Mahindra Cars: అందులో మా తప్పేం లేదు.. ఎయిర్‌బ్యాగ్‌ల కేసుపై మహీంద్రా వివరణ

మహీంద్రా వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌ల పనితీరులో ఎలాంటి లోపం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

Published : 27 Sep 2023 14:32 IST

దిల్లీ: మహీంద్రా అండ్ మహీందా (ఎమ్‌ అండ్ ఎమ్‌) సంస్థ తయారు చేసిన వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌ల పనితీరులో ఎలాంటి లోపం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి మహీంద్రా వాహనం కారణమంటూ నమోదైన కేసుపై సంస్థ ఒక ప్రటన విడుదల చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఉపయోగిస్తున్న కారులోని ఎయిర్‌బ్యాగ్‌లలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ అపూర్వ్‌ మిశ్రా గతేడాది జనవరి 14న కాన్పూర్‌ నుంచి లఖ్‌నవూకు మహీంద్రా ఎస్‌యూవీ (స్కార్పియో ఎస్‌9) వాహనంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో ఎస్‌యూవీ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో అపూర్వ్‌ సీటు బెల్టు పెట్టుకున్నా.. కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని ఆయన తండ్రి ఆరోపించారు. తన కుమారుడికి మృతికి మహీంద్రా సంస్థ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా సహా మరో 12 మంది కారణమని ఆరోపిస్తూ.. కోర్టులో అపూర్వ్‌ తండ్రి కేసు వేశారు. ఈ నేపథ్యంలో మహీంద్రా వాహనాల్లో భద్రతా ప్రమాణాలపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. 

దీంతో మహీంద్రా సంస్థ ఈ కేసు గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. అలానే, ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడానికి గల కారణాలు వివరించింది. అపూర్వ్‌ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ.. ప్రమాద సమయంలో కారు పల్టీలు కొట్టిన కారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని వెల్లడించింది. కొంతమంది ఆరోపిస్తున్నట్లు తమ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లు లేవనే వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో తమ సంస్థ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.  ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పరిధిలో ఉందని, దర్యాప్తు బృందాలు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపింది. అలాగే, బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని