Post office: పోస్టల్‌ ఖాతాదారులకు అలర్ట్‌!.. ఆ పథకాలను సేవింగ్స్‌ అకౌంట్‌కు లింక్‌ చేశారా?

postal schemes: వెంట‌నే ఈ ఖాతాల‌ను పొదుపు ఖాతాతో అనుసంధానించ‌మ‌ని పోస్ట‌ల్ శాఖ‌ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను కోరింది. 

Published : 07 Mar 2022 16:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసు (Post office) అందించే పొదుపు ప‌థ‌కాలు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. ముఖ్యంగా పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ (MIS), టైమ్‌ డిపాజిట్లు (TD), సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి ప‌థ‌కాల్లో పొదుపు చేస్తూ నెలవారీ, త్రైమాసికంగా, వార్షిక ప్రాతిప‌దిక‌న క్ర‌మ‌మైన వ‌డ్డీ ఆదాయాన్ని పొందే వీలుంది. ఈ పోస్టాఫీసు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని ఇప్ప‌టికీ కొంత మంది న‌గ‌దు రూపంలోనే విత్‌డ్రా చేసుకుంటున్నారని గుర్తించిన పోస్ట‌ల్ శాఖ ఇటీవల ఓ సర్క్యలర్‌ జారీ చేసింది.

ఈ స‌ర్క్యులర్‌ ప్రకారం.. 2022 ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు పొదుపు పథకాలకు సంబంధించిన వ‌డ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు పొదుపు ఖాతా లేదా బ్యాంకు ఖాతాకు మాత్ర‌మే జ‌మ చేస్తామ‌ని పోస్టల్‌ శాఖ వెల్ల‌డించింది. అందువ‌ల్ల పోస్టాఫీసు ఖాతాల్లో మదుపు చేసేవారు మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాల‌ను పోస్టాఫీసు పొదుపు ఖాతా లేదా బ్యాంక్‌ అకౌంట్‌తో త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాల‌ని కోరింది. ఒక‌వేళ ఈ తేదీలోపు అనుసంధానించ‌కపోతే వ‌డ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ ఖాతా (Sundry Account)కు బ‌దిలీ చేస్తామ‌ని పోస్టల్‌ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా న‌గ‌దు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వ‌డ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామ‌ని పోస్ట‌ల్ శాఖ‌ తెలిపింది.

పొదుపు ఖాతాను లింక్ చేయ‌డం వల్ల ప్ర‌యోజ‌నాలు..

  • MIS/SCSS/ TD ఖాతాల నుంచి పొందిన‌ వ‌డ్డీ ఆదాయాన్ని నేరుగా విత్‌డ్రా చేసుకోకుండా పొదుపు ఖాతాకు జ‌మ‌చేయ‌డం వ‌ల్ల‌ వ‌డ్డీ ఆదాయం తిరిగి వ‌డ్డీని ఆర్జిస్తుంది.
  • అవ‌స‌ర‌మైన‌ప్పుడు డిపాజిట్‌దారులు పోస్టాఫీసుకు రాకుండానే వ‌డ్డీ ఆదాయాన్ని ఆన్‌లైన్‌ స‌హా వివిధ మార్గాల్లో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
  • ఆయా ఖాతాల నుంచి న‌గ‌దు రూపంలో విత్‌డ్రా చేయాల‌నుకున్న ప్ర‌తిసారీ ఫారం నింపాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఫారాలు నింపాల్సిన అవసరం ఉండదు.
  • డిపాజిటర్లు వారి MIS/SCSS/ TD ఖాతాల నుంచి పొందిన వ‌డ్డీ ఆదాయాన్ని పోస్టాఫీస్‌ సేవింగ్స్ ఖాతా ద్వారా రిక‌రింగ్‌ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతాలకు ఆటోమేటిక్‌గా జమయ్యే సౌకర్యాన్ని పొందొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని