LinkedIn: ఉద్యోగాన్వేషణలో తోడుగా.. లింక్డిన్‌లో కొత్త ఏఐ టూల్స్‌

LinkedIn: జాబ్‌ సెర్చ్‌లో యూజర్లకు ఉపయోగపడేలా లింక్డిన్‌ కొత్త ఏఐ టూల్స్‌ను తీసుకొచ్చింది.

Published : 17 Jun 2024 15:29 IST

LinkedIn | ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలు సహా ఇంటర్నెట్‌ ఆధారిత వేదికలన్నీ కృత్రిమ మేధ సాధనాలను (AI Tools) ప్రవేశపెడుతున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు కొత్త అవకాశాలు, అనుభూతులను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ లింక్డిన్‌ (LinkedIn) సైతం చేరింది. ఉద్యోగాన్వేషణలో ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ మాధ్యమం ఆ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా    ఏఐ సాధనాలను రూపొందించింది.

లింక్డిన్‌లో (LinkedIn) కావాల్సిన జాబ్‌ పోస్టింగ్స్‌ను వెతకడం కోసం ఇప్పటివరకు వివిధ రకాల ఫిల్టర్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఏఐ టూల్స్‌ (AI Tools) ఆ పనిని సులభతరం చేయనున్నాయి.   ఈ కొత్త ఫీచర్లను ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రమే పొందనుండడం గమనార్హం.

కొత్త సాధనాలివే..

జాబ్‌ సీకర్‌ కోచ్‌: ఈ ఏఐ అసిస్టెంట్‌ వర్చువల్‌ రిక్రూటర్‌ తరహాలో ఉపయోగపడుతుంది. కావాల్సిన ఉద్యోగం.. అది ఎలా ఉండాలో ఇంగ్లిష్‌లో టైప్‌ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు ‘‘నా నెట్‌వర్క్‌లో రూ.10 లక్షల వార్షిక వేతనంతో కూడిన డేటా అనలిస్ట్‌ ఉద్యోగాన్ని వెతికి పెట్టు’’ అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేస్తే చాలు. డేటాబేస్‌లో దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని యూజర్‌ ముందుంచుతుంది. పైగా దానికి దరఖాస్తు చేసుకుంటే మీ ప్రొఫైల్‌ ముందు వరుసలో ఉండేలా ఎలాంటి మార్పులు చేయాలో కూడా సూచిస్తుంది.

రెజ్యుమె అండ్‌ అప్లికేషన్‌ రివ్యూ టూల్: ఈ టూల్‌లో రెజ్యుమె, అప్లికేషన్‌లను అప్‌లోడ్‌ చేస్తే ఏఐ వాటిని క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. ఎక్కడెక్కడ మెరుగుపర్చాలో సూచిస్తుంది. జాబ్‌కు సెలెక్ట్‌ అయ్యేలా మీ రెజ్యుమె, అప్లికేషన్‌లోని ఏయే స్కిల్స్‌ను హైలైట్‌ చేయాలో తెలియజేస్తుంది.

కవర్‌ లెటర్‌ అసిస్టెన్స్‌: సరైన కవర్‌ లెటర్‌ను రూపొందించడం సమయంతో కూడుకొన్న అంశం. కవర్‌ లెటర్‌ అసిస్టెన్స్‌ దాన్ని సులభం చేస్తుంది. ఈ ఇంటరాక్టివ్ చాట్‌బాట్‌తో చాట్‌ చేస్తూ మీ నైపుణ్యాలు, అనుభవం, ఎలాంటి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారో తెలియజేస్తే సరిపోతుంది. వాటికి అనుగుణంగా ఓ డ్రాఫ్ట్‌ కవర్‌ లెటర్‌ను సిద్ధం చేస్తుంది.

ఏఐ సాయంతో నిపుణుల సలహా: వివిధ రంగాలకు చెందిన నిపుణులు అందించే సలహాలను ముందుగానే ఏఐలో నిక్షిప్తం చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు కొత్త వాటితో అప్‌డేట్‌ చేస్తారు. యూజర్లు అడిగే ప్రశ్నలకు అనుగుణంగా ఆయా రంగాల్లోని నిపుణుల సూచనలను వారి ముందుంచుతారు.

ఈ ఏఐ ఆధారిత ఫీచర్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు మరింత సమర్థమైన, కావాల్సిన ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లు ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించాలి. వీటితో పాటు రిక్రూటింగ్‌ సంస్థలకు కూడా ఉపయోగపడేలా కొత్త సాధనాలను తీసుకొస్తున్నట్లు లింక్డిన్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు