LIC: అదానీ గ్రూపును ప్రశ్నించే హక్కు మాకుంది : ఎల్‌ఐసీ

హిండెన్‌బర్గ్‌ నివేదిక (Hindenburg Report) అనంతరం అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనమవుతున్నాయి. దీంతో అందులో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ (LIC) కూడా నష్టాలను చవిచూస్తోంది. ఈ క్రమంలో అదానీ గ్రూపును ప్రశ్నించే హక్కు మాకుందని.. దీనిపై త్వరలోనే క్లారిటీ తీసుకుంటామని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

Published : 30 Jan 2023 19:36 IST

దిల్లీ: అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg Report) ఇచ్చిన నివేదిక దేశ స్టాక్‌మార్కెట్లను తీవ్ర ఒడిదొడుకులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన స్పందనను విశ్లేషిస్తున్నామని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లోనే అదానీ గ్రూపుతో సమావేశమై పూర్తి సమాచారం తెలుసుకుంటామని వెల్లడించింది.

‘ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాస్తవ పరిస్థితులేంటో మాకు తెలియదు. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన సంస్థగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. వారితో కలిసి మాట్లాడుతాం’ అని ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. తాము ఆందోళన చెందుతున్న అంశాలపై ఏ విధమైన సమాధానం వస్తుందో చూస్తామని.. ఒకవేళ సరైన సమాచారం రాకుంటే మరింత స్పష్టత కోరతామని చెప్పారు.

మరోవైపు షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్‌.. ఇదొక కంపెనీపై చేసిన దాడి కాదని, భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అయితే అదానీ గ్రూప్‌ స్పందనకు దీటుగా బదులిచ్చిన హిండెన్‌బర్గ్‌.. జాతీయవాదం పేరు చెప్పి మోసాన్ని దాచి ఉంచలేరని స్పష్టం చేసింది. ఇలా హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూపు షేర్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ రెండు రోజుల్లోనే వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని