Emergency Fund: అత్యవసర నిధికి లిక్విడ్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఏది మేలు?

పెట్టుబడిదారులు తమ అత్యవసర నిధిని ఉంచేందుకు ఎంచుకునే పెట్టుబడుల్లో ప్రధానమైనవి లిక్విడ్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.

Updated : 29 Oct 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది 30 శాతం మంది పెట్టుబడిదారులు తమ ఆర్థిక ప్రణాళికలో అత్యవసర నిధికి రెండో ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు తమ అత్యవసర నిధిని ఉంచేందుకు ఎంచుకునే పెట్టుబడుల్లో ప్రధానమైనవి లిక్విడ్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. అయితే ఏ పెట్టుబడి ఎంచుకోవాలో మాత్రం ఒకింత గందరగోళానికి లోనవుతున్నారు. ఈ పెట్టుబడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడ్‌ ఫండ్లు అంటే..

లిక్విడ్‌ ఫండ్లు.. స్థిర ఆదాయాన్ని ఇచ్చే 3 నెలలు లేదా 91 రోజుల కాలవ్యవధి గల ట్రెజరీ బిల్లులు, కమర్షియల్ పేపర్, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, డిబెంచర్లు వంటి సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. లిక్విడ్‌ ఫండ్లలో లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉండదు. కాబట్టి అవసరమైనప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఫండ్లలో నగదు లభ్యత (లిక్విడిటీ) ఎక్కువగా ఉంటుంది. స్వల్ప, దీర్ఘకాల మూలధన రాబడిపై (ఇండెక్సేషన్‌ ప్రయోజనంతో) పన్ను వర్తిస్తుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..

చాలా వరకు బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అందిస్తున్నాయి.  స్వల్పకాలంలో పొదుపు ఖాతాతో సమానమైన రాబడిని ఆశించవచ్చు. కనీసం 1-2 ఏళ్లు మదుపు చేస్తేనే మంచి రాబడి పొందగలం. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో ఎంచుకున్న కాలవ్యవధి వరకు డబ్బు లాక్‌ చేస్తారు. ఒకవేళ ముందుగానే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే వర్తించే పెనాల్టీతో వడ్డీ ఆదాయం తగ్గుతుంది.

అత్యవసర నిధికి ఏది మేలు?

లిక్విడిటీ..
అత్యవసర నిధిలో ముఖ్యంగా చూడాల్సింది నగదు లభ్యత (లిక్విడిటీ). లిక్విడ్‌ ఫండ్లలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఫండ్లు ఏటీఎం కార్డు లాంటివి అందిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయానికి వస్తే.. వీటిలో నిర్ణీత కాలవ్యవధికి లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. అయితే చాలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే రిడీమ్‌ చేసుకోవచ్చు. పెనాల్టీ కూడా వేయకుండా నేరుగా మన ఖాతాలోకే డబ్బు చేరుతుంది. కొన్ని బ్యాంకులు స్వీప్‌ ఇన్‌ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. అంటే పొదుపు ఖాతాలో డబ్బు నిర్ణీత మొత్తం కంటే ఎక్కువగా ఉంటే  ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు వెళ్లుతుంది. కావాల్సిన డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అత్యవసర నిధి కోసం ఎఫ్‌డీ చేస్తుంటే ఇలాంటి ఖాతాలను ఎంచుకోవచ్చు.

నష్టభయం..
లిక్విడ్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రెండింటికీ నష్టభయం తక్కువగానే ఉంటుంది. అయితే లిక్విడ్‌ ఫండ్లలో పూర్తిగా నష్టభయం లేదని చెప్పలేం. అలాగే బ్యాంకు డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. కాబట్టి, ఈ పరిధి మేరకు దాదాపు నష్టభయం ఉండదనే చెప్పాలి. 

రాబడి..
ఒక సంవత్సరం కాలపరిమితికి లిక్విడ్‌ ఫండ్లు సగటున దాదాపు 4 నుంచి  4.50 శాతం రాబడి అందించవచ్చు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వరుసగా మూడోసారి రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచిన తర్వాత దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ఒక సంవత్సరం కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రస్తుతం 5.25% వరకు కూడా వడ్డీ లభిస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేట్లు లాక్ అయి ఉంటాయి. కాబట్టి కాలపరిమితి పూర్తయ్యే వరకు అదే వడ్డీ రేటు కొనసాగుతుంది. స్థిర రాబడి ఉంటుంది. కానీ లిక్విడ్‌ ఫండ్లలో భవిష్యత్తులో వడ్డీ రేట్లు మారితే రాబడి కూడా మారుతుంది. 

ఆదాయపు పన్ను..
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పన్ను చెల్లింపుదారుకు వర్తించే స్లాబ్‌ ప్రకారం వడ్డీ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్ని డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం రూ. 40 వేలు దాటితే మూలం వద్ద పన్ను(టీడీఎస్‌) విధిస్తారు. సీనియర్‌ సిటిజన్లకు ఈ పరిధి రూ. 50 వేల వరకు ఉంటుంది. వడ్డీ ఆదాయం ఈ మేరకు మించి ఉండి, వార్షిక ఆదాయం పన్ను పరిధిలోపు ఉంటే ఫారం 15జి/హెచ్‌ సమర్పించి టీడీఎస్‌ లేకుండా చూసుకోవచ్చు. 5 ఏళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీలపై సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.

లిక్విడ్‌ ఫండ్ల స్వల్ప, దీర్ఘకాల మూలధన రాబడిపై పన్ను వర్తిస్తుంది. మూడేళ్లలోపు విత్‌డ్రా చేసుకుంటే స్వల్పకాల మూలధన రాబడిగా పరిగణించి వ్యక్తి ఆదాయపు స్లాబు ప్రకారం పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకుంటే దీర్ఘకాల మూలధన రాబడిగా పరిగణించి 20 శాతం (ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది) వర్తిస్తుంది.

చివరిగా..
మూడు నెలల నుంచి 6 నెలల కోసం పెట్టుబడి పెట్టేవారు లిక్విడ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ కాలపరిమితికి పెట్టుబడి పెట్టేవారు లిక్విడ్‌ ఫండ్లకు బదులు డెట్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే ముందే వాటి మీద అవగాహన  తప్పనిసరి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో 1-3 ఏళ్ల  కాలానికి మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు