Bank Locker: బ్యాంక్‌ లాక‌ర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలి?

బ్యాంక్ లాక‌ర్ కీ పోగొట్టుకుంటే త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిణామాలు ఏంటి? త‌ర్వాత ఏం చేయాలి తెలుసుకుందాం.  

Published : 28 Dec 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం, ఆస్తి ప‌త్రాలు వంటి విలువైన వ‌స్తువుల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు బ్యాంకు లాక‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు చాలామంది. లాక‌ర్ తీసుకున్న త‌ర్వాత దానికి సంబంధించిన ఒక 'కీ'ని ఖాతాదారునికి ఇస్తాయి బ్యాంకులు. ఒకవేళ ఆ లాక‌ర్ తాళాన్ని పోగొట్టుకుంటే ఏం చేయాలి? లాకర్‌లోని సామగ్రికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌క్ష‌ణ‌మే ఎలా స్పందించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంక్ లాక‌ర్ ప్రారంభించిన‌ప్పుడు దానికి 2 తాళాలు ఉంటాయి. ఒక‌టి ఖాతాదారుడికి, మ‌రోటి బ్యాంకు వ‌ద్ద ఉంటాయి. 'కీ' ని జాగ్ర‌త్త‌గా ఉంచుకోవ‌డం చాలా ముఖ్యం. ఒకవేళ తాళం పోగొట్టుకుంటే.. మొద‌ట బ్యాంక్ మేనేజ‌ర్‌కి స‌మాచారం తెలియ‌జేస్తూ ఒక లేఖ రాయాలి. అప్పుడు లాక‌ర్‌ను మ‌రొక‌రు తెర‌వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. లాక‌ర్ 'కీ' పోయిన‌ట్లు బ్యాంకుకి స‌మాచారం ఇస్తే కొత్త లాక‌ర్‌తో పాటు తాళాల‌ను కేటాయిస్తారు. లేదంటే డూప్లికేట్ 'కీ' ల‌ను త‌యారుచేస్తారు.

కొన్ని సంద‌ర్భాల్లో లాక‌ర్ త‌యారు చేసిన కంపెనీని సంప్ర‌దిస్తారు. లాక‌ర్ తెర‌వ‌డానికి శిక్ష‌ణ పొందిన వ్యక్తి బ్యాంకు కార్యాల‌యానికి వ‌చ్చి బ్యాంకు అధికారి, లాక‌ర్ క‌లిగిన వ్య‌క్తి స‌మ‌క్షంలో లాక‌ర్‌ను తెరుస్తాడు. ఒక‌వేళ ఖాతాదారుడు అందుబాటులో లేక‌పోతే బ్యాంకు అధికారులే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. ఆ త‌ర్వాత అందులో ఉన్న న‌గ‌దు లేదా బంగారం లాక‌ర్ తీసుకున్న‌ వ్య‌క్తికి చేర‌వేస్తారు. ఇందుకోసం రూ.3 వేల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంది. లాక‌ర్ సైజు ఆధారంగా కూడా మీరు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. చిన్న లాక‌ర్ అయితే రీప్లేస్‌మెంట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అదే పెద్ద లాక‌ర్ అయితే ఛార్జీలు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంది. అందుకే 'కీ' జాగ్ర‌త్తగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని