LIC HFL: బ్యాంకుల బాటలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌.. గృహ రుణాలు మరింత ప్రియం!

LIC HFL: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL) సైతం వడ్డీ రేటును సవరించింది. ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (LHPLR)ను 60 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

Published : 20 Jun 2022 21:38 IST

ముంబయి: ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు మాదిరిగానే ప్రముఖ గృహ రుణ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL) సైతం వడ్డీ రేటును సవరించింది. ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (LHPLR)ను 60 బేసిస్‌ పాయింట్లు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు సోమవారం (జూన్‌ 20) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇకపై గృహ రుణాలు 7.50 శాతం నుంచి లభ్యమవుతాయని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగానే వడ్డీ రేట్లు పెంచామని ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వై. విశ్వనాథ్‌ గౌడ్‌ తెలిపారు. అయినా, ఇప్పటికీ తమ సంస్థ గృహ రుణాలు పోటీనిచ్చే స్థాయిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. గృహ రుణాలకు సంబంధించి ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును ప్రామాణికంగా తీసుకుంటుంది.

ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వడ్డీ రేటు (రెపో రేటు) 4.90 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను సవరించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సైతం రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ను 50 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వాటి బాటలోనే ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సైతం వడ్డీ రేటును పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని