LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ షేరు ధర రూ.949

ఎల్‌ఐసీ ఐపీఓ షేర్ల ధరను రూ.949గా నిర్ణయించారు...

Published : 13 May 2022 14:06 IST

గరిష్ఠ ధర వద్దే షేర్ల కేటాయింపు

దిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) షేర్ల ధరను రూ.949గా నిర్ణయించారు. పబ్లిక్‌ ఇష్యూ (Public Issue) ధరల శ్రేణిని రూ.902-949గా ప్రకటించిన విషయం తెలిసిందే. గరిష్ఠ ధర వద్దే మదుపర్లకు షేర్లు కేటాయించినట్లు శుక్రవారం ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఎల్‌ఐసీ (LIC) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా రూ.20,560 కోట్లు సమీకరించింది. ఈ షేర్లు మే 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

ఎల్‌ఐసీ ఐపీఓను సౌదీ ఆరామ్‌కో పబ్లిక్‌ ఇష్యూతో పోల్చుతుండడం విశేషం. ఇరు సంస్థలు భారీ పరిమాణంతో ఐపీఓకి వచ్చాయి. అలాగే ఆరామ్‌కో తరహాలోనే ఐల్‌ఐసీకి కూడా దేశీయ మదుపర్లే అండగా నిలిచారు. విదేశీ మదుపర్లు ఈ ఐపీఓ ధరల శ్రేణిని అధికంగా భావించారు. ఆఖరి రోజు చివరి గంటల్లో మాత్రమే బిడ్లు దాఖలు చేశారు.

దేశ క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO)నే అతిపెద్దది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూ (Public Issue)కి వచ్చిన కంపెనీల్లో పరిమాణం పరంగా ఇది నాలుగో అతిపెద్ద ఐపీఓ. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమన భయాలు మార్కెట్లను కలవరపెడుతున్న తరుణంలో ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO)కి వచ్చిన విషయం తెలిసిందే.

గ్రేమార్కెట్‌గా పిలిచే అనధికార మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేరు రూ.30 రాయితీతో ట్రేడవుతుండడం గమనార్హం. ఐపీఓ ప్రారంభమైన తొలిరోజు గ్రేమార్కెట్‌లో ఈ షేరు రూ.100 ప్రీమియం వద్ద చలించింది. లిస్టింగ్‌ దగ్గరకొస్తున్న కొద్దీ డిమాండ్ తగ్గిపోతున్నట్లు ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌ఐసీ షేర్లు అన్ని విభాగాల్లో కలిపి 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని