LIC IPO subscription status: ఎల్‌ఐసీ ఐపీఓకి స్పందన ఎలా ఉందంటే..

నేడు ప్రారంభమైన ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు స్పందన ఆశాజనకంగా కనిపిస్తోంది. తొలి గంటలో రిటైల్‌ విభాగంలో 12 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి....

Updated : 04 May 2022 12:57 IST

ముంబయి: నేడు ప్రారంభమైన ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు స్పందన ఆశాజనకంగా కనిపిస్తోంది. తొలి గంటలో రిటైల్‌ విభాగంలో 12 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. తర్వాత గంటలో మరో 16 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మొత్తంగా మధ్యాహ్నం 12:38 గంటల సమయానికి రిటైల్ విభాగానికి కేటాయించిన షేర్లు 34 శాతానికి దరఖాస్తులు అందాయి. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లలో అన్నీ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. అన్ని విభాగాల్లో కలిపి 31 శాతం షేర్లకు బిడ్లు అందాయి.

Also Read: ఎల్‌ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?

వివిధ విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్‌ స్టేటస్‌ ఇలా ఉంది..

* పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లు కేటాయించగా 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. 

* ఉద్యోగుల విభాగానికి 15.81 లక్షల షేర్లను అలాట్‌ చేశారు. 53 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

* నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ విభాగంలో 2.9 కోట్ల షేర్లకుగానూ 06 శాతానికి దరఖాస్తులు అందాయి.

* క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌కు ‌3.9 కోట్లు షేర్లు కేటాయించగా.. కేవలం 6060 షేర్లు మాత్రమే సబ్‌స్క్రైబ్‌ కావడం గమనార్హం.

Also Read: ఎల్‌ఐసీ ఐపీఓకి ఇలా దరఖాస్తు చేసుకోండి!

పూర్తి వివరాలు.. 10 పాయింట్లలో

  1. సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. భారత ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ (IPO).
  2. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న  స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు నమోదు కానున్నాయి.
  3. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ సైతం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది.
  4. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కనుంది. రిటైల్‌ మదుపర్లకు కూడా ఇంతే మొత్తంలో రాయితీ లభించనుంది.
  5. 50 శాతం షేర్లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (QIBs) కేటాయించారు. దీంట్లో 60 శాతం వాటాను యాంకర్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు. నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వె స్టర్లకు 15 శాతం, రిటైల్‌ మదుపర్లకు 15 శాతం వాటాలను కేటాయించారు.
  6. ఎల్‌ఐసీ విలువ (LIC IPO)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఏకీకృత వాటాదారుల విలువగా పరిగణించే సంస్థ ఎంబెడెడ్‌ విలువను సెప్టెంబరు 30, 2021 నాటికి రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 
  7. తొలుత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓ (IPO)లో విక్రయించి రూ.63,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, మార్కెట్‌లో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించారు.
  8. ఫిబ్రవరి 13న ఎల్‌ఐపీ పబ్లిక్‌ ఇష్యూ (LIC Public offer) కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. మార్చిలో అనుమతి లభించింది.
  9. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 2022-23లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  10. ఎల్‌ఐసీకి 13 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. 29 కోట్ల మంది పాలసీదారులకు సేవలందిస్తోంది. జనవరి 2022 నాటికి కొత్త బిజినెస్‌ ప్రీమియం వసూలులో ఈ సంస్థ మార్కెట్‌ వాటా 61.6 శాతం. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం.. 2020లో జీవిత బీమా కొనుగోలు 3.2 శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటుకు దాదాపు సమానం. ఈ రంగంలో 2019-2023 మధ్య ఏటా 5.3 శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని