Apple employees: ఆఫీసుకు రమ్మంటే.. సంస్థనే వీడాలనుకుంటున్నారట..!

రెండేళ్లుగా కరోనాతో సతమతమైన ప్రపంచం.. కాస్త ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అనేక దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Published : 05 May 2022 01:53 IST

కాలిఫోర్నియా: రెండేళ్లుగా కరోనాతో సతమతమైన ప్రపంచం.. కాస్త ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అనేక దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. యాపిల్‌, గూగుల్ వంటి పలు సంస్థలు మునుపటిలా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కోరుకుంటున్నాయి. అందుకుతగ్గట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఉద్యోగులు మాత్రం సుముఖంగా లేరట. దీనిపై సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ బ్లైండ్.. ఏప్రిల్ 13 నుంచి 19 మధ్య 652 మంది యాపిల్ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించింది. 

సిబ్బందిని కార్యాలయాలకు తిరిగి తీసుకురావాలనే యాపిల్ సంస్థ విధానంపై 76 శాతమంది అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం వారంతా వారంలో ఒకరోజు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మే 23 నుంచి వారంలో కనీసం మూడు రోజులు హాజరుకావాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులకు సూచించారు. ఈ విధానంపై అధిక సంఖ్యలో ఉద్యోగులు విముఖత వ్యక్తం చేశారని ఆ సర్వే వెల్లడించింది. వారంతా సంస్థ వీడి, కార్యాలయాలకు వచ్చే విషయంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించే టెక్‌ సంస్థల్లో చేరాలని యోచిస్తున్నారని గుర్తించింది. 56 శాతం మంది సంస్థను విడిచిపెట్టాలని చూస్తున్నారని తెలిపింది. మరికొందరేమో రాకపోకల సమస్య గురించి ఆలోచిస్తున్నారని పేర్కొంది. ఈ సమయంలో ఉద్యోగుల విషయంలో యాపిల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  

ఇదిలా ఉంటే మరో టెక్ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులను రప్పించేందుకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. వారిని ప్రోత్సహించేందుకు ‘రైడ్ స్కూట్’ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. దానికోసం ఇ-స్కూటర్ తయారీ సంస్థ ఉనాగితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా, కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా దశలవారీగా విజృంభిస్తుండటంతో ఇన్నాళ్లు ఉద్యోగులు దాదాపుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిని తిరిగి రప్పించడం సంస్థలకు ఇబ్బందిగా మారినట్లు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని