Mahindra XUV 400: మార్కెట్లోకి మహీంద్రా తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ.. ఫీచర్లివే!

మహీంద్రా కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును గ్లోబల్ ఎన్‌క్యాప్‌ భద్రత పరీక్షల్లో ఐదు స్టార్ రేటింగ్ పొందిన ఎక్స్‌యూవీ 300 డిజైన్ ఆధారంగా రూపొందించారు. 

Published : 16 Jan 2023 21:25 IST

ముంబయి: ఎలక్ట్రిక్‌ వాహన (Electric Vehicles) శ్రేణిలో మహీంద్రా (Mahindra Auto) కంపెనీ తన తొలి ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారును సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) పేరుతో రెండు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్‌యూవీ 400 ఈసీ వేరియంట్‌ (3.3 కిలోవాట్ ఛార్జర్‌) మోడల్‌ ధర ₹ 15.99 లక్షలు, (7.2 కిలోవాట్ ఛార్జర్‌) మోడల్‌ ధర ₹16.49 లక్షలు కాగా, ఎక్స్‌యూవీ 400 ఈఎల్‌ వేరియంట్‌ (7.2 కిలోవాట్) ధర ₹ 18.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న తొలి ఐదు వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని తెలిపింది. జనవరి 26 నుంచి బుకింగ్స్‌ ప్రారంభించనుంది. తొలి ఏడాదిలో 20 వేల ఎక్స్‌యూవీ 400లను విక్రయించాలని కంపెనీ  లక్ష్యంగా పెట్టుకుంది. 

ఎక్స్‌యూవీ 400 ఈవీ  ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈసీ వేరియంట్‌లో 34.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 375 km ప్రయాణించవచ్చు. మరో వేరియంట్ ఎక్స్‌యూవీ 400 ఈఎల్‌లో 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 456 km ప్రయాణించవచ్చు. ఈ రెండు వేరియంట్లలోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ 110 కిలోవాట్‌ శక్తిని, 310 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 150 km టాప్‌ స్పీడ్‌తో.. కేవలం 8.3 సెకన్లలో 0-100 km వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు. ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్‌, స్మార్ట్‌వాచ్‌ కనెక్టివిటీ, సన్‌రూఫ్‌, రియర్ పార్కింగ్ కెమెరా, కీ లెస్‌ ఎంట్రీ, పుష్‌ బటన్‌ స్టార్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

‘‘గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ భద్రత పరీక్షల్లో ఐదు స్టార్‌ రేటింగ్‌ పొందిన ఎక్స్‌యూవీ 300 డిజైన్‌ ఆధారంగా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ ను రూపొందించాం. ఈ కారు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని, మెరుగైన భద్రతను ఇస్తుంది. సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది సరైన ఎంపిక. డిజైన్‌, పనితీరు, సౌకర్యం, టెక్నాలజీ పరంగా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ ఎంతో మెరుగైంది’’ అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ ఆటోమోటివ్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని