LIC - Adani Group: త్వరలో అదానీ గ్రూప్‌ వివరణ కోరతాం: ఎల్‌ఐసీ

అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ (Hindenburg) నివేదిక తర్వాత కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై తర్వలో అదానీ ప్రతినిథులతో సమావేశమై వివరణ కోరనున్నట్లు ఎల్‌ఐసీ (LIC) ప్రకటించింది. ఈ భేటీ ఎప్పడు జరగనుందనేది మాత్రం వెల్లడించలేదు. 

Updated : 09 Feb 2023 23:43 IST

ముంబయి: అదానీ గ్రూప్‌(Adani Group) వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో ఎల్‌ఐసీ(LIC) ఉన్నతాధికారులు స్పందించారు. తమ అధికారుల బృందం త్వరలో అదానీ గ్రూప్‌ ఉన్నతస్థాయి సిబ్బందితో భేటీ కానున్నట్లు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌. కుమార్‌ వెల్లడించారు. ఈ భేటీలో అదానీ సంస్థల్లో నెలకొన్న పరిణామాలపై వివరణ కోరతామని తెలిపారు.‘‘ఇప్పటికే మా పెట్టుబడిదారుల బృందం అదానీ గ్రూప్‌ నుంచి వివరణ కోరింది. ప్రస్తుతం మేము కంపెనీ ఫలితాలను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాం. అదానీ గ్రూప్‌ కంపెనీలలో నెలకొన్న పరిస్థితులపై మా సంస్థ ఉన్నతస్థాయి ఉద్యోగులతో సమావేశమై వివరించాలని వారిని కోరతాం. అదానీ సంస్థలలో  ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలానే కంపెనీలో నెలకొన్న సంక్షోభాన్ని వారు ఎలా ఎదుర్కొనబోతున్నారనే దానిపైనా వివరణ అడుగుతాం’’ అని ఎం.ఆర్‌. కుమార్‌ అన్నారు.

గత నెలలో అదానీ గ్రూప్‌లో లోపాలున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) నివేదిక ఇచ్చింది. దీంతో స్టాక్‌మార్కెట్‌లో ఒక్కసారిగా అదానీ గ్రూప్‌లోని వివిధ కంపెనీల షేర్లు విలువ పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలు అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడంపై విపక్ష పార్టీలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశాయి. దీంతో అదానీ గ్రూప్‌లో పరిస్థితులపై ప్రశ్నించే హక్కు తమకు ఉందని అప్పట్లో ఎల్‌ఐసీ స్పష్టం పేర్కొంది. తాజాగా ఆ కంపెనీ ఉన్నతస్థాయి ప్రతినిధులను కలిసి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని