IRCTC tour package: ₹13 వేలకే 2 జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

IRCTC tour package: ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అందులో రెండింటిని ఒకే ట్రిప్‌లో సందర్శించాలనుకుంటున్నారా? అయితే, మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ఆలయాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ప్యాకేజీ వివరాలు ఇవీ..

Updated : 27 Oct 2023 15:02 IST

శ్రీ మహాకాళేశ్వర ఆలయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్‌లో రెండు ఉన్నాయి.  ఒకటి ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, రెండోది ఓంకారేశ్వర ఆలయం. ఈ రెండింటితో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించుకోవాలనుకుంటే..  ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త టూర్‌ ప్యాకేజీని వినియోగించుకోవాల్సిందే. మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌ (MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. కాచిగూడ నుంచి ఈ రైలు మొదలవుతుంది. టికెట్‌ ధర రూ.13వేల నుంచి ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఈ టూర్‌ కొనసాగుతుంది. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌ 1 నుంచి మీ ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. కాజీపేట జంక్షన్‌లో కూడా ఈ రైలు ఆగుతుంది.

సాంచి స్థూపం

ప్రయాణం ఇలా..

  • కాచిగూడలో సాయంత్రం 4:40 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్‌ నెం.12707) బయల్దేరుతుంది.
  • రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాంచి స్థూపం చూడటానికి వెళ్తారు.  తిరిగి భోపాల్‌ చేరుకొని ట్రైబల్‌ మ్యూజియం వీక్షిస్తారు. రాత్రి భోపాల్‌లోనే బస ఉంటుంది.
  • మూడో రోజు టిఫిన్‌ చేశాక ఉజ్జయినికి బయల్దేరుతారు. అక్కడ శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాల్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక ఓంకారేశ్వర్‌కు పయనమవుతారు.  ఓంకారేశ్వర దేవాలయం, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. ఓంకారేశ్వర్‌లో హోటల్‌ వసతి సదుపాయం ఉంటే రాత్రి బస అక్కడే ఉంటుంది. లేకపోతే అదే రోజు రాత్రి ఇందౌర్‌కి బయల్దేరుతారు. ఇందౌర్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక మహేశ్వరానికి బయల్దేరుతారు. అహల్యా దేవి కోట, మండూ ఫోర్ట్ అందాల్ని వీక్షించి తిరిగి ఇందౌర్‌కి పయనమవుతారు. రాత్రి 8 గంటలకు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (ట్రైన్‌ నెం: 19301)లో కాచిగూడకు బయల్దేరుతారు. ఆ రోజు రాత్రంతా రైళ్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో మీ యాత్ర పూర్తవుతుంది.

ఇవి గుర్తుంచుకోండి..

  • యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
  • ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
  • భోపాల్‌, ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌/ ఇందౌర్‌లో రాత్రి బస, ఉదయం అల్పాహారం ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మిగిలిన రోజుల్లో టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాల బాధ్యత యాత్రికులదే.
  • రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి.
  • ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి.
  • గైడ్‌ సదుపాయం ఉండదు.

అహల్యా దేవి కోట

ప్యాకేజీ ఛార్జీలు..

  • 1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి  రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో (రూమ్‌) అయితే రూ.37,810, ట్విన్ షేరింగ్‌కు రూ.21,150, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,390 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.12,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,500 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో (స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.35,320, ట్విన్ షేరింగ్‌కు రూ.18,660, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,900. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,900, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 8,010 చెల్లించాలి.
  • నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే వేరే ప్యాకేజీ ఛార్జీలు వర్తిస్తాయి. కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ) డబుల్‌ షేరింగ్‌కు రూ.18,850, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.16,020 చెల్లించాలి.  5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 12,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,500 చెల్లించాలి.
  • అదే స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) డబుల్‌ షేరింగ్‌కు రూ. 16,360, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.13,530 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,900, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 8,010 చెల్లించాలి.

క్యాన్సిలేషన్‌ పాలసీ

ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్‌ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అదే 8 - 14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4 - 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు

ఈ టూర్‌కు సంబంధించిన టికెట్ల బుకింగ్‌, ఇతర వివరాల కోసం క్లిక్‌ చేయండి..

IRCTC Tourism Official Website | Travel & Tour Packages | Bharat Gaurav Tourist Train

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని