LIC IPO: రేపే ఎల్‌ఐసీ ఐపీఓ లిస్టింగ్‌.. లాభాలొచ్చేనా?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి....

Published : 16 May 2022 20:32 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. ఈ బీమా దిగ్గజంపై నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన లక్షలాది మంది చిరుమదుపర్ల భవితవ్యం మంగళవారం తేలనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి కూరుకుపోయిన తరుణంలో ఎల్‌ఐసీ లిస్ట్‌ కానుండడం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠ ధర వద్ద కేంద్ర ప్రభుత్వం రూ.20,557 కోట్లు సమీకరించింది. షేర్లు కొనుగోలు చేసిన వారిలో ఎల్‌ఐసీ పాలసీదారులు కూడా ఉన్నారు. అంతర్జాతీయ బడా ఫండ్‌ సంస్థలు నష్టాలను కొంతమేర భరించగలవు. పైగా దీర్ఘకాలంలో ఈ షేర్లను అట్టిపెట్టుకోవడం వల్ల అవి లాభపడే అవకాశం ఉంది. కానీ, చిరు మదుపర్లు పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. చాలా మంది ఎల్‌ఐసీ మీద నమ్మకంతో షేర్లు కొనుగోలు చేశారు. వీరిలో చాలా మంది తొలిసారి స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్నవారు ఉన్నారు. ఒకవేళ స్టాక్స్ గనక ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడయితే వారికి నిరాశ తప్పదు. 2010 తర్వాత ఐపీఓకి వచ్చిన 21 ప్రభుత్వరంగ కంపెనీల్లో దాదాపు సగానికి పైగా ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి.

ఎల్‌ఐసీ ఐపీఓకి దాదాపు మూడు రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్కో షేరుపై రూ.60 రాయితీ పొందిన పాలసీదారులు వారికి కేటాయించిన విభాగంలో 6 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. ఉద్యోగుల విభాగంలో 1.94 రెట్లు, రిటైల్‌ విభాగంలో 1.94 రెట్లు, క్యూఐబీ 2.83 రెట్లు, ఎన్‌ఐఐలు 2.8 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్‌, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రే మార్కెట్‌ నిజమయ్యేనా?

అనధికారిక మార్కెట్‌గా చెప్పుకునే గ్రే మార్కెట్‌లో ఎల్‌ఐసీ ఐపీఓ రాయితీతో ట్రేడవుతుండడం గమనార్హం. ఇష్యూ ధరతో పోలిస్తే ఒక్కో షేరు రూ.15-20 తక్కువకు ట్రేడవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గ్రేమార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రామాణికం కాకపోయినప్పటికీ.. ఓ అంచనా కోసం మదుపర్లు దీన్ని పరిగణనలోకి తీసుకుంటుంటారు. అయితే, ఒక్కోసారి మదుపర్లను పక్కదారి పట్టించడానికి గ్రేమార్కెట్‌ను నియంత్రిస్తుంటారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో గ్రేమార్కెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

దీర్ఘకాలం లాభదాయకం.. నిపుణులు

మరోవైపు ఆర్థిక నిపుణులు, మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఎల్‌ఐసీ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందని సూచిస్తున్నారు. మదుపర్లు ఏమాత్రం తొందరపడొద్దని.. దీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. బీమా రంగంలో ఉన్న ఇతర ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఎల్‌ఐసీ భవిష్యత్తులో చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు దాని పీ/ఈవీ విలువతో పోలిస్తే 4 రెట్లు అధికంగా ట్రేడవుతున్నాయని వివరించారు. అలాగే ఎస్‌బీఐ షేర్లు పీ/ఈవీ విలువ కంటే 2.9 రెట్లు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు పీ/ఈవీ విలువ కంటే 2.2 రెట్లు అధిక ధర వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్లు సైతం భవిష్యత్తులో మంచి లాభాలిస్తాయని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని