Adani Stocks: అదాని షేర్ల పతనంతో ఎల్ఐసీ రూ.16,580 కోట్ల సంపద ఆవిరి

అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కథనంతో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ సంస్థలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోయింది.

Updated : 28 Jan 2023 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో అదానీ షేర్లు (Adani Stocks) భారీ స్థాయిలో నష్టాలను చవిచూశాయి. గత రెండు రోజుల్లో అదానీ షేర్లు కనిష్ఠాలను తాకాయి. దీంతో అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన రిటైల్‌, సంస్థాగత పెట్టుబడిదారులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇలా భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వాటిలో ఎల్‌ఐసీ (LIC) ఒకటి. అదానీ షేర్ల పతనంలో దేశీయ సంస్థాగత పెట్టుబడి దారి సంస్థ ఎల్‌ఐసీ రెండు రోజుల్లో రూ.16,580 కోట్ల సంపదను కోల్పోయింది. ఇందులో అధిక భాగం అదానీ గ్యాస్‌ వాటాలతోనే ఎల్‌ఐసీ నష్టపోయింది. అదానీ గ్యాస్‌లో ఎల్ఐసీకి 5.96 శాతం వాటా ఉంది. దీంతో ఈ వాటాలతో ఎల్‌ఐసీ రూ.6,232 కోట్ల సంపద ఆవిరైంది.

అదానీ సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు

అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ సంస్థకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (Adani Enterprises) ఎల్‌ఐసీ 4,81,74,654 షేర్లను కలిగి ఉంది(ఇది కంపెనీ చెల్లించవలసిన మొత్తం క్యాపిటల్‌లో 4.23 శాతం). గత రెండు మార్కెట్ సెషన్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కోషేర్‌ ధర రూ.673.5 నష్టపోయింది. దీంతో షేర్ ధర రూ.3,442  నుంచి రూ.2,768.50కు చేరటంతో ఎల్ఐసీ రూ.3,245 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

అదానీ పోర్ట్స్‌ 

అదానీ పోర్ట్స్‌ (Adani Ports)లో ఎల్‌ఐసీకి 19,75,26,194 షేర్లు ఉన్నాయి. ఇది అదానీ పోర్ట్స్‌ కంపెనీ వాటాలో 9.14 శాతంతో సమానం. గత రెండు మార్కెట్‌ సెషన్స్‌లో అదానీ పోర్ట్స్‌ షేరు ధర రూ.156.70 పడిపోయింది. ఒక్కో షేరు ధర రూ.761.20 నుంచి రూ.604.50కు చేరింది. దీంతో ఎల్‌ఐసీ రూ.3,095 కోట్ల సంపదను కోల్పోయింది.

అదానీ ట్రాన్స్‌మిషన్

2022 అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికానికి అదానీ ట్రాన్స్‌మిషన్‌ (Adani Transmission)లో ఎల్‌ఐసీకి 4,06,76,207 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీ వాటాలో 3.65 శాతంతో సమానం. రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ షేరు ధర రూ.747.95 తగ్గింది. షేరు విలువ రూ.2,762.15 నుంచి రూ.2,014.20కు పడిపోయింది. దీంతో ఎల్‌ఐసీ రూ.3,042కోట్ల నష్టాన్ని చవిచూసింది.

అదానీ గ్రీన్

2022 డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే నాటికి అదానీ గ్రీన్ (Adani Green) ఎనర్జీ లిమిటెడ్‌లో ఎల్‌ఐసీకి 2,03,09,080 షేర్లు ఉన్నాయి. అదానీ గ్రీన్ షేరు ధర గత రెండు రోజుల్లో రూ.430.55 తగ్గింది. దీంతో రెండు సెషన్లలో ఎల్‌ఐసీకి దాదాపు రూ.875 కోట్ల నష్టం వాటిల్లింది.

అదానీ టోటల్ గ్యాస్

2022 డిసెంబర్‌ త్రైమాసికం నాటికి అదానీ టోటల్‌ గ్యాస్‌లో ఎల్‌ఐసీకి  5.96శాతం వాటా ఉంది. మొత్తం 2,03,09,080 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. అదానీ టోటల్ గ్యాస్ షేరు ధర గత రెండు రోజుల్లో రూ.963.75 తగ్గింది. దీంతో ఎల్‌ఐసీ దాదాపు రూ.6,323 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని