రుణం చెల్లించ‌డం మ‌న భాద్య‌త‌..

ఈ రోజు నేను చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నాను. ఇందుకు కార‌ణం నాకు సంబంధించిన రూ.50 ల‌క్ష‌ల‌ స్టాండ‌ప్ ఇండియా లోన్ మంజూరయ్యింది. దీంతో నేను జ్యూట్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగ‌మం అయ్యింది. నేను బ్యాంకుకు వెళ్ళి సంబంధింత ప‌త్రాల‌ను

Published : 16 Dec 2020 18:33 IST

ఈ రోజు నేను చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నాను. ఇందుకు కార‌ణం నాకు సంబంధించిన రూ.50 ల‌క్ష‌ల‌ స్టాండ‌ప్ ఇండియా లోన్ మంజూరయ్యింది. దీంతో నేను జ్యూట్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగ‌మం అయ్యింది. నేను బ్యాంకుకు వెళ్ళి సంబంధింత ప‌త్రాల‌ను ఈ రోజే ఇవ్వ‌బోతున్నాను. ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన వెంట‌నే రుణ మొత్తాన్ని విడుద‌ల చేస్తారు. దీంతో స్టార్ట్‌ప్‌ను ప్రారంభించాల‌నే నా క‌ల నెర‌వేరింది.

ప‌త్రాల‌ను ఇచ్చేందుకు బ్యాంకుకు వెళ్ళిన‌ప్పుడు బ్యాంకు చాలా ర‌ద్దీగా ఉండ‌డంతో నేను కొంత స‌మ‌యం వేచివున్నాను. ఈ స‌మ‌యంలో బ్యాంకు శాఖ‌లో ఏమి జ‌రుగుతుందో గ‌మ‌నించ‌డం ప్రారంభించాను.

ఫిక్సిడ్ డిపాజిట్ కౌంట‌ర్ వ‌ద్ద ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధికి సంధించిన పెట్టుబ‌డుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. కౌంట‌ర్ వ‌ద్ద ఉన్న క్ల‌ర్క్ వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల‌లో నిధుల వైవిధ్య‌త‌ను వారికి వివ‌రిస్తున్నారు. అయితే ఆ వృద్ధ దంప‌తులు క్ల‌ర్క్ తో ఇలా అన్నారు. ఇది మాక‌ష్టార్జితం. దీనిపై వ‌చ్చే వ‌డ్డీ త‌ప్ప మాకు ఇత‌ర ఆదాయ మార్గం ఏమీలేదు. అందువ‌ల్ల సుర‌క్షిత ప‌థ‌కాల‌ను సూచించ‌మ‌ని అభ్య‌ర్ధించారు.

ఇదిలా ఉండ‌గా అక‌స్మాత్తుగా అక్క‌డే ఉన్న ఒక క‌స్ట‌మ‌ర్ బ్యాంకు క్యాషియ‌ర్‌తో వాద‌న‌కు దిగాడు. వేసుకున్న దుస్తులు చూస్తే అత‌ను ఒక పేద మున్సిప‌ల్ కార్మికుడు అని తెలుస్తుంది. అత‌ని వాద‌న వింటుంటే ఉద‌యం జ‌మ చేసిన మొత్తం ఖాతాకు క్రెడిట్ కానందున ఆవేద‌న చెందుతున్న‌ట్లు అర్ధ‌మ‌వుతుంది. టెక్నిక‌ల్ లోపాల కార‌ణంగా ఇలా జ‌రిగింద‌ని, సాధ్య‌మైనంత తొంద‌ర‌గా పొర‌పాటును స‌రిదిద్దుతామ‌ని క్యాషియ‌ర్ అత‌నికి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ వివాదం కార‌ణంగా డ‌బ్బు జ‌మ, విత్‌డ్రా చేసుకునేందుకు వ‌చ్చిన ఇత‌ర వినియోగ‌దారుల‌కు కూడా ఆల‌స్యం అవుతుంది. అందుచేత ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్క‌డ లైన్‌లో వేచిఉన్న‌వారు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక్క‌డ ఒక విష‌యం నేను గ‌మ‌నించాను. ప‌త్రాలు ఇచ్చేందుకు వ‌చ్చిన రుణ‌గ్ర‌హీతులు త‌క్కువ‌గానూ, డ‌బ్బు జ‌మ‌, విత్‌డ్రా చేసేందుకు వ‌చ్చిన‌వారు ఎక్కువ‌గానూ ఉన్నారు. కొంత‌మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ కౌంట‌ర్ వ‌ద్ద‌, మ‌రికొంద‌రు సాధార‌ణ ఏటీఎమ్‌, చెక్‌బుక్ కోసం అభ్యర్ధ‌న ఇచ్చేందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. వీరంద‌ర‌ని చూశాక‌ నాకు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కౌంట‌ర్ వ‌ద్ద ఉన్న వృద్ధ దంప‌తులు, క్యాషియ‌ర్‌తో వాదిస్తున్న మున్సిప‌ల్ కార్మికుడు, బ్రాంచిలో ఉన్న ఇత‌ర క‌స్ట‌మ‌ర్లు, ఇక్క‌డికి వ‌చ్చిన రుణ‌గ్ర‌హీత‌లకు ప‌రోక్షంగా రుణం ఇస్తున్నార‌ని నాకు అర్ధ‌మ‌య్యి వారి పట్ల గౌరవం, బాధ్యత నాలో మొద‌లైంది.

ఇంత‌లో ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు నాకు కేటాయించిన స‌మ‌యం వ‌చ్చింది. నేను బ్యాంకు మేనేజ‌ర్ క్యాబిన్‌ వైపు న‌డిచాను. మేనేజ‌ర్ ఫోన్‌లో ఎవ‌రితోనో మాట్లాడుతున్నాడు. అత‌ని ముఖ‌క‌వ‌ళిక‌లు చూస్తుంటే చాలా విసిగి పోయి ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అత‌ని ఫోన్ సంభాష‌ణ వింటుంటే రుణం ఎగ‌వేత‌దారునితో మాట్లుడుతున్న‌ట్లు తెలుస్తుంది. మేనేజ‌ర్ ఫోన్‌లో మాట్లాడ‌డం పూర్తైన‌ వెంట‌నే ప్ర‌శాంత వ‌ద‌నంతో న‌న్ను చూసి న‌వ్వుతూ ప‌ల‌క‌రించారు. అంత కోపంతో ఫోన్‌లో మాట్లాడిన వ్య‌క్తి, ఇంత‌ త‌క్కువ స‌మ‌యంలో సాధార‌ణ స్థితికి రావ‌డమే కాకుండా న‌న్ను ఆహ్వానించిన తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. త‌క్కువ ప‌రిమితుల‌తో రుణం మంజూరు చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ మేనేజ‌ర్ ఎదుట కూర్చున్నాను. అతను సానుకూలంగా స్పందించి నా ప్రాజెక్ట్ అమలు, భవిష్యత్ ప్రణాళిక గురించి ఆరా తీశారు.

ఈ సంభాషణలో నా కలను నెరవేర్చడంలో ప‌రోక్షంగా స‌హాయ‌ప‌డిన‌ డిపాజిట్ దార్లందరికీ కృతజ్ఞతలు చెప్పాను. నేను చెప్పిన దాన్ని ఎంతో ఆస‌క్తిగా విని నా ఆలోచనా విధానాన్ని మెచ్చుకోవ‌డ‌మే కాకుండా, బ్యాంకులు రుణగ్రహీతలకు ఎలా రుణాలు ఇస్తాయో వివరించారు, ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ వెన్నుముక వంటిది. బ్యాంక్ డిపాజిటర్లకు, రుణగ్రహీతల మధ్య వారదిలా పనిచేస్తుంది. ఒక ధర్మకర్త మాదిరిగా రెండు పార్టీల అవసరాలను నెరవేరుస్తుంది. డిపాజిట్ల‌ను, రుణాలను స‌రైన ప‌ద్ధ‌తిలో బ్యాలెన్స్ చేయ‌డం ఒక కళ. బ్యాంకులు డిపాజిట‌ర్ల వ‌ద్ద నుంచి న‌గ‌దును సేక‌రించి అవసరమైన వారికి రుణాలు ఇస్తుంటాయి. ఇక్క‌డే బ్యాంకు నైపుణ్యం, సామర్థ్యం తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ ద్వారా బ్యాంకులో పెట్టుబడులు పెట్టే ఇతర వాటాదారులు(స్టేక్ హోల్డ‌ర్స్‌) కూడా ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వమే ప్రధాన వాటాదారుగా ఉంటుంది. ఇది బ్యాలెన్సింగ్‌లో భంగం ఏర్ప‌డితే బ్యాంకును రక్షించ‌డంతో పాటు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి నిధుల‌ను తీసుకువ‌చ్చి వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేస్తుంది. ఆర్‌బీఐ మ‌న దేశానికి సెంట్రల్ బ్యాంక్, ఇది ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇది బ్యాంకుల‌కు, ప్రభుత్వానికి శాస్త్రీయ విధానంలో మార్గనిర్దేశం చేస్తుంది ’’

ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి వాటాదారుడు చాలా ముఖ్యమైనవారు. ప్ర‌తీ ఒక్క‌రికీ వారి స్వంత‌ ప్రాముఖ్యత ఉంది. బ్యాంక్, బ్యాంక్ ఉద్యోగులు, డిపాజిటర్లు, ప్రభుత్వం, ఆర్‌బీఐ, పెట్టుబడిదారులు, రుణగ్రహీతలు అందరూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక అందమైన పూసల‌ గొలుసు లాంటిది, దీనిలో అన్ని పూసలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఒక్క‌ పూస వేర‌యినా‌ హారము దాని రూపాన్ని, తేజ‌స్సుతో పాటు ఉనికిని కూడా కోల్పోవచ్చు.

అదేవిధంగా, దీనిని మనం ఇంద్రయాల‌తో కూడా పోల్చవచ్చు. మ‌న ఇంద్రియాల‌లో దేనీ ప్రాదాన్య‌త దానికే ఉంది. దేని ప‌ని అది స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ప‌ర‌స్ప‌ర స‌హాకారంతోనే వ్యవస్థలోని వాటాదారులందరికి గెలుపు సాధ్య‌మ‌వుతుంది. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిటర్లు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల‌పై మంచి రాబడి సాధించి సంతోషంగా ఉన్నారు. ప్ర‌భుత్వం కూడా త‌న వాటాపై లాభాల‌ను పొందుతుంది. ఈ లాభాల‌ను దేశ అభివృద్ధి కార్యకలాపాల‌కు, పేద‌ల‌కు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ఉపయోగిస్తుంది. రుణగ్రహీతలు బ్యాంకుల నుంచి పొందే నిధులతో వివిధ మార్గాల‌లో లాభాలు సాధిస్తున్నారు. బ్యాంకులు,ఆర్‌బీఐ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి లాభాలను ఆర్జిస్తూ సంతోషంగా ఉండ‌డంతో ఈ వ్య‌వ‌స్థ‌పై త‌క్కువ ఒత్తిడి ఉంది.

బ్యాంకు మేనేజ‌ర్ మ‌ర్యాద పూర్వ‌కంగా నాతో ఇలా అన్నారు - ‘‘ ఆదర్శంగా నిల‌వాలి అనేదే మా ప్రయత్నం, వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించే దిశ‌గా మేము అడుగులు వేస్తుంటాం. నేను ఇప్పుడే ఒక రుణ గ్ర‌హీత‌తో మాట్లాడ‌డం మీరు విన్నారు క‌దా! రుణం తిరిగి చెల్లించ‌లేక పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉండొచ్చు. అయితే రుణం తీసుకున్నది వ్య‌క్తి కావ‌చ్చు, కార్పొరేట్ కావ‌చ్చు. భాద్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం చాలా ముఖ్యం. రుణగ్రహీత ఈ పర్యావరణ వ్యవస్థను ఎల్లప్పుడూ అర్థం చేసుకుని, దానిని గౌరవించాలి. తద్వారా మొత్తం వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ’’.

బ్యాంకు మేనేజ‌ర్ చెప్పిన మాటాలు విన్న త‌రువాత నేను ఆయ‌న‌తో ఈ విధంగా చెప్పాను. సార్‌, నా భాద్య‌త ఇప్ప‌డు నాకు స్పష్టంగా అర్ధ‌మైంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు వ‌చ్చిన వృద్ధ దంప‌తులు, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్‌, పెన్ష‌న‌ర్లు, ప్ర‌భుత్వం, పెట్టుబ‌డిదారులు, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే బ్యాంకర్ల‌కు నేను జ‌వాబుదారిగా ఉన్నాను. మిగితా వారి మాదిరిగా నేను కూడా నా పాత్ర‌కు న్యాయం చేస్తాను. కొన్ని బ్యాంకులు ఎందుకు విఫ‌లం అవుతున్నాయో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థ‌మ‌య్యింది. దీనికి అనేక కార‌ణాలు ఉండొచ్చు. కానీ ఒక రుణ గ్ర‌హీతగా నేను ఎప్ప‌టికీ ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పులు చేయ‌ను. అనుకోని, నా నియంత్ర‌ణ‌లో లేని కార‌ణాలు ఉంటే త‌ప్ప‌, ఉద్దేశ పూర్వ‌కంగా అప్పు ఎగ‌వెయ్య‌ను. ఈ ప్రాజెక్ట్ నా క‌ల‌. ఇది నెర‌వేరేంద‌కు స‌కాలంలో స‌హాయం చేసిన బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాను. వృద్ధ దంప‌తుల‌ను దృష్టిలో ఉంచుకుని క‌ష్టించి ప‌నిచేసి పురోగ‌తి బాటలో ప‌య‌నిస్తారు. స‌మాజానికి స‌హాయం చేసేందుకు ప్ర‌భుత్వం, బ్యాంకులు చేస్తున్న కృషిని గుర్తిస్తాను. నాకు స‌రైన రీతిలో దిశా నిర్ధేశం చేసినందుకు మిమ్మ‌ల్ని అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు.

నేను ఈ విధంగా చెప్ప‌డంతో బ్రాంచ్ మేనేజర్ చాలా సంతోషించి ఇలా అన్నారు ‘‘ నీతి,విలువలతో నిండిన మీ అచంచలమైన సంకల్పం వల్ల మీరు ఖచ్చితంగా విజయవంతమవుతారు, మీరు క‌ల‌ను నెర‌వేర్చుకోగ‌లుగుతారు ’’. సంభాషణ అనంత‌రం, నేను నా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి, మారిన దృక్పథంతో, పూర్తి ఆకాంక్షలతో, భాద్య‌తతో బ్రాంచ్ నుండి బయటికి వచ్చాను.

Credits:
SMT.T.SUNITHA
CM(FACULTY), SBILD SECUNDERABAD

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని