Homebuyers: రాయితీలిస్తే ఇల్లు కొంటాం!

ఇల్లు కొనాలనుకుంటున్నవారిలో దాదాపు 50 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో ధరలు పెరుగుతాయని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది....

Published : 28 Mar 2022 21:47 IST

ప్రముఖ సర్వేలో వినియోగదారుల వెల్లడి

దిల్లీ: ఇల్లు కొనాలనుకుంటున్నవారిలో దాదాపు 50 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో ధరలు పెరుగుతాయని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముడివస్తువుల ధరలు పెరగడమే అందుకు కారణమని వారంతా పేర్కొన్నారు. రాయితీలు లేదా చెల్లించడానికి అనువుగా ఉండే పథకాలను అందుబాటులోకి తీసుకొస్తే ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నామని 73 శాతం మంది తెలిపారు. హౌసింగ్‌.కామ్‌, ‘జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (Naredco)’ కలిసి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ఫలితాలను ‘రెసిడెన్షియల్‌ రియాల్టీ కన్జ్యూమర్‌ సెంటిమెంట్‌ ఔట్‌లుక్‌ (జనవరి-జూన్‌ 2022)’ నివేదిక పేరిట విడుదల చేశారు.

సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 47 శాతం మంది స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. స్టాక్స్‌, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి ఇతర అసెట్‌ క్లాస్‌లతో పోలిస్తే మదుపునకు స్థిరాస్తి వైపే మొగ్గుచూపుతున్నారు. అదే 2020 ద్వితీయార్ధంలో 35 శాతం మంది మాత్రమే స్థిరాస్తి వైపు ఆసక్తి చూపారు. ‘‘ప్రతిఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాల్సిన అవసరాన్ని కొవిడ్‌ సంక్షోభం కళ్లకు కట్టింది. 2021లో గృహ విక్రయాలు 13 శాతం పెరిగినట్లు మా సర్వేలో తేలింది. ఈ ఏడాదే విక్రయాలు కొవిడ్‌ మునుపటి స్థాయిని దాటేస్తాయని బలంగా విశ్వసిస్తున్నాం’’ అని హౌసింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌, ప్రాప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు.

గృహరుణాల వడ్డీరేటులో పన్ను రిబేటు పెంపు, నిర్మాణాల్లో ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ వసతి విస్తరణ, స్టాంప్‌ డ్యూటీల తగ్గింపు వంటి చర్యల ద్వారా ఇళ్ల విక్రయాలు పుంజుకునే అవకాశం ఉందని హౌసింగ్‌.కామ్‌, నరెడ్కో తెలిపాయి. ఒకసారి సందర్శించి లేదా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి 40 శాతం మంది మొగ్గుచూపినట్లు పేర్కొన్నాయి. ఇది ‘ప్రాప్‌టెక్‌’ కంపెనీలకు శుభపరిణామమని వెల్లడించాయి. కరోనా తర్వాత స్థిరాస్తి రంగంలోనూ సాంకేతికత వినియోగం ఊపందుకుందని పేర్కొన్నాయి.

ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడానికి 57 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు ఇంకా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తేలిందని అగర్వాల్‌ తెలిపారు. 1-1.5 కి.మీ పరిధిలో విద్య, వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని