Electric Vehicles: ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్ బైక్‌ ఎప్పుడు రానుందంటే?

ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ రూ.500 కోట్లు సమీకరించేందుకు యోచిస్తోందని కంపెనీ ఎండీ, సీఈఓ యోగేశ్‌ భాటియా తెలిపారు....

Published : 25 Sep 2022 14:16 IST

దిల్లీ: ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ రూ.500 కోట్లు సమీకరించేందుకు యోచిస్తోందని కంపెనీ ఎండీ, సీఈఓ యోగేశ్‌ భాటియా తెలిపారు. సొంత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార విస్తరణకు వీటిని ఉపయోగిస్తామని వెల్లడించారు. 2023 ద్వితీయార్ధంలో కంపెనీ నుంచి తొలి వాహనాన్ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్‌సన్‌కు చెందిన హరియాణాలోని బవల్‌ తయారీ కేంద్రాన్ని సొంతం చేసుకున్న సయేరా ఎలక్ట్రిక్‌ ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకొంది. అక్కడి నుంచే తొలిదశలో తమ వాహనాలను తయారు చేయనుంది. వివిధ కేటగిరీల్లో మొత్తం మూడు వాహనాలను విడుదల చేస్తామని భాటియా తెలిపారు. వీటిలో ఎలక్ట్రిక్‌ బైక్‌ 2023 ద్వితీయార్ధంలో మార్కెట్‌లోకి వస్తుందన్నారు. కంపెనీ నుంచి రాబోయే రెండో బైక్‌.. విద్యుత్తు స్కూటర్‌, మోటార్‌సైకిల్‌ సమ్మేళనమైన హైపర్‌ బైక్ అని పేర్కొన్నారు. మూడోది ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అని వెల్లడించారు.

గత ఏడాది ఆగస్టులో ఎల్‌ఎంఎల్‌ బ్రాండ్‌ను, దాని మేధోపరమైన హక్కులను ఎస్‌జీ కార్పొరేట్‌ మొబిలిటీ సొంతం చేసుకుంది. బ్రాండ్‌ కొనుగోలు, వాహన అభివృద్ధి, తొలిదశ తయారీ.. వంటి ప్రాథమిక దశ కార్యకలాపాలకు రూ.350 కోట్లు కేటాయించినట్లు భాటియా తెలిపారు. భారత్‌ సహా విదేశాల్లో కంపెనీ వ్యాపార విస్తరణకు రూ.400-500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సొంతంగా వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమన్నారు.

తొలిదశ తయారీ కోసం ప్రస్తుతానికి సయేరాతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నప్పటికీ.. సమాంతరంగా సొంత తయారీ కేంద్రం ఏర్పాట్లను కూడా ముమ్మరం చేస్తున్నామన్నారు. దాదాపు రెండేళ్లలో సొంత కేంద్రంలో తయారీ ప్రారంభిస్తామని తెలిపారు. 2025 నాటికి ఏటా 10 లక్షల వాహనాల ఉత్పత్తే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. వచ్చే 4-5 ఏళ్లలో ప్రతి జిల్లాలో తమ విక్రయ కేంద్రాలు ఉండేలా చూస్తామన్నారు.

1990ల్లో మంచి జనాదరణ ఉన్న ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఎల్‌ఎంఎల్‌ ఒకటి. కాన్పూర్‌ కేంద్రంగా పనిచేసిన ఈ కంపెనీ క్రమంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకొని చివరకు దివాలా తీసింది. 2018లో కంపెనీ లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్‌ ధర్మాసనం ఆదేశించింది. విద్యుత్తు వినియోగ వస్తువులు, డెటెల్‌ బ్రాండ్‌తో విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీలో ఉన్న భాటియా నేతృత్వంలోని ఎస్‌జీ కార్పొరేట్‌ మొబిలిటీ గత ఏడాది ఆగస్టులో సింఘానియా కుటుంబం నుంచి ఎల్‌ఎంఎల్‌ బ్రాండ్‌, దాని మేధోపరమైన హక్కుల్ని సొంతం చేసుకుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts