Credit Card: మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ కార్డులపై ఓ లుక్కేయండి
మొదటిసారి కార్డు తీసుకునే వారు జిరో లేద తక్కువ వార్షిక రుసుములతో వచ్చే ఎంట్రీ లెవల్ కార్డును ఎంచుకోవడం మంచిది.
ఇంటర్నెట్ డెస్క్: మొదటిసారిగా క్రెడిట్ కార్డు (Credit Card) తీసుకునే వారికి.. ఎలాంటి కార్డు తీసుకోవాలనే విషయంలో సందేహం ఉంటుంది. అయితే, అందరికీ ఒకేరకమైన క్రెడిట్ కార్డు సరిపోకపోవచ్చు. మీరు ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో (షాపింగ్, గ్రాసరీస్, ట్రావెల్) చూసుకుని ఆ కేటగిరిలో ఎక్కువ ప్రయోజనాలను అందించే కార్డును ఎంచుకోవాలి. అలాగే, మొదటిసారి కార్డు తీసుకునే వారు ఎంట్రీ లెవల్ కార్డును ఎంచుకోవడం మంచిది. ఈ కార్డులు నిల్/తక్కువ వార్షిక రుసుముతో వస్తాయి. అలాంటి కొన్ని కార్డులను ఇప్పుడు చూద్దాం..
యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు..
ప్రారంభ స్థాయిలో ఉన్న వారికి ఇది ఒక మంచి కార్డుగా చెప్పుకోవచ్చు. ఈ కార్డుపై చేసే అన్ని లావాదేవీలపై అత్యధికంగా 2% క్యాష్‌బ్యాక్ అందుతుంది. గూగుల్‌పే ద్వారా చేసే యుటిలిటీ బిల్లులపై 5% క్యాష్‌బ్యాక్ అందుతుంది. దీనికి గరిష్ఠ పరిమితి లేదు. ఉదాహరణకు మీరు రూ.5000 కరెంటు బిల్లు చెల్లిస్తే రూ.250 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వార్షిక రుసుము రూ.499.
ప్రయోజనాలు..
- కరెంట్, గ్యాస్, ఇంటర్నెట్ వంటి యుటిలిటీ బిల్లులను గూగుల్ పే ద్వారా చెల్లిస్తే 5% క్యాష్‌బ్యాక్
- జొమాటో, స్విగ్గీ, ఓలా చెల్లింపులపై 4% క్యాష్‌బ్యాక్
- ఇతర ఖర్చులపై 2% క్యాష్‌బ్యాక్
- ఏడాదిలో 4 సార్లు కాంప్లిమెంటరీ దేశీయ లాంజ్ యాక్సెస్
- రూ.400 నుంచి రూ.4000 వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై 1% సర్‌ఛార్జ్ రద్దు (గరిష్ఠంగా నెలకు రూ.500) వంటివి లభిస్తాయి.
- అయితే ఇంధన లావాదేవీలు, ఇ-వ్యాలెట్ లోడింగ్, ఈఎంఐ లావాదేవీలు, నగదు అడ్వాన్సులపై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు వర్తించవు.
ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్..
ఇది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య బ్రాండ్‌ల వద్ద చేసే కొనుగోళ్లపై మంచి ప్రయోజనాలను పొందొచ్చు. వార్షిక రుసుము రూ.499. ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే వార్షిక రుసుములు రద్దు చేస్తారు.
ప్రయోజనాలు..
- జాయినింగ్ ప్రయోజనంగా రూ.500 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కార్డు
- వార్షిక ఖర్చులు రూ.1 లక్ష, రూ.2 లక్షలు చేరుకున్న ప్రతిసారీ రూ.2000 విలువ గల ఇ-వోచర్
- ప్రతి రూ.100 ఖర్చుపై 1 రివార్డు పాయింట్
- ఆన్‌లైన్ షాపింగ్‌పై 5X రివార్డు పాయింట్లు
- భాగస్వామ్య బ్రాండ్లైన బుక్‌మైషో, అమెజాన్, అర్బన్‌క్లాప్, లెన్స్‌కార్ట్ వద్ద చేసే ఖర్చుపై 10X రివార్డులు
- రూ.500 నుంచి రూ.3000 వరకు చేసే ఇంధన ఖర్చుపై 1% సర్‌ఛార్జ్ రద్దు వంటివి లభిస్తాయి.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు..
షాపింగ్ చేసేవారికి ఈ కార్డు అనుకూలంగా ఉంటుంది. కార్డును ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 1.50% క్యాష్‌బ్యాంక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో చేసిన రూ.3వేల ఖర్చుపై రూ.45 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డుకు రూ.500 వార్షిక రుసుము ఉంటుంది.
ప్రయోజనాలు..
- వెల్‌కమ్ బెన్‌ఫిట్ కింద రూ.2,900 విలువైన కూపన్లు
- ఫ్లిప్‌కార్ట్, మింత్రా, 2గుడ్ కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్
- క్యూర్.ఫిట్, స్విగ్గీ, పీవీఆర్, ఉబర్ వంటి వాటి వద్ద 4% క్యాష్ బ్యాక్
- ఇతర అన్ని కొనుగోళ్లపై 1.50% క్యాష్‌బ్యాక్
- ఒక ఏడాదిలో 4 సార్లు దేశీయ లాంజ్ యాక్సెస్
- రూ.400 నుంచి రూ.4000 వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై 1% సర్‌ఛార్జ్ రద్దు (గరిష్ఠంగా నెలకు రూ.500) వంటివి లభిస్తాయి.
హెచ్‌ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్..
మంచి క్యాష్ బ్యాక్‌ను అందించే కార్డుల్లో ఇదీ ఒకటి. వార్షిక రుసుము రూ.750
ప్రయోజనాలు..
- వెల్‌కమ్ బెన్‌ఫిట్ కింద రూ.500 విలువైన అమెజాన్ వోచర్, దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లేదా ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్లలో 3 మీల్ వోచర్లు
- మొదటి గూగుల్ పే లావాదేవీపై 50% డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.100). ఇందుకోసం కార్డు తీసుకున్న 30 రోజుల్లో కనీసం ఒక్క లావాదేవీ అయినా పూర్తిచేయాలి.
- ఆన్‌లైన్‌లో చేసే ఖర్చుల (వ్యాలెట్ బదిలీలపై వర్తించదు)పై 1.50% క్యాష్ బ్యాక్. ఇతర ఖర్చులపై 1% క్యాష్ బ్యాక్
- అమెజాన్‌లో చేసే రూ.1000, అంతకంటే ఎక్కువ ఖర్చుపై 5% డిస్కౌంట్ (ఒక కార్డుపై ఒక నెలలో గరిష్ఠంగా రూ.250 డిస్కౌంట్ లభిస్తుంది)
- భారత్‌లో ప్రధాన నగరాల్లో ఉన్న 1000కి పైగా రెస్టారెంట్లలో చేసే ఖర్చుపై 15% డిస్కౌంట్
- శనివారం రోజు బుక్‌మైషో ద్వారా బుక్ చేస్తే ఒక టికెట్‌కు రెండోది ఉచితంగా లభిస్తుంది. టికెట్ ధర గరిష్ఠంగా రూ.250
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు..
అమెజాన్‌లో ఎక్కువగా షాపింగ్ చేసేవారికి ఈ కార్డు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్డుపై ఎటువంటి వార్షిక రుసుములూ లేవు.
ప్రయోజనాలు..
- అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 5% క్యాష్‌బ్యాక్
- అమెజాన్ నాన్-ప్రైమ్ కస్టమర్లకు 3% క్యాష్‌బ్యాక్
- అమెజాన్ పే ద్వారా 100+ మర్చెంట్ కస్టమర్ల వద్ద చేసే కొనుగోళ్లపై 2% క్యాష్‌బ్యాక్
- ఇతర ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్
- ఇంధన కొనుగోళ్లపై 1% సర్‌ఛార్జ్ రద్దు వంటివి లభిస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డు..
క్రెడిట్ కార్డు ఖర్చులపై మంచి రివార్డు పాయింట్లు పొందాలనుకునే వారికి ఈ కార్డు అనుకూలంగా ఉంటుంది. వార్షిక రుసుము రూ.500
ప్రయోజనాలు..
- ఆన్‌లైన్‌లో చేసే రూ.150 ఖర్చుపై 4 రివార్డు పాయింట్లు (ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో గరిష్ఠంగా రూ.500 రివార్డు పాయింట్లు), ఆఫ్‌లైన్‌లో చేసే రూ.150 ఖర్చుపై 2 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- ప్రతి త్రైమాసికంలో రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ ఖర్చుపై రూ.500 వోచర్ (ఒక ఏడాదిలో గరిష్ఠంగా రూ.2000 విలువైన వోచర్లు పొందచ్చు) లభిస్తుంది.
- వస్తువు కొనుగోలు చేసిన తేదీ నుంచి 50 రోజుల వడ్డీ రహిత కాలం ఉంటుంది. (మర్చంట్ ఛార్జ్ చేసిన తేదీని లెక్కలోకి తీసుకుంటారు)
- భారత్‌లోని అన్ని ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లపై 1% సర్‌ఛార్జ్ రద్దు (కనీసం రూ.400 కొనుగోలు చేయాలి). ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో గరిష్ఠంగా రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- కార్డు తీసుకున్న మొదటి 90 రోజుల్లో రూ.20 వేలు ఖర్చు చేస్తే.. మొదటి సంవత్సరం సభ్యత్వ రుసుములు రద్దు చేస్తారు.
యస్ ప్రోస్పెరిటీ రివార్డ్స్ ప్లస్..
తక్కువ ఫీజుతో ఎక్కువ రివార్డు పాయింట్లు లభించే క్రెడిట్ కోసం చూసేవారికి ఈ కార్డు సరిపోతుంది. వార్షిక ఫీజు రూ.499.
ప్రయోజనాలు..
- కిరాణా, సూపర్ మార్కెట్ కొనుగోళ్ల కోసం చేసే ప్రతి రూ.200 ఖర్చుపై 6 రివార్డు పాయింట్లు
- ఇతర ఖర్చులపై ప్రతి రూ.200 ఖర్చుపై 4 రివార్డు పాయింట్లు
- ఒక ఏడాదిలో రూ.3.60 లక్షలు ఖర్చు చేస్తే, 12000 బోనస్ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- అన్ని ఇంధన కేంద్రాల వద్ద ఇంధన కొనుగోళ్లపై 1% సర్‌ఛార్జ్ రద్దు చేస్తారు.
- అయితే, రివార్డు పాయింట్లు సంస్థ ఇచ్చిన కేటలాగ్, ఎయిర్‌మైల్ కోసం మాత్రమే రిడీమ్ చేసుకోవాలి.
స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్-ఈజ్‌మైట్రిప్..
ఈ కార్డు ట్రావెలర్స్‌కు అనుకూలంగా ఉంటుంది. వార్షిక రుసుము రూ.350+జీఎస్‌టీ. కార్డును ఉపయోగించి ఒక ఏడాదిలో రూ.50 వేలు ఖర్చు చేస్తే, జాయినింగ్ ఫీజు ఉండదు.
ప్రయోజనాలు..
- ఈ కార్డుతో ఈజ్ మై ట్రిప్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేసే హోటల్ బుకింగులపై 20%, ఫ్లైట్ బుకింగులపై 10% తక్షణ రాయితీ, బస్ బుకింగులపై రూ.125 తగ్గింపు లభిస్తుంది.
- స్టాండ్ ఎలోన్ హోటల్, ఎయిర్ లైన్ వెబ్‌సైట్లు, యాప్, అవుట్‌లెట్స్ వద్ద చేసే రూ.100 ఖర్చుపై 10X రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- త్రైమాసికంలో ఒక దేశీయ లాంజ్ యాక్సెస్, ఏడాదిలో రెండు సార్లు అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ కాంప్లిమెంటరీగా పొందొచ్చు.
స్టాండర్డ్ చార్టర్డ్ ప్లాటినమ్ రివార్డ్స్..
ఈ కార్డుతో ఇంధనం, డైనింగ్‌పై అధిక రివార్డు పాయింట్లు లభిస్తాయి. వార్షిక రుసుము రూ.250. ఏడాదిలో రూ.60 వేలు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే..వార్షిక రుసుము రద్దు చేస్తారు.
ప్రయోజనాలు..
- ఇంధనంపై చేసే రూ.150 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- డైనింగ్‌పై చేసే రూ.150 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- ఇతర కేటగిరీల్లో చేసే రూ.150 ఖర్చుపై 1 రివార్డు పాయింట్ చొప్పున పొందొచ్చు.
- మొదటి 90 రోజుల్లో రెస్టారెంట్లలో చేసే ఖర్చుపై 100% (గరిష్ఠంగా రూ.500) క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
చివరిగా..
క్రెడిట్ కార్డు ఏదైనా సరే, సమయానికి బిల్లు చెల్లించాలని గుర్తుపెట్టుకోండి. లేదంటే కార్డు జారీ చేసే సంస్థలు విధించే ఛార్జీలతో క్రెడిట్ కార్డు వల్ల చేకూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్: ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే