Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు

Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్‌యూవీ 700పై మహీంద్రా అండ్‌ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది.

Published : 09 Jul 2024 21:19 IST

Mahindra XUV700 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra Mahindra) ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 700 AX7 వాహన శ్రేణి ధరలను తగ్గించింది. ఎక్స్‌యూవీని మార్కెట్‌లో విడుదల చేసి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ధరలను మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. మార్కెట్లోకి ప్రవేశించిన అనతికాలంలోనే ఈ మోడల్‌.. మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు 2 లక్షల యూనిట్ల అమ్మకాలను ఇటీవల నమోదు చేసింది.

ఏఎక్స్‌7 వేరియంట్‌ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది. ఇటీవలే ఈ మోడల్‌లో డీప్‌ ఫారెస్ట్‌, బర్న్ట్‌ సియెన్నా పెయింట్‌ ఆప్షన్లను కూడా తీసుకొచ్చింది. ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్‌7 శ్రేణిలో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌తో కూడిన అడాస్ లెవల్‌ 2 వంటి అత్యాధునిక భద్రతా సదుపాయాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని