LIC Bima Ratna: ఎల్ఐసీ కొత్త పాల‌సీ బీమా ర‌త్న ఫీచ‌ర్లివే!

వాయిదా రూపంలో ఇచ్చే మొత్తం కంటే క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తం త‌క్కువ‌గా ఉంటే క్లెయిమ్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు

Updated : 28 May 2022 14:37 IST

భార‌తీయ అతిపెద్ద బీమా సంస్థ‌ ఎల్ఐసీ, బీమా ర‌త్న పేరుతో స‌రికొత్త పాల‌సీని శుక్ర‌వారం ప్రవేశ పెట్టింది. ఇది నాన్‌-లింక్డ్, ఇండివిడ్యువ‌ల్, సేవింగ్స్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్‌. భ‌ద్ర‌త‌, పొదుపుల క‌ల‌యిక‌తో వ‌స్తుంది. గత ఆరు నెల‌ల కాల‌వ్య‌వ‌ధిలో ఎల్ఐసీ ప్రవేశ పెట్టిన రెండ‌వ మ‌నీ బ్యాక్ పాల‌సీ ఇది. డిసెంబ‌రు 2021లో 'ధన్ రేఖ' పేరుతో మ‌నీ బ్యాక్ పాల‌సీని లాంచ్ చేసింది. అయితే ధన్ రేఖ పాల‌సీ 20 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ కాలవ్య‌వ‌ధితో అందుబాటులో ఉండ‌గా, ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టిన కొత్త 'బీమా ర‌త్న' పాల‌సీతో 15 ఏళ్ల‌లోనే మీ డ‌బ్బు తిరిగి పొంద‌వ‌చ్చు. 

ఎల్ఐసీ బీమా ర‌త్న.. పాల‌సీదారు కుటుంబ సభ్యుల‌కు ఆర్థిక భ‌ద్ర‌త‌ను అందిస్తుంది. అనుకోకుండా పాల‌సీదారుడు పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే, కుటుంబ సభ్యులు జీవ‌నం సాగించేంద‌కు, వారి ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిర్ధిష్ట కాల‌వ్య‌వ‌ధుల‌లో డ‌బ్బు నామినీకి అందేటట్లుగా పాల‌సీని రూపొందించిన‌ట్లు సంస్థ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పాల‌సీ కాల‌వ్య‌ధిలో లిక్విడిటీ అవ‌స‌రాల‌కు పాల‌సీపై రుణ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. 

ఎల్ఐసీ బీమార‌త్న‌ ఫీచర్లు..

డెత్ బెనిఫిట్‌..
పాల‌సీ వ్య‌వ‌ధిలో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే (రిస్క్ వ్య‌వ‌ధి ముగిసిన త‌రువాత‌) హామీ మొత్తాన్ని 'గ్యారెంటీ అడిష‌న్స్‌'తో పాటు నామినీకి అంద‌జేస్తారు. పాల‌సీదారుడు పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే..బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు హామీ మొత్తం లో అధికంగా ఉన్న మొత్తం చెల్లిస్తారు. పాల‌సీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణించిన తేదికి ముందు వ‌ర‌కు చెల్లించిన ప్రీమియంల‌కు 105 శాతానికి (ఇత‌ర అద‌న‌పు ప్రీమియం, రైడ‌ర్ ప్రీమియంలు, ప‌న్నులు, ఛార్జీల రూపంలో స్వీక‌రించిన మొత్తాన్ని మిన‌హాయించి) త‌క్కువ కాకుండా డెత్ బెనిఫిట్ మొత్తాన్ని చెల్లిస్తారు.

గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా లభిస్తాయి. ఇక రిస్క్ పిరియ‌డ్లో ఉండ‌గా మ‌ర‌ణిస్తే ప్రీమియంల‌ (ప‌న్నులు, ఛార్జీల రూపంలో స్వీక‌రించిన ఇత‌ర అద‌న‌పు మొత్తం మిన‌హాయించి)ను తిరిగిచెల్లిస్తారు. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ మొత్తం ఒకేసారి కాకుండా ఐదేళ్లు వాయిదాల పద్ధతిలో కూడా తీసుకోవచ్చు.

పాల‌సీదారుడు రిస్క్ పిరియ‌డ్ కంటే ముందుగానే మ‌ర‌ణిస్తే చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని(ప‌న్నులు, ఛార్జీల రూపంలో స్వీక‌రించిన ఇత‌ర అద‌న‌పు మొత్తం మిన‌హాయించి) తిరిగి చెల్లిస్తారు. 

స‌ర్వైవ‌ల్‌ బెనిఫిట్‌..
పాలసీ కాలవ్యవధిలో పాల‌సీదారుడు జీవించి ఉంటే కింద పేర్కొన్న విధంగా ప్రాథ‌మిక హామీ మొత్తంలో నిర్ణీత శాతం క్రమమైన పధ్ధతిలో పాల‌సీ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి చెల్లిస్తారు.

* 15 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాలసీ తీసుకున్న 13, 14వ సంవ‌త్స‌రాల్లో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున‌
* 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాల‌సీ తీసుకున్న 18, 19 సంవ‌త్స‌రాల‌లో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున 
* 25 ఏళ్ల ప్లాన్‌ ఎంచుకుంటే.. పాల‌సీ తీసుకున్న 23, 24 సంవ‌త్స‌రాల‌లో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున పాల‌సీదారునికి చెల్లిస్తారు.

మెచ్యూరిటీ బెనిఫిట్‌..
పాల‌సీ వ్య‌వ‌ధి ముగిసే వర‌కు పాల‌సీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీపై హామీ ఇచ్చిన‌ మొత్తంతో పాటు గ్యారెంటీ అడిష‌న్స్‌ను కూడా చెల్లిస్తారు. మెచ్యూరిటీపై హామీ మొత్తం, బేసిక్ హామీ మొత్తంతో 50 శాతానికి స‌మానంగా ఉంటుంది. 

గ్యారెంటీడ్‌ అడిష‌న్స్‌..
ప్రీమియంల‌ను స‌కాలంలో చెల్లించ‌డం ద్వారా పాల‌సీ అమ‌ల్లో ఉన్నంత కాలం గ్యారెంటీడ్ అడిష‌న్స్ చెల్లిస్తారు. పాల‌సీ ప్రారంభ‌మైన 1 నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ప్ర‌తి రూ. 1000పై బేసిక్ హామీ మొత్తంపై రూ.50 చొప్పున‌, 6 నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కు ప్ర‌తి రూ. 1000పై బేసిక్ హామీ మొత్తంపై రూ.55 చొప్పున‌, 11 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ప్ర‌తి రూ.1000పై బేసిక్ హామీ మొత్తంపై రూ. 60 చొప్పున‌ గ్యారెంటీడ్ అడిష‌న్స్‌ను నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను అనుస‌రించి చెల్లిస్తారు.

పాల‌సీ అమ‌ల్లో ఉండ‌గా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే గ్యారెంటీడ్ అడిష‌న్స్ పూర్తి పాల‌సీ సంవ‌త్స‌రానికి వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ప్రీమియం చెల్లింపులు స‌కాలంలో చేయ‌క‌పోతే గ్యారెంటీడ్ అడిష‌న్స్ చెల్లింపులు నిలిపివేస్తారు. ఒక‌వేళ మ‌ధ్య‌లోనే పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే ఆ సంవ‌త్స‌రం చెల్లించిన ప్రీమియంల‌కు అనుగుణంగా గ్యారెంటీడ్ అడిష‌న్స్ ఉంటాయి. 

రిస్క్ పిరియ‌డ్‌..
8 సంవ‌త్స‌రాలలోపు మైన‌ర్ల‌కు పాల‌సీ ప్రారంభ‌మైన నాటి నుంచి 2 సంవ‌త్స‌రాలు లేదా 8 ఏళ్లు నిండే వ‌ర‌కు.. ఏది ముందుగా అయితే అంత వ‌ర‌కు.. రిస్క్ పిరియ‌డ్ ఉంటుంది. ఇది ముగిసిన త‌ర్వాత మాత్ర‌మే పాల‌సీ అమ‌ల్లోకి వస్తుంది. ఈ వ్య‌వ‌ధిలో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, ప్రీమియం మాత్ర‌మే తిరిగి చెల్లిస్తారు. 8 సంవ‌త్స‌రాలు నిండిన వారికి రిస్క్ పిరియ‌డ్ ఉండ‌దు. పాల‌సీ కొనుగోలు చేసిన నాటి నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంది.   

కనీస, గ‌రిష్ఠ‌ హామీ మొత్తం..
పాల‌సీ తీసుకున్న వారికి రూ.5 లక్షల క‌నీస హామీ మొత్తం ఉంటుంది. గరిష్ఠ హామీ మొత్తంపై పరిమితిలేదు. బేసిక్ హామీ మొత్తంపై రూ. 25 వేలు చొప్పున జోడిస్తూ ఎంతైనా తీసుకోవచ్చు.

పాలసీ కాలవ్యవధి..
15, 20, 25 సంవత్సరాల కాలవ్యవధులతో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పీఓఎస్‌పీ-ఎల్ఐ (పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ - లైఫ్ ఇన్సురెన్స్)/ కామన్ సర్వీస్ సెంటర్స్ (సీపీఎస్‌సీ- ఎస్‌పీవీ) ద్వారా పాల‌సీ కొనుగోలు చేసిన వారికి 15, 20 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధితో పాల‌సీ అందుబాటులో ఉంటుంది. 

కనీస ప్రవేశ వయసు..
* 90 రోజుల పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి 55 ఏళ్ల పెద్ద‌వారి వ‌ర‌కు పాల‌సీని తీసుకోవ‌చ్చు.
* 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 5 ఏళ్లు నిండి ఉండాలి. 
* 20 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 90 రోజులు నిండి ఉండాలి.
* 25 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 90 రోజులు నిండి ఉండాలి.

గ‌రిష్ఠ ప్ర‌వేశ వ‌య‌సు..
15 ఏళ్ల పాలసీకి..55 ఏళ్లు
20 ఏళ్ల పాలసీకి..50 ఏళ్లు
25 ఏళ్ల పాలసీకి..45 ఏళ్లు

ప్రీమియం చెల్లింపుల వ్యవధి..
బీమా ర‌త్న కింద 15 సంవత్సరాల పాలసీకి 11 ఏళ్లు, 20 సంవత్సరాల పాలసీకి 16 ఏళ్లు, 25 సంవత్సరాల పాలసీకి 21 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించొచ్చు. ప్రీమియంను వార్షికంగా గానీ, అర్థ వార్షికంగా గానీ,  త్రైమాసికంగా గానీ, నెల‌వారిగా గానీ( నెల‌వారి ప్రీమియం చెల్లింపుల‌ను ఎన్ఏసీహ‌చ్ ద్వారా మాత్ర‌మే అనుమతిస్తారు) లేదా జీతం నుంచి డిడ‌క్ట్ చేసుకునేలా చెల్లించ‌వ‌చ్చు. 

సెటిల్‌మెంట్ ఆప్ష‌న్లు..
ఈ పాల‌సీ కింద మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ మొత్తం ఒకేసారి కాకుండా ఐదేళ్లు వాయిదా పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. నెల‌వారిగా, త్రైమాసికంగా, అర్థ వార్షికంగా, వార్షికంగా తీసుకోవ‌చ్చు. నెల‌వారిగా రూ. 5000, త్రైమాసికంగా రూ. 15000, అర్థ వార్షికంగా రూ. 25,000, వార్షికంగా రూ. 50,000 చొప్పున చెల్లిస్తారు. ఒక‌వేళ వాయిదా రూపంలో ఇచ్చే మొత్తం కంటే క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తం త‌క్కువ‌గా ఉంటే క్లెయిమ్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. 

గ్రేస్ పిరియ‌డ్‌..
వార్షికంగా, అర్థ‌వార్షికంగా, త్రైమాసికంగా ప్రీమియంలు చెల్లించే వారికి 30 రోజులు, నెల‌వారిగా ప్రీమియంలు చెల్లించే వారికి 15 రోజుల గ్రేస్ పిరియ‌డ్ ఉంటుంది. మొద‌టి ప్రీమియం చెల్లించని రోజు నుంచి ఈ పిరియ‌డ్ వ‌ర్తిస్తుంది. గ్రేస్ పిరియ‌డ్ ముగిసే లోపుగా ప్రీమియంలు చెల్లిస్తే, ఎలాంటి అవాంత‌రాలు లేకుండా పాల‌సీ అమ‌ల‌వుతుంది. ఒక‌వేళ గ్రేస్ పిరియ‌డ్ ముగిసే లోపు ప్రీమియం చెల్లింపులు చేయ‌క‌పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది. ఈ గ్రేస్ పిరియ‌డ్ రైడ‌ర్ ప్రీమియంల‌కు కూడా వ‌ర్తిస్తుంది. 

పునరుద్ధ‌ర‌ణ‌..
గ్రేస్ పీరియడ్‌లోపు ప్రీమియంలు చెల్లించకపోతే, పాలసీ ర‌ద్దు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ ర‌ద్ద‌యిన‌ పాలసీని పునరుద్ధరించవచ్చు, అయితే మొదట చెల్లించని ప్రీమియం తేదీ నుంచి వరుసగా 5 సంవత్సరాలలోపు(మెచ్యూరిటీ కంటే ముందే) పున‌రుద్ధ‌రించాలి.

ఎలా కొనుగోలు చేయాలి?
ఈ పాల‌సీ ప్ర‌స్తుతం ఆఫ్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. ఏజెంట్లు/మధ్యవర్తులు పీఓఎస్‌పీ-ఎల్ఐ (పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ - లైఫ్ ఇన్సురెన్స్)/ కామన్ సర్వీస్ సెంటర్స్ (సీపీఎస్‌సీ- ఎస్‌పీవీ) ద్వారా కొనుగోలు చేయవచ్చు.

చివరిగా..

జీవిత బీమా పాలసీ కొనేముందు వాటి ఛార్జీలు, రాబడి లాంటి వివరాలను పరిశీలించడం మంచిది. అధిక బీమా హామీ పొందాలనుకుంటే టర్మ్ ప్లాన్ పరిశీలించవచ్చు. మంచి రాబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని