Mahindra: ఈవీ వ్యాపారంలో మహీంద్రా ₹10,000 కోట్ల పెట్టుబడులు

ప్రత్యేకంగా విద్యుత్తు వాహనాల తయారీ కోసం మహీంద్రా గ్రూప్‌ పుణెలో ప్లాంట్‌ స్థాపించనుంది. మొత్తంగా ఈవీ వ్యాపార విస్తరణకు మహీంద్రా గ్రూప్‌ రూ.10 వేల కోట్లు వెచ్చించనుంది.

Published : 14 Dec 2022 21:54 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra and Mahindra) విద్యుత్తు వాహన (electric vehicle- EV) వ్యాపార విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే 7-8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. అందులో భాగంగా పుణెలో ఈవీ అభివృద్ధి, తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. తమ పెట్టుబడి ప్రణాళికలకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపినట్లు పేర్కొంది.

ఎస్‌యూవీ (SUV), జీప్‌లకు పెట్టింది పేరైన మహీంద్రా (Mahindra and Mahindra) ఇకపై ‘బోర్న్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (BEVs)’ను పూర్తిగా కొత్తగా స్థాపించబోయే పుణె ప్లాంటులోనే తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ఎక్స్‌యూవీ 700 (XUV 700) మోడల్‌లోని ఈవీ వేరియంట్‌ను సైతం ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తామని పేర్కొంది. టెక్‌ నుంచి ట్రాక్టర్ల తయారీ వరకు విస్తరించి ఉన్న మహీంద్రా గ్రూప్‌ (Mahindra and Mahindra) 250-300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించేందుకు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో చర్చలు జరుపుతోంది. వీటిని ఈవీ (EV) వ్యాపారంలోకే మళ్లించాలని భావిస్తోంది.

మరోవైపు సెప్టెంబరులోనే మహీంద్రా తమ ఎక్స్‌యూవీ 400 (XUV 400)  మోడల్‌లోని విద్యుత్తు (electric vehicle)  ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 456 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి ఆరున్నర గంటల సమయం పడుతుంది. 2040 నాటికి కర్బన ఉద్గార తటస్థత లక్ష్యాన్ని చేరుకుంటామని మహీంద్రా గ్రూప్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్‌లో విద్యుత్తు వాహన (electric vehicle) పరిశ్రమ క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం వార్షిక కార్ల విక్రయాల్లో ఈవీల వాటా 1 శాతంగా ఉంది. దీన్ని 2030 నాటికి 30 శాతానికి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పుణె కేంద్రంగా ఇప్పటికే పలు దిగ్గజ వాహన తయారీ సంస్థలు పనిచేస్తున్నాయి. బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా, మెర్సిడెస్‌ బెంజ్‌ సహా కొత్తగా వస్తున్న పలు ఈవీ సంస్థల తయారీ కేంద్రాలు ఈ నగరంలోనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని