కామర్స్‌ పోర్టల్‌గా లెన్స్‌కార్ట్‌ ఎదిగింది. విలీనం అనంతరం కూడా ఓన్‌డేస్‌ సపరేట్‌ బ్రాండ్‌గానే కొనసాగనుంది. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌పై ఈ బ్రాండ్‌ దృష్టి సారించనుంది. లెన్స్‌కార్ట్‌ మిడిల్‌, మాస్‌ మార్కెట్‌ విభాగమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించనుంది.

తాజా ఒప్పందంతో లెన్స్‌ కార్ట్‌ సేవలు మొత్తం 13 దేశాలకు విస్తరించున్నాయి. భారత్‌తో పాటు సింగపూర్‌, థాయ్‌లాండ్‌, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, మలేసియా, జపాన్‌ వంటి దేశాల్లో లెన్స్‌కార్ట్‌ అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి కళ్లజోళ్లు అవసరం అవుతుండగా.. కేవలం సగం మంది మాత్రమే వాటిని వినియోగిస్తున్నారని డీల్‌ సందర్భంగా లెన్స్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు పీయూష్‌ బన్సల్‌ పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ విస్తరణకు అవకాశం ఉందని తెలిపారు. 2023 మార్చి నాటికి 650 మిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు చేపట్టాలని విలీన కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని