Twitter CEO: ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో.. మస్క్‌ ప్రకటన

Twitter CEO: ట్విటర్‌ నూతన సీఈవోగా ఎన్‌బీసీ యూనివర్సల్‌ ఎగ్జిక్యూటివ్‌ లిండా యాకరినో నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

Published : 12 May 2023 22:06 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ నూతన సీఈవోగా ఎన్‌బీసీ యూనివర్సల్‌ ఎగ్జిక్యూటివ్‌ లిండా యాకరినో (Linda Yaccarino) నియమితులయ్యారు. ఈ మేరకు ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ ట్విటర్‌ సీఈవోగా లిండా యాకరినోను స్వాగతిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆమె ప్రత్యేకంగా బిజినెస్‌ ఆపరేషన్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తారు. నేను ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త టెక్నాలజీ పై దృష్టి పెడతాను’’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. నూతన సీఈవో బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇవాళ ఉదయమే వెల్లడించారు. అయితే, పేరును మాత్రం బహిర్గతం చేయలేదు. తాజాగా ఆమె పేరును ప్రకటించారు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు తీసుకోనున్నట్లు మస్క్‌ తెలిపారు.

ఎవరీ లిండా?

లిండా (Linda Yaccarino) ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. యాకరినో గత నెల ఓ కార్యక్రమంలో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరివురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో లిండా (Linda Yaccarino) దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో ఆమెది కీలక పాత్ర. అంతకు ముందు టర్నర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.

పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లిండా (Linda Yaccarino) లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివారు. ట్విటర్‌లో మస్క్‌ చేస్తున్న మార్పులకు ఆమె ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ట్విటర్‌ మస్క్‌ చేతికి వచ్చినప్పటి నుంచే ఆమె సీఈఓగా ఉండడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. అయితే, కంపెనీలో కీలక మార్పులు పూర్తయ్యే వరకు ఎలాన్‌ మస్క్‌కు సమయం ఇవ్వాలని ఆమె భావించారట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని