China Lockdown: చైనాలో ఐఫోన్‌ తయారీ కేంద్రం చుట్టూ ఆంక్షలు

China Lockdown: చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్‌ విధానం ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం ఉన్న ఫాక్స్‌కాన్‌ యూనిట్‌ చుట్టూ లాక్‌డౌన్‌ విధించింది.

Published : 02 Nov 2022 13:48 IST

బీజింగ్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం చైనా అవలంబిస్తున్న ‘జీరో కొవిడ్‌’ విధానం వల్ల ఇప్పటికీ అక్కడ కఠిన లాక్‌డౌన్‌లను విధిస్తున్నారు. తాజాగా జెంగ్‌ఝౌ ప్రాంతంలో ఉన్న ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం చుట్టూ కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇవి అమలులో ఉండనున్నాయి. నిత్యావసరాలు తప్ప మరే వాహనాలూ ఆ ప్రాంతంలో తిరగొద్దని స్థానిక పాలక వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. జెంగ్‌ఝౌ ప్రాంతంలో కేసులు ఒక్కరోజులో 95 నుంచి 359కి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి.

తాజా నిర్ణయం వల్ల ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తయారీ కేంద్రంలో ఇప్పటికే అసెంబ్లింగ్‌ చేసే సిబ్బంది దాదాపు లక్ష మంది బయటకు వెళ్లిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభించడంతో, మళ్లీ ఎక్కడ ఇబ్బంది పడతామేమో అన్న భయంతోనే వారంతా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇతర దేశాలన్నీ కరోనా ఆంక్షలను సడలిస్తుండగా.. చైనా మాత్రం కొవిడ్‌ కేసులే లేకుండా చూసేందుకు నగరాలను వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు మూసేస్తోంది. ఫాక్స్‌కాన్‌ సైతం పనులు కొనసాగేందుకు తన ప్లాంటులో ‘క్లోజ్డ్‌ లూప్‌ మేనేజ్‌మెంట్‌’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు  ప్రకటించింది. అంటే ఉద్యోగులంతా ప్లాంటులోనే ఉంటారు. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. మూడు పూటలా ఆహారాన్నీ కంపెనీయే అందిస్తుంది. ఈ నిర్ణయంతో దాదాపు రెండు లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లైంది.

సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫాక్స్‌కాన్‌ తెలిపింది. వేతనాలు పెంచడం, చైనాలోని ఇతర తయారీ కేంద్రాల నుంచి సిబ్బందిని తరలించడం వంటి చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. ఇప్పటికే కొంతమంది సిబ్బంది కరోనా సోకి మరణించినట్లు వస్తున్న వార్తల్ని కంపెనీ తోసిపుచ్చింది. యాపిల్ ఇటీవలే ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వీటికి అధిక గిరాకీ కొనసాగుతున్న ఈ సమయంలో సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ 14 సరఫరాలో 80 శాతం జెంగ్‌ఝౌ ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ నుంచే వస్తున్నాయి. 85 శాతం ఐఫోన్‌ 14 ప్రోలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. అయితే భారత్‌లోని చెన్నై ప్లాంటులో కూడా ఫాక్స్‌కాన్‌ సంస్థ ఐఫోన్‌ 14 అసెంబ్లింగ్‌ను మొదలుపెట్టడం గమనార్హం.

ఎంత మంది ఉద్యోగులకు వైరస్‌ సోకింది? కొత్త కేసులు ఇంకా వస్తున్నాయా? అక్టోబరులో చికిత్స అందని రోగుల నుంచి ఫిర్యాదులు అందాయా.. వంటి అంశాలను ఫాక్స్‌కాన్‌ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక్కడి 2 లక్షల మంది కార్మికుల్లో దాదాపు సగం మంది వెళ్లిపోయారని వార్తలొస్తుండగా, ఉత్పత్తిపై ఎంత మేర ప్రభావం పడిందన్నదానిపై యాపిల్‌ నుంచి స్పష్టతా రాలేదు. అయితే ఉత్పత్తిపై 30 శాతం వరకు ప్రభావం పడుతుందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు