LIC IPO: 29 కోట్ల మంది పాలసీదారులు.. లక్షకు పైగా ఉద్యోగులు! LIC గురించి 10 విషయాలు

LIC IPO: ఎల్‌ఐసీ ప్రభుత్వం పెట్టిన మూలధన పెట్టుబడి ఎంతో తెలుసా..?  

Published : 28 Apr 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) వచ్చే తేదీ ఖరారైంది. మే 4న ఐపీఓ ఓపెన్‌ అయ్యి 9న ముగియనుంది. మే 17న ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్‌ కానున్నాయి. కేవలం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. అయితే, కోట్లాది మంది పాలసీదారులు, లక్షలాది మంది ఉద్యోగులు, ఏజెంట్లు.. ఇలా దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్‌ఐసీలో ప్రభుత్వం పెట్టిన మూలధన పెట్టుబడి ఎంతో తెలుసా..? కేవలం అక్షరాలా రూ.5 కోట్లు! ఆ తర్వాత వివిధ దఫాల్లో పెట్టిన మొత్తం కూడా రూ.100 కోట్లే. కానీ ఇవాళ అదే కంపెనీ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి డివిడెండ్‌గా చెల్లించింది. ఐపీఓ ద్వారా మరికొన్ని వేల కోట్లు ఇవ్వబోతోంది. అలాంటి ఎల్‌ఐసీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  1. దేశంలోని గ్రామీణ ప్రాంతాల వారికి సైతం తక్కువ ధరకే బీమా సౌకర్యం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎల్‌ఐసీ ఏర్పాటైంది. జీవిత బీమా రంగాన్ని జాతీయీకరించాలన్న డిమాండ్‌ కొద్దీ మన దేశ పార్లమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టాన్ని, 1956ను తీసుకొచ్చింది.
  2. కేంద్రం చేసిన చట్టంతో 245 దేశ, విదేశాలకు చెందిన ఇన్సూరెన్స్‌ కంపెనీలు కనుమరుగై ఎల్‌ఐసీ అనే జీవిత బీమా సంస్థ అవతరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూ.5కోట్లు పెట్టుబడిగా పెట్టింది. పలు దఫాలుగా పెట్టిన పెట్టుబడితో ఆ మొత్తం రూ.100 కోట్లకు చేరింది.
  3. దేశీయ బీమా రంగంలో ఎల్‌ఐసీదే అగ్రస్థానం. సుమారు 66 శాతం మార్కెట్‌ వాటా ఎల్‌ఐసీ సొంతం. సుమార 29 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. 38 కోట్ల పాలసీలు ఉన్నాయి. లక్షకు పైగా ఉద్యోగులు, 11 లక్షలకు పైగా ఏజెంట్లు ఎల్‌ఐసీకి ఉన్నారు.
  4. కేవలం ఎల్‌ఐసీనే కాదు.. ఈ సంస్థకు కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49 శాతం వాటా ఉంది. అలాగే, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ పెన్షన్‌ ఫండ్‌, ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్‌, ఎల్‌ఐసీ కార్డ్స్‌ సర్వీసెస్‌, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ వంటివి అనుబంధ కంపెనీలుగా కొనసాగుతున్నాయి.
  5. దేశీయ సంస్థాగత మదుపరుల్లో ఎల్‌ఐసీనే పెద్దన్న. రేపో మాపో స్టాక్‌ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించనున్న ఎల్‌ఐసీ.. ఇది వరకే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఏటా సుమారు రూ.55 వేల నుంచి రూ.65 వేల కోట్ల రూపాయలు పెడుతూ వస్తోంది.
  6. దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో సైతం ఎల్‌ఐసీకి పెట్టుబడులు ఉన్నాయి. సుమారు రూ.95 వేల కోట్ల (2022 మార్చి నాటికి) ఉన్నాయి. అలానే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలైన టీసీఎస్‌ (₹50 వేల కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.45 వేల కోట్లు)లో సైతం పెద్ద ఎత్తున ఎల్‌ఐసీకి పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు ఐటీసీ, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ కంపెనీల్లోనూ ఎల్‌ఐసీకి వాటాలు ఉన్నాయి.
  7. దేశంలోని ఒక్కో కుటుంబ సభ్యుడు సగటున 100 రూపాయలు మదుపు చేస్తాడనుకుంటే అందులో 10 రూపాయలు ఎల్‌ఐసీలోకే వెళుతున్నాయని ఓ నివేదిక పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా పేరొందిన ఎస్‌బీఐ కంటే ఎల్‌ఐసీనే ఈ విషయంలో ముందుంది.
  8. ఎల్‌ఐసీకి అటు స్టాక్‌ మార్కెట్లతో పాటు ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వసెక్యూరిటీల్లో 37.45 శాతం వాటా ఎల్‌ఐసీదే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ పెద్ద ఎత్తున రుణాలు సమకూర్చే సంస్థ ఏదైనా ఉందంటే అది ఎల్‌ఐసీనే!
  9. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా కేవలం 5 శాతం మాత్రమే. మిగిలిన 95 శాతం యజమానులు వాటాదారులే. ఈ తరహా ఏర్పాటు మరే ఇతర సంస్థాకూ లేదు. కేవలం 5 శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి కోట్ల రూపాయలు డివిడెండ్‌ రూపంలో ఎల్‌ఐసీ చెల్లిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,613 కోట్లు డివిడెండ్‌ కింద ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది కాకుండా పన్నుల రూపంలో మరింత ఆదాయం ఎల్‌ఐసీ నుంచి ప్రభుత్వానికి సమకూరుతోంది.
  10. బీమా సంస్థల్లో క్లెయిముల పరిష్కారంలో ఎల్‌ఐసీకి మంచి పేరు ఉంది. 2018-19 ఐఆర్‌డీఏ వార్షిక నివేదిక ప్రకారం 99.7 శాతం క్లెయిములు పరిష్కారం అయ్యాయి. 2020-21 నాటికి 98.62 శాతంగా ఉంది. అందుకే బీమా రంగంలో భారతీయుల నమ్మకాన్ని ఎల్‌ఐసీ చూరగొంది. బీమా అంటేనే ఎల్‌ఐసీ అనే స్థాయికి చేరుకోగలిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని