Foreign Investors: భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు కారణాలివే..

భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు ఆర్థిక నిపుణులు మూడు అంశాలను తెరపైకి తెస్తున్నారు.....

Published : 26 Jun 2022 19:59 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు అలుముకోవడంతో ఇటీవల ఈక్విటీ మార్కెట్లు ఏడాది కనిష్ఠానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, వరుస నష్టాల నుంచి గతవారం మార్కెట్లు కొంత ఉపశమనం పొందాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఈవారం సెన్సెక్స్‌ 1400 పాయింట్లు ఎగబాకింది. అయినా విదేశీ మదుపర్ల అమ్మకాలు మాత్రం ఆగలేదు.

గత 15 నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు రూ.4.1 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. 2008 ఆర్థిక మాంద్యం సమయంతో పోలిస్తే ఉపసంహరణల వేగం ఇప్పుడే ఎక్కువుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. దశాబ్దాల తర్వాత తక్కువ వడ్డీరేట్ల నుంచి పరపతి విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో మదుపర్లు కొత్త మార్గాలవైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నాయి.

మరోవైపు దేశీయ మదుపర్లు గత 15 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్లలో రూ.3.3 లక్షల కోట్లు విలువ చేసే కొనుగోళ్లు జరిపారు. విదేశీ మదుపర్ల అమ్మకాల్లో దాదాపు 80 శాతం వీరే అందిపుచ్చుకున్నారు. ఈ త్రైమాసికంలో నెలవారీ సగటు సిప్‌ల విలువ రూ.12,100 కోట్లుగా నమోదైంది. ఐదేళ్ల క్రితం ఈ విలువ రూ.3,700 కోట్లుగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు ఆర్థిక నిపుణులు మూడు అంశాలను తెరపైకి తెస్తున్నారు...

* అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు విదేశీ మదుపర్లను కలవరపెడుతున్న తొలి అంశం. కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో గత ఏడాది చివర్లో ముడి చమురుకు గిరాకీ పెరిగింది. సరిగ్గా అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావడంతో మళ్లీ సరఫరా సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండడంతో ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణ నెమ్మదించింది. రాబోయే రోజుల్లో ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో చమురుకు మరోసారి డిమాండ్‌ పడిపోవచ్చనే అనుమానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇలా చమురు గిరాకీలో హెచ్చుతగ్గులు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి.

* అమెరికాలో వడ్డీరేట్లు పెరగడం విదేశీ మదుపర్లను కలవరపెడుతున్న రెండో అంశం. అగ్రరాజ్యంలో రేట్ల పెంపు వల్ల వర్ధమాన దేశాల కరెన్సీల విలువ పతనమవుతోంది. ఫలితంగా మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరించి తిరిగి అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇటీవల వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రానున్న రోజుల్లో మరిన్ని పెంపులు తప్పవని సంకేతాలిచ్చింది. దీంతో డాలర్‌ బలపడుతోంది.

* మరోవైపు ద్రవ్యోల్బణం వరుసగా ఆర్‌బీఐ లక్ష్యిత పరిధిని దాటి నమోదు కావడం కూడా మదుపర్లను ఇబ్బంది పెడుతోంది. ఈ ధరల భారాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ ఎలాంటి చర్యలు చేపడుతుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫెడ్‌కు అనుగుణంగా ఆర్‌బీఐ సైతం రేట్లు పెంచుతోంది. అయితే, ఇది వృద్ధిరేటుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

విదేశీ మదుపర్లు భారత్‌కు తిరిగి రావాలంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గిన సూచనలు స్పష్టంగా కనిపించాలని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అలాగే భారత కంపెనీలు బలమైన లాభాలను నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తితే భారత కంపెనీల ఫలితాలు సైతం దెబ్బతింటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని