Anand Mahindra: భారత్‌తో సవాల్‌ వద్దు: అదానీ షేర్ల పతనం నేపథ్యంలో మహీంద్రా స్పందన

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra)..  అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

Published : 04 Feb 2023 16:08 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సోషల్‌ మీడియాలో  చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలు, హాస్యం పండించే దృశ్యాలు, స్ఫూర్తి నింపే వాక్యాలు నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా అదానీ గ్రూప్‌(Adani Group) షేర్ల పతనంపై స్పందించారు. పరోక్షంగా ఆ సంస్థకు మద్దతుగా మాట్లాడారు. 

‘ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలని భావిస్తున్న భారత్‌ ఆశయాలను ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా..? అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నేను నా జీవితకాలంలో భూకంపాలు, కరవుకాటకాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులను చాలినన్ని చూశాను. వాటిని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎప్పుడూ భారత్‌కు సవాళ్లు విసరకండి’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. వేల సంవత్సరాల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారతదేశం ఏనాడు చెక్కుచెదరకుండా ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్‌ అదానీ (Gautam Adani) పలు చర్యలకు ఉపక్రమించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. ఈ మేరకు రుణదాతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రుణ చెల్లింపులను ముందుగానే చేసేసి తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని