Adani group: అదానీ గ్రూప్‌లో LIC పెట్టుబడులు.. భారీగా క్షీణించిన విలువ!

LIC- Adani group: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ భారీగా క్షీణించింది. దాదాపు పెట్టుబడి పెట్టిన మొత్తం స్థాయికి చేరింది.

Published : 24 Feb 2023 14:21 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌లో (Adani group) పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ (LIC) ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రూప్‌ షేర్లు పతనం అవ్వడంతో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ సైతం భారీగా క్షీణించింది. అయినప్పటికీ తాము నికరంగా లాభాల్లోనే ఉన్నామని ఎల్‌ఐసీ గత నెల పేర్కొంది. ఇప్పుడా మొత్తమూ భారీగా హరించుకుపోయింది. దీంతో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.33,686 కోట్లకు చేరింది. పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే ఇది కేవలం లాభం రూ.3వేల కోట్లు మాత్రమే అదనమని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ బిజినెస్‌ లైన్‌’ ఓ కథనంలో పేర్కొంది.

అదానీ గ్రూప్‌ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌ షేర్లలో ఎల్‌ఐసీ మొత్తం రూ.30,127 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్‌ షేర్లు భారీ లాభాల్లో కొనసాగినప్పుడు ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఈ మొత్తం పెట్టుబడిపై రూ.50వేల కోట్లు అదనంగా ఉంది. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వెలువడ్డాక ఆ మొత్తం భారీగా క్షీణించింది. ఈ క్రమంలోనే జనవరి 30న అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్‌ఐసీ వివరణ ఇచ్చింది. తమ మొత్తం పెట్టుబడుల్లో 1 శాతం కూడా అదానీ గ్రూప్‌ కంపెనీల్లో లేవని ఎల్‌ఐసీ తెలిపింది. ఇప్పటికీ పెట్టుబడిపై రూ.26వేల కోట్ల లాభాల్లో ఉన్నామని పేర్కొంది.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వచ్చి నెల దాటుతున్నా అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీంతో జనవరి 30 తర్వాత ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.22,876 కోట్లు హరించుకుపోయింది. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ప్రస్తుత విలువ ప్రకారం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ రూ.33,686 కోట్లకు చేరింది. అంటే ఎల్‌ఐసీ పెట్టుబడి పెట్టిన దానిపై మిగిలింది రూ.3వేల కోట్లు మాత్రమేనని బిజినెస్‌లైన్‌ తెలిపింది. అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ మరింత క్షీణిస్తే.. పెట్టుబడి పెట్టిన మొత్తానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ ఎల్‌ఐసీ తన వాటాలను విక్రయించాలని నిర్ణయిస్తే మాత్రం అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లపై మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని