LIC Dhan Varsha: ఒక్కసారి పెట్టుబడి.. బీమాతో పాటు రెండింతలకు పైగా రాబడి!

ఎల్‌ఐసీ ధన వర్ష పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీంట్లో బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనం కూడా ఉంటుంది. 

Updated : 18 Oct 2022 14:29 IST

LIC Dhan Varsha: దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) మరో కొత్త జీవిత బీమా పాలసీని తీసుకొచ్చింది. ‘ఎల్‌ఐసీ ధన వర్ష (ప్లాన్‌ 866)’ పేరిట దీన్ని అందిస్తోంది. దీంట్లో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇది క్లోజ్డ్‌ ఎండెడ్‌ ప్లాన్‌. 2023 మార్చి 31తో ప్లాన్‌ విక్రయాలు ముగియనున్నాయి. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటివ్‌, ఇండివిజువల్‌, సేవింగ్స్‌, సింగిల్‌ ప్రీమియం జీవిత బీమా పథకం. ఈ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో ఏజెంట్‌ లేదా పాయింట్ ఆఫ్‌ సేల్స్‌ పర్సన్స్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (POSP-LI)/ కామన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (CPSC-SPV) వంటి ఇతర మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తే ప్రీమియంపై రిబేట్‌ కూడా లభిస్తుంది.

మెచ్యూరిటీ బెనిఫిట్‌: కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారుడికి పాలసీలో పేర్కొన్న బేసిక్‌ హామీ మొత్తం (Basic Sum Assured)తో పాటు ఏటా కలిసే కచ్చితమైన రాబడి అందుతుంది.

ఏటా కచ్చితమైన చెల్లింపులు: పాలసీ కాలపరిమితి ముగిసే వరకు ప్రతి ఏటా కొంత మొత్తాన్ని మన ప్రీమియానికి కలుపుతూ పోతారు. ఒకవేళ పాలసీని మధ్యలోనే రద్దు చేసుకున్నా.. అప్పటి వరకు లభించిన మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా అందజేస్తారు. ఏటా ఎంత మొత్తం జత చేస్తారనేది మనం ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ కింది పట్టికలో ఆ వివరాలు చూడొచ్చు..

డెత్‌ బెనిఫిట్‌: పాలసీదారుడు ఒకవేళ మధ్యలోనే మరణిస్తే కుటుంబ సభ్యులకు పాలసీలో పేర్కొన్న హామీ మొత్తం (Sum Assured on Death)తో పాటు ఏటా కలిపే కచ్చితమైన రాబడి లభిస్తుంది.

మరణిస్తే లభించే మొత్తం మనం ఎంచుకున్న ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. 

  • ఆప్షన్‌ 1: ప్రీమియానికి 1.25 రెట్లు
  • ఆప్షన్‌ 2: ప్రీమియానికి 10 రెట్లు

* వయసు, హామీ మొత్తం, కాలపరిమితిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. అందుకనుగుణంగానే ఏటా కలిపే కచ్చితమైన రాబడి కూడా అందుతుంది.

వయసు: 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు 3 ఏళ్లు. 10 ఏళ్ల కాలపరిమితి గల పాలసీకి కనీసం 8 ఏళ్లు నిండి ఉండాలి.

రైడర్లు: ఈ పాలసీలపై ఎల్‌ఐసీ అందించే యాక్సిడెంటల్‌ డెత్‌ అండ్‌ డిజేబిలిటీ బెనిఫిట్‌ రైడర్‌, న్యూ టర్మ్‌ అస్యూరెన్స్‌ రైడర్‌ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రైడర్‌ను ఎంచుకుంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 

పాలసీపై రుణం: పాలసీ తీసుకొని మూడు నెలలు గడిచిన తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. రుణ మొత్తం పాలసీ సరెండర్‌ విలువ (మధ్యలో రద్దు చేసుకుంటే లభించే మొత్తం)పై ఆధారపడి ఉంటుంది. వడ్డీరేటును ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటుంది. మరిన్ని వివరాలు కింది పట్టికలో చూడొచ్చు..

బేస్‌ ప్లాన్‌ వివరాలు..

  • కనీస హామీ మొత్తం: రూ.1,25,000
  • గరిష్ఠ హామీ మొత్తం: పరిమితి లేదు
  • కనీస వయసు: 3 ఏళ్లు (15 ఏళ్ల పాలసీకి); 8 ఏళ్లు (10 ఏళ్ల పాలసీకి)
  • గరిష్ఠ వయసు: ఆప్షన్‌ 1- 60 ఏళ్లు;  ఆప్షన్‌ 2- 40 ఏళ్లు (పాలసీ కాలపరిమితి 10 ఏళ్లు), 35 ఏళ్లు (పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు)
  • కనీస మెచ్యూరిటీ వయసు: 18 ఏళ్లు
  • గరిష్ఠ మెచ్యూరిటీ వయసు: ఆప్షన్‌ 1- 75 ఏళ్లు;  ఆప్షన్‌ 2- 50 ఏళ్లు

ఒకవేళ 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఒకేసారి రూ.8,86,750 ప్రీమియం (జీఎస్టీ కలిపి రూ.9,26,654) చెల్లిస్తే ఆప్షన్‌ 1 కింద రూ.11,08,438 హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు అయితే గడువు ముగిసిన తర్వాత రూ.21,25,000 పొందొచ్చు. ఒకవేళ పాలసీ తీసుకున్న తొలి ఏడాదిలోనే మరణిస్తే రూ.11,83,438 కుటుంబానికి అందజేస్తారు. 15వ ఏడాదిలో మరణిస్తే రూ.22,33,438 అందుతాయి. అదే ఆప్షన్‌2 కింద రూ.8,34,642 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల హామీ లభిస్తుంది. ఒకవేళ మరణిస్తే రూ.79,87,000 అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని