LIC IPO: ఐపీఓకి ముందు ₹5627 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ

ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌లో యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్ల ద్వారా రూ.5,627 కోట్లు సమీకరించినట్లు కంపెనీ మంగళవారం వెల్లడించింది....

Updated : 03 May 2022 15:44 IST

యాంకర్‌ బుక్‌లో 71% షేర్లు దేశీయ ఫండ్లకు కేటాయింపు

దిల్లీ: ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (LIC IPO)లో యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్ల ద్వారా రూ.5,627 కోట్లు సమీకరించినట్లు కంపెనీ మంగళవారం వెల్లడించింది. ఈ విభాగానికి పూర్తి స్థాయి స్పందన లభించిందని పేర్కొంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల (Anchor Investors)కు దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీరికి రూ.949 గరిష్ఠ ధర వద్ద షేర్లను కేటాయించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఎల్‌ఐసీ (LIC) వెల్లడించింది.

యాంకర్‌ ఇన్వెస్టర్ల (Anchor Investors) విభాగానికి 5.9 కోట్ల షేర్లను కేటాయించారు. దీంట్లో 4.2 కోట్ల షేర్లు (71.12 శాతం) 99 పథకాల ద్వారా 15 దేశీయ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కొటాక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌, యూటీఐ రిటైర్‌మెంట్‌ సొల్యూషన్స్‌ పెన్షన్‌ ఫండ్‌ స్కీం వంటి సంస్థలు దరఖాస్తు చేసుకున్న వాటిలో ఉన్నాయి. మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌ గ్లోబల్‌, బీఎన్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ వంటి విదేశీ సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. 

Also Read: ఎల్‌ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?  

ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (IPO)లో 22,14,74,920 షేర్లను రూ.902- 949 ధరల శ్రేణిలో విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) రేపు ప్రారంభమై 9న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. అలాగే దేశంలోనే అత్యధిక నిధులను సమీకరించిన ఐపీఓగా ఇది నిలువనుంది. ఇప్పటి వరకు 2021లో పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లు, 2010లో కోల్‌ ఇండియా సమీకరించిన రూ.15,200 కోట్లు నిధుల సమీకరణ పరంగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని