Housing: వచ్చే రెండేళ్లలో సొంతింటికి మారతాం.. మెజారిటీ మిల్లీనియల్స్‌ అభిప్రాయమిదే!

Housing: నివాసం, పని, కొనుగోళ్లపై భవిష్యత్‌లో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సీబీఆర్‌ఈ సర్వే నిర్వహించింది.

Published : 22 Feb 2023 01:54 IST

దిల్లీ: భారత్‌లో చాలా మంది వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. అద్దెకు ఉండడానికి బదులు సొంతిల్లు కొనాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ ఇండియా నిర్వహించిన సర్వే తెలిపింది. నివాసం, పని, కొనుగోళ్లపై భవిష్యత్‌లో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో 1,500 మంది అభిప్రాయాలను సేకరించింది.

ఈ సర్వేలో జనరేషన్‌ జెడ్‌ (18- 25 ఏళ్ల వయసు), లేట్‌ మిల్లీనియల్స్‌ (26- 33 ఏళ్ల వయసు), ఎర్లీ మిల్లీనియల్స్‌ (34- 41 ఏళ్ల వయసు), జనరేషన్‌ ఎక్స్‌ (42- 57 ఏళ్ల వయసు), బేబీ బూమర్స్‌ (58 ఏళ్ల కంటే ఎక్కువ వయసు).. ఇలా అన్ని వయసులకు చెందినవారు పాల్గొన్నట్లు సీబీఆర్‌ఈ తెలిపింది. సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో దాదాపు 44 శాతం మంది వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, ఆసియా- పసిఫిక్‌ ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని సీబీఆర్‌ఈ తెలిపింది.

వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్న వారిలో అత్యధికంగా జనరేషన్‌ జెడ్‌ వర్గానికి చెందినవారే ఉన్నట్లు సర్వేలో తేలింది. భారత్‌లో హౌసింగ్‌ సెక్టార్‌లో వచ్చే గిరాకీ కొత్త తరం వల్లే రానుందని ఇది సూచిస్తోందని సీబీఆర్‌ఈ పేర్కొంది. కొత్త ఇంటికి మారాలనుకుంటున్న వారిలో 72 శాతం మంది అద్దెకు బదులు సొంతింటికే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. వీరిలో అత్యధిక మంది మిల్లీనియల్స్‌ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ఒక్క జనరేషన్‌ ఎక్స్‌ తప్ప మిగిలినవారంతా పట్టణ కేంద్రాలకు సమీపంలో నివసించాలనుకుంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధిక శాతం విదేశాలకు వెళ్లానుకుంటున్నట్లు సర్వేలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని