Loan Default: ఒకసారి లోన్‌ డిఫాల్డ్‌ అయితే మళ్లీ దరఖాస్తు చేయొచ్చా?

ఒకసారి రుణం తీసుకున్నప్పుడు అది డిఫాల్ట్‌ అయితే, మళ్లీ రుణానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, రుణ సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయో ఇక్కడ చూడండి.

Published : 25 Sep 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల వద్ద చాలా మంది ఏదో ఒక సందర్భంలో రుణం తీసుకునే ఉంటారు. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల రుణాన్ని తీర్చలేకపోవచ్చు. లేక ఈఎంఐ చెల్లించడం ఆలస్యం కావచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు భవిష్యత్‌లో మళ్లీ రుణానికి దరఖాస్తు చేస్తే, మంజూరుకు కొన్ని ఆటంకాలయితే ఏర్పడతాయి. ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే డిఫాల్ట్‌ చేసినట్టు కాదు.. ఈఎంఐ ఆలస్యానికి జరిమానా మాత్రమే వేస్తారు. వరుసగా మూడు నెలల ఈఎంఐలను చెల్లించనప్పుడు ఆర్థిక సంస్థలు డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి. రుణం డిఫాల్ట్‌ అయితే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి? మళ్లీ రుణం పొందడానికి ఏం చేయాలి? అనేది ఇక్కడ చూడండి..

పరిణామాలు

రుణ ఎగవేతపై తీవ్రమైన పరిణామాలుంటాయి. ఈ విషయాన్ని రుణసంస్థలు క్రెడిట్‌ బ్యూరోలకు నివేదిస్తాయి. ఇది మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీయడమే కాకుండా ఎక్కువ కాలం పాటు మీ ఆర్థిక విశ్వసనీయతను కూడా ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాలు పొందడం కష్టతరం అవుతుంది. రుణం డిఫాల్ట్‌ అవ్వడం వల్ల వచ్చే చిక్కులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

సురక్షిత, అసురక్షిత రుణాలు

మీరు డిఫాల్ట్‌ చేసిన రుణ రకం ఆధారంగా డిఫాల్ట్‌కు సంబంధించిన పరిణామాలు మారుతూ ఉంటాయి. సురక్షితమైన రుణంపై డిఫాల్ట్‌ అయినట్లయితే, బ్యాంకు తన బకాయిలను తిరిగి పొందేందుకు మీరు తాకట్టు పెట్టిన వస్తువు (ఆస్తు)లను వేలం వేయడానికి చట్టపరమైన హక్కులను కలిగి ఉంటుంది. అదే మీరు అసురక్షిత రుణమైన వ్యక్తిగత రుణాన్ని డిఫాల్ట్‌ చేస్తే, మీ క్రెడిట్‌ స్కోర్‌ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రుణాలే కాక క్రెడిట్‌ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పొందడమూ కష్టమవుతుంది. లోన్‌ డిఫాల్ట్‌ నిర్దిష్ట కాలం వరకు రికార్డులో ఉంటుంది. అయితే, మీ ఆర్థిక పరిస్థితులను సరిచేసుకుని రుణాన్ని తిరిగి చెల్లించగలిగితే మళ్లీ రుణం తీసుకోవచ్చు.

మళ్లీ దరఖాస్తు..

మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడిన తర్వాత మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ రుణ మంజూరు విషయంపై కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తును ఆమోదించడానికి ఇష్టపడకపోవచ్చు. లేదా అధిక వడ్డీ రేటును విధించే అవకాశం ఉంటుంది. డిఫాల్ట్‌ అయిన సందర్భంలో మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసే ముందు తగినంత సమయం తీసుకోండి. ఈ సమయంలో ఏవైనా రుణాలు మిగిలి ఉంటే వాటిని తీర్చేయండి. లేకపోతే ఆ బాకీలను కొంతవరకైనా తగ్గించడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా, మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడినప్పుడు బ్యాంకులు రుణ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడానికి ఆసక్తిచూపుతాయి. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు రుణ దరఖాస్తులు చేయకూడదు. అలాచేస్తే మీ క్రెడిట్‌ స్కోరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మునుపటి రుణం డిఫాల్ట్‌ అయిన తర్వాత, కొన్ని రుణ సంస్థలు పెద్ద మొత్తంలో రుణ మంజూరుకు ఆమోదం తెలపవు. చిన్న మొత్తంలో రుణాలకు ఆమోదం తెలుపుతాయి. 

ఆదాయ స్థిరత్వం

లోన్‌ డిఫాల్ట్‌ చరిత్ర ఉన్నప్పటికీ, స్థిరమైన ఆదాయం, సురక్షితమైన ఉద్యోగం ఉన్నవారికి రుణ ఆమోదానికి అవకాశం ఎక్కువ. అధిక జీతం ఉన్నవారు తీసుకున్న రుణాన్ని సులభంగా చెల్లించేస్తారని రుణ సంస్థలు భావించడమే దీనికి కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని