Automobile: ఈ కార్లపై ఆకర్షణీయ రాయితీలు!

కరోనా నేపథ్యంలో వాహన రంగం కుదేలైంది. విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలు రాయితీలు, ఆఫర్లు ప్రకటించాయి......

Updated : 30 Aug 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో వాహన రంగం కుదేలైంది. విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలు రాయితీలు, ఆఫర్లు ప్రకటించాయి. మే నెలలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌ ఇండియా, మహీంద్రా, నిస్సాన్‌ వంటి సంస్థలు రూ.3.01 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.


మహీంద్రా ఆల్టురాస్‌ జీ4 ఎస్‌యూవీ

మహీంద్రా నుంచి వస్తున్న ఈ ఎస్‌యూవీపై గరిష్ఠంగా రూ.3.01 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. దీంట్లో ఒక్క నగదు రాయితీనే రూ.2.2 లక్షల వరకు ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ ఆఫర్లు మరో రూ.50 వేల వరకు ఉన్నాయి. దీని అసలు ఖరీదు వేరియంట్‌ను బట్టి రూ.28.74 లక్షల నుంచి 31.74 లక్షల (ఎక్స్‌ షోరూం)వరకు ఉంది.


హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌

హ్యుందాయ్‌కు చెందిన ఐ20, ఆరా, గ్రాండ్‌ ఐ10, కోలా ఎలక్ట్రిక్‌ వంటి మోడళ్లపై సంస్థ పలు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. కోనా మోడల్‌పై రూ.1.5 లక్షల రాయితీ కల్పిస్తోంది. దీని ధర రూ. 23.77-రూ. 23.96 లక్షల మధ్య ఉంది. మిగతా వాటిపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌, కార్పొరేట్‌ ఆఫర్లు అందిస్తోంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ 500

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ కారును మహీంద్రా రీప్లేస్ చేయాలని భావిస్తోంది. దీంతో పాత స్టాక్‌ను ఖాళీ చేయాలని యోచిస్తోంది. దీనిపై అన్నీ కలుపుకొని రూ.98,100 వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంట్లో రూ.51,600 నగదు రాయితీ కాగా.. మిగిలిన రూ.25 వేలు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.6,500 సహా ఇతర ఆఫర్ల పేరిట మరో రూ.15 వేల వరకు రాయితీలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ.15.53 లక్షల నుంచి రూ.20.04 లక్షల వరకు ఉంది.


రెనో డస్టర్‌ (1.3 లీటర్‌)

ఫ్రాన్స్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ రూ.75,000 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. డస్టర్‌ 1.3 లీటర్‌ టర్బో వేరియంట్‌పై ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ కింద రూ.30,000, లాయల్టీ బెనిఫిట్‌ కింద రూ.15,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.30,000 వంటి రాయితీలు కల్పిస్తోంది. ఇక రెగ్యులర్‌ 1.5 లీటర్‌ డస్టర్‌పై రూ.45 వేల వరకు ప్రయోజనాల్ని కల్పించేందుకు రెనో సిద్ధమైంది. వీటిలో పాటు క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ పైనా పలు ఆఫర్లు ప్రకటించింది.


నిస్సాన్‌ కిక్స్‌

నిస్సాన్‌ నుంచి వస్తున్న కార్లలో కేవలం కిక్స్‌ మోడల్‌పైనే ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. రూ.20 వేల నగదు రాయితీ, రూ.50 వేల ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌తో పాటు ఇతర అదనపు రాయితీలతో కలుపుకొని మొత్తం రూ.75 వేల ప్రయోజనాల్ని కల్పిస్తోంది. దీని ధర ప్రస్తుతం రూ.9.50 లక్షల నుంచి రూ.14.65 లక్షల వరకు ఉంది.


టాటా హ్యారియర్‌

హ్యారియర్‌పై టాటా మోటార్స్‌పై అన్నీ కలుపుకొని రూ.65 వేల వరకు రాయితీ కల్పిస్తోంది. వీటిలో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.40 వేలు, ఎక్స్‌ఛేంజ్‌+కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.25 వేల వరకు ప్రయోజనాల్ని కల్పిస్తున్నారు. అయితే, ఈ ఆఫర్లు డార్క్‌ ఎడిషన్‌లోని ఎక్స్‌జెడ్‌+, ఎక్స్‌జెడ్‌ఏ+ వేరియంట్లకు మాత్రం వర్తించవు. వీటిపై రూ.40 వేల వరకు రాయితీలు కల్పిస్తున్నారు. హ్యారియర్‌ ఖరీదు రూ.14.29 లక్షలు-రూ.20.81 లక్షలు మధ్య ఉంది.


రెనో ట్రైబర్‌

ట్రైబర్‌పై గరిష్ఠంగా రూ.55 వేల వరకు రాయితీలు కల్పిస్తున్నారు. వీటిలో నగదు రాయితీ రూ.25 వేలు కాగా.. ఎక్స్‌ఛేంజ్‌ లబ్ధి రూ.20 వేలు, లాయల్టీ బెనిఫిట్స్‌ రూ. 10,000 వరకు ఉన్నాయి. ఇక ఈ మోడల్‌ను కొనే వారికి 6.99% వడ్డీ రేటుతో వాహన లోన్‌ కూడా అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ట్రైబర్‌ ప్రస్తుత ధర రూ.5.30 లక్షల నుంచి రూ.7.82 లక్షల వరకు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని