Loan: ఆస్తిపై రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఏమేం చూస్తాయి?

ఆస్తిని(ఇంటిని) తనఖా పెట్టి బ్యాంకు వద్ద రుణాన్ని తీసుకోవచ్చు. ఆస్తి తనఖా ఉంటుంది కాబట్టి, సురక్షిత రుణాలుగా పరిగణించి వడ్డీ రేట్లను వ్యక్తిగత రుణాల కన్నా తక్కువ మొత్తంలో వసూలు చేస్తాయి.

Published : 28 Feb 2023 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ అవసరాలకు నగదు కావల్సినప్పుడు సాధారణంగా ఎవరైనా రుణంపై ఆసక్తి చూపుతారు. అయితే, బ్యాంకులు రుణాన్ని ఇవ్వడానికి అనేక హామీలు అడుగుతాయి. వ్యక్తిగత రుణాన్ని పొందడానికి కూడా మెరుగైన క్రెడిట్‌ స్కోరు అవసరం, వడ్డీ రేటు కూడా అధికంగానే ఉంటుంది. అయితే, ఆస్తులున్నవారు వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. ఆస్తులను తాకట్టు పెట్టడం వల్ల సురక్షితమైన రుణం అవుతుంది కాబట్టి, బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు కూడా వ్యక్తిగత రుణాల కన్నా తక్కువగానే ఉంటాయి. వైద్య అవసరాలు, వ్యాపార విస్తరణ, ఉన్నత విద్య, వివాహం వంటి ముఖ్యమైన అవసరాలకు ఆస్తి తనఖా పెట్టి పొందే రుణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా, నిధుల తుది వినియోగానికి సంబంధించి బ్యాంకు ఎలాంటి సాక్ష్యాలనూ అడగదు.

గుర్తుంచుకోవాలిసిన విషయాలు

ఈ రుణాల వడ్డీ రేట్లు, రుణ విలువ నిష్పత్తి (ఎల్‌టీవీ), ప్రాసెసింగ్‌ ఫీజులు, రుణాన్ని తిరిగి చెల్లించే కాలవ్యవధి.. బ్యాంకు బ్యాంకుకు మారవచ్చు. ఆస్తి విలువలో 60-70% వరకు బ్యాంకు రుణంగా ఇస్తుంది. ప్రాపర్టీ చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలు, ఇంటి వయసుపై ఆధారపడి రుణం మంజూరు చేస్తారు. ఈఎంఐను చెల్లించేటప్పుడు.. రుణగ్రహీత, తాకట్టు ఉన్న ఇంటిలో నివాసం ఉండొచ్చు. అయితే, రుణాన్ని క్లియర్‌ చేసే వరకు ఇంటిని విక్రయించలేరు. ఈఎంఐల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయితే.. నిబంధనలను బట్టి బ్యాంకు ఆస్తిని వేలం వేయవచ్చు.

కాలవ్యవధి

రుణం తీర్చే కాలవ్యవధి సాధారణంగా 15 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు, కొన్ని ఆస్తులకు 20 సంవత్సరాల వరకు కూడా వెసులుబాటును ఇస్తాయి. తక్కువ కాలవ్యవధి ఎంచుకోవడం వల్ల ఈఎంఐలు ఎక్కువ మొత్తానికి ఉంటాయి. కానీ, తక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఎక్కువ కాలవ్యవధి చిన్న ఈఎంఐలకు దారి తీస్తుంది, కానీ అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకులు ఏవి పరిగణనలోకి తీసుకుంటాయి?

రుణాన్ని ఆమోదించే ముందు ఆస్తిపై ప్రభుత్వ ఆమోదాలు, మార్కెట్‌ విలువ లాంటివి చూస్తాయి. దీంతో పాటు ఇప్పటికే ఆస్తిపై రుణాలకు సంబంధించిన పరిశీలనను తప్పనిసరిగా నిర్వహిస్తాయి. బ్యాంకులు ఆస్తిని చట్టబద్ధమైన అన్ని వ్యవహారాలను క్లియర్‌ చేసిన తర్వాత..రుణగ్రహీత వృత్తి, వయసు, ఆదాయం, క్రెడిట్‌ స్కోరు మొదలైన ఆర్ధిక విషయాలు తనిఖీ చేస్తాయి.

అవసరమైన డాక్యుమెంట్లు

కేవైసీ కోసం ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ మొదలైనవి కోరవచ్చు. జీతం పొందే వ్యక్తి అయితే 3 నెలల పే-స్లిప్‌లు, గత 6 నెలల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌, ఫారం 16 మొదలైన వాటిని సమర్పించాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తి అయితే 6 నెలల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌, వ్యాపార కొనసాగింపు రుజువు, ఐటీఆర్‌ (గత 2 సంవత్సరాలు) మొదలైన వాటిని సమర్పించమని బ్యాంకు అడుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు