CIBIL Score: సిబిల్ స్కోరు నిర్వ‌హ‌ణ ఎందుకు ముఖ్యం?

750 లేదా అంత‌కంటే ఎక్కువ సిబిల్ స్కోరు నిర్వ‌హిస్తున్న వారికి బ్యాంకులు సుల‌భంగా రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి

Updated : 02 Jul 2022 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థికంగా బ‌ల‌మైన నిర్ణ‌యాల‌తో జీవితంలో ముందుకు వెళ్లేవారు సైతం ఒక్కోసారి అప్పు తీసుకోక త‌ప్ప‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఇల్లు కొనుగోలు చేయాలంటే.. పెద్ద‌మొత్తంలో డ‌బ్బు అవ‌సరం అవుతుంది. ఉద్యోగం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకెళితే నాలుగైదు ఏళ్ల‌లో డౌన్‌పేమెంట్ కోసం డ‌బ్బు స‌మ‌కూర్చుకోగ‌లుగుతాం. మిగిలిన మొత్తం కోసం రుణం తీసుకోవాల్సిందే కదా..! ఇలా వ్య‌క్తులు వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏదో ఒక స‌మ‌యంలో అప్పు చేయాల్సి వ‌స్తుంది. మ‌రి అనుకున్న వెంట‌నే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల నుంచి అప్పు దొర‌కాలీ అంటే సిబిల్ స్కోరు ఎంతో ముఖ్యం.

సిబిల్ స్కోరు అనేది.. బ్యాంకులు తీసుకునే రుణ నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేస్తుంది. స్కోరు ఎంత ఎక్కువ‌గా ఉంటే.. అంత తొంద‌ర‌గా రుణ ద‌ర‌ఖాస్తు ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్క‌డ ఒక ముఖ్య విష‌యం ఏమిటంటే.. ఒక వ్య‌క్తి రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన‌ప్పుడు, అతడు/ఆమెకు అప్పు ఇవ్వాలా.. వ‌ద్దా అనేది పూర్తిగా బ్యాంకు నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. సిబిల్ సంస్థ అప్పు, క్రెడిట్ కార్డు ఆమోదం గురించి బ్యాంకుకి ఎటువంటి స‌ల‌హాలూ ఇవ్వ‌దు. కేవ‌లం ద‌ర‌ఖాస్తుదారుని రుణ చ‌రిత్ర‌ను మాత్ర‌మే బ్యాంకుకి ఇస్తుంది. దాని ఆధారంగా రుణం ఇవ్వాలా.. లేదా?ఎంత వ‌డ్డీ ఛార్జ్ చేయాలి? అనేది బ్యాంకు నిర్ణయిస్తుంది. 

సాధార‌ణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 మ‌ధ్య‌లో ఉంటుంది. 750 లేదా అంత‌కంటే ఎక్కువ సిబిల్ స్కోరు నిర్వ‌హిస్తున్న వారికి బ్యాంకులు సుల‌భంగా రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి. పైగా వ‌డ్డీ రేటును కొంత వ‌ర‌కు త‌క్కువ చేసే అవ‌కాశం ఉంటుంది. 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోరు నిర్వ‌హించ‌గులుగుతున్నారంటే.. ఆ వ్యక్తులు రుణాల ప‌ట్ల బాధ్యతగా ఉన్నార‌ని, తీసుకున్న రుణాల‌కు సంబంధించిన బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లిస్తున్నార‌ని అర్థం. ఇటువంటి ఆర్థిక ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన వ్య‌క్తుల‌తో బ్యాంకులకు న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి రుణాలు తొంద‌ర‌గా మంజూరు చేస్తుంటాయి. 

650 కంటే ఎక్క‌వ, 750 కంటే త‌క్కువ క్రెడిట్ స్కోరు నిర్వ‌హిస్తున్నా రుణం కోసం సుల‌భంగా ఆమోదం పొందొచ్చు. కానీ ఎక్కువ వ‌డ్డీ రేట్లు చెల్లించాల్సి రావ‌చ్చు. 650 కంటే త‌క్కువ స్కోరు నిర్వ‌హిస్తున్న వారి ద‌ర‌ఖాస్తులు ఆమోదం పొంద‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. 

మంచి స్కోరును నిర్వ‌హించాలంటే..
రుణాల‌ను స‌మ‌యానికి చెల్లించండి: క్రెడిట్ స్కోరు దెబ్బ‌తిన‌టానికి ప్ర‌ధాన కార‌ణం బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌టం. తీసుకున్న రుణం తిరిగి చెల్లించ‌డంలో ఎంత ఆల‌స్యం చేస్తామో.. క్రెడిట్ స్కోరుపై అంత చెడు ప్ర‌భావం ప‌డుతుంది. రుణాల‌కు సంబంధించిన ఈఎంఐలను స‌మ‌యానికి చెల్లించ‌డంతో పాటు క్రెడిట్ కార్డుపైనా దృష్టి సారించాలి. క‌నీస బిల్లు చెల్లించి మిగిలిన మొత్తాన్ని త‌ర్వాతి నెల‌కు బదిలీ చేయడం వంటివి చాలా చిన్న విష‌యాలుగా అనిపించొచ్చు. కానీ ఇలాంటి ప‌నులు క్రెడిట్ స్కోరును త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి ఒక వ్య‌క్తి త‌మ ఆదాయ ప‌రిమితుల‌కు లోబ‌డి క్రెడిట్ కార్డుని ఉప‌యోగించాలి. స‌కాలంలో బిల్లు చెల్లించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ రుణ చ‌రిత్ర పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు కూడా మెరుగుప‌డుతుంది.

క్రెడిట్ కార్డు ర‌ద్దు చేయ‌కండి: సిబిల్ స్కోరు త‌క్కువ‌గా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు ర‌ద్దు చేయ‌డం ద్వారా క్రెడిట్ స్కోరు పెంచుకోవ‌చ్చ‌ని అపోహ ప‌డుతుంటారు కొంద‌రు. కానీ ఇది నిజంకాదు. నిజానికి క్రెడిట్ కార్డు ర‌ద్దుతో క్రెడిట్ స్కోరు మ‌రింతగా త‌గ్గిపోయే అవ‌కాశం ఉటుంది. ప్ర‌స్తుతం ఉన్న క్రెడిట్ కార్డును ర‌ద్దు చేయ‌కుండా కార్డు నిర్వ‌హ‌ణ‌లో త‌గిన జాగ్ర‌త్త‌లు (క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు ఆఖరి తేదీ కంటే ముందే పూర్తిగా చెల్లించ‌డం, ప‌రిమితిలోపు ఖ‌ర్చు చేయ‌డం వంటివి) తీసుకోవ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరును పెంచుకోవ‌చ్చు.

రుణ వినియోగ నిష్ప‌త్తి: క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాల‌లో ముఖ్య‌మైన‌ది క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి. మీ క్రెడిట్ కార్డు ప‌రిమితిలో ఖ‌ర్చులు 30 శాతానికి మించ‌కుండా చూసుకోవ‌డం ద్వారా కూడా క్రెడిట్ స్కోరు పెంచుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం ద్వారా క్రెడిట్ కార్డు బ‌కాయిల‌ను సుల‌భంగా చెల్లించి పెనాల్టీ, ఛార్జీలు వంటి వాటికి దూరంగా ఉండ‌గ‌లుగుతారు. దీంతో క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది.

చివ‌రిగా: బ్యాంకుల నుంచి సుల‌భంగా రుణం పొందాలంటే మంచి క్రెడిట్ స్కోరును నిర్వ‌హించ‌డం అవ‌స‌రం. ముఖ్యంగా గృహ  రుణం, కారు రుణం వంటి దీర్ఘ‌కాలిక రుణాలు తీసుకునే వారు వ‌డ్డీ రేటును త‌గ్గించుకోవ‌డం కోసం మంచి క్రెడిట్ స్కోరును నిర్వ‌హించాలి. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందే మీ సిబిల్ స్కోరును తెలుసుకోండి. త‌క్కువ‌గా ఉంటే పెంచుకునే ప్ర‌య‌త్నం చేయండి. ఇందుకోసం ఇప్ప‌టికే తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలను స‌కాలంలో చెల్లించాల‌ని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని