కనిష్ఠ స్థాయిలో వడ్డీ రేట్లు.. ఇంటి కొనుగోలుకు ఇదే తరుణం!

కొన్ని బ్యాంకులు అందిస్తున్న గృహ‌రుణాలు దాదాపు 6.40 శాతం వ‌ద్ద కూడా ప్రారంభ‌మ‌వుతున్నాయి.

Updated : 07 Feb 2022 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు అత్యంత త‌క్కువ వ‌డ్డీ రేటుకే బ్యాంకులు గృహ రుణాలు అంద‌జేస్తున్నాయి. ఇంత త‌క్కువ వ‌డ్డీ రేట్లకు గృహ రుణాల వ‌డ్డీ రేట్లు ఇంత‌కు ముందు ఎప్పుడూ బ్యాంకులు ఇవ్వలేదు. ఆసక్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే 10 సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల‌పై వ‌చ్చే ప్రస్తుత రాబ‌డి కంటే త‌క్కువ రేటుకే గృహ రుణ వ‌డ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకులు ఉన్నాయి. వినియోగ‌దారుగా మీరు మీ ఇంటిని ఇప్పటికే ఖ‌రారు చేసి ఉంటే గ‌రిష్ఠ మొత్తంలో హోమ్‌లోన్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయ‌డానికి ఇదే మంచి స‌మ‌యం. 

కొన్ని బ్యాంకులు అందిస్తున్న గృహ‌రుణాలు దాదాపు 6.40 శాతం వ‌ద్ద ప్రారంభ‌మ‌వుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర 6.40 శాతానికే రుణాలు జారీ చేస్తుండగా.. ఎస్‌బీఐ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు 6.50 శాతం వ‌డ్డీ రేట్ల నుంచి గృహ రుణాలను అందజేస్తున్నాయి.

త‌క్కువ వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా నిర్దిష్ట రుణ గ్రహీతలకు మాత్రమే వర్తిస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న రుణ గ్రహీతలకు త‌క్కువ వ‌డ్డీ రేట్లకే బ్యాంకులు రుణాలు జారీ చేస్తాయి. త‌క్కువ క‌టింగ్స్‌తో ఎక్కువ జీతం పొందేవారికి, రూ.30-40 ల‌క్షల కంటే తక్కువ మొత్తంలో గృహ రుణాలు పొందేవారికి తక్కువ వడ్డీరే రుణాలు పొందేందుకు అర్హత ఉంటుంది.

ప్రస్తుతం బ్యాంకుల నుంచి గృహ రుణాలను తప్పనిసరిగా ఎక్స్‌టర్నల్‌ బెంచ్ మార్క్‌తో అనుసంధానించిన రేటుతో ఇస్తారు. చాలా బ్యాంకుల‌కు ఇది ఆర్‌బీఐ రెపోరేటు కాబ‌ట్టి, దీనికి ఆర్ఎల్ఎల్ఆర్‌ (రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేటు)గా సూచిస్తారు. రెపోరేటులో ఏదైనా మార్పు ఆర్ఎల్ఎల్ఆర్‌ని ప్రభావితం చేస్తుంది. ఫ్లోటింగ్ హోమ్‌లోన్‌ రేటులో రెపో రేటు మారినప్పుడు ఈఎమ్ఐ కూడా మారుతుంది.

హోమ్‌లోన్ వ‌డ్డీ రేటును ప్రస్తుత ప్రభుత్వ సెక్యూరిటీల‌ రాబ‌డితో పోల్చడం అనేది ప్రస్తుత ప‌రిస్థితికి సూచిక మాత్రమే. కాల‌క్రమేణా రెపో రేటు మారిన‌పుడు, మీ హోమ్ లోన్ ఈఎమ్ఐలో కూడా మార్పు క‌నిపిస్తుంది. తుది వినియోగ‌దారుగా మీరు ఇప్పటికే ఇంటిని కొనుగోలు చేసే ఉద్దేశముంటే ఇదే ఉత్తమమైన సమయం.అలాగే, వ‌డ్డీని ఆదా చేసేందుకు వీలైనంత త్వరగా గృహ రుణాన్ని తీర్చి వేయ‌డానికి ముంద‌స్తు చెల్లింపు ప్లాన్‌ను ఉప‌యోగించుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని