తెలుసుకున్నాకే..ఫిక్స్‌డ్‌ చేయండి

బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం చిన్న బ్యాంకులు ఈ డిపాజిట్లపై 8.5%-9% వరకూ వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. చాలామటుకు బ్యాంకులు 7.5శాతం వరకూ వడ్డీ ఇస్తున్నాయి. ఏ ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా..

Updated : 09 Dec 2022 12:42 IST

బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం చిన్న బ్యాంకులు ఈ డిపాజిట్లపై 8.5%-9% వరకూ వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. చాలామటుకు బ్యాంకులు 7.5శాతం వరకూ వడ్డీ ఇస్తున్నాయి. ఏ ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అర్థం చేసుకోవడం సులభం. అయినప్పటికీ.. ఇందులో కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

రూ.లక్ష వరకూ సురక్షితం.. 
బ్యాంకులో చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ఎంత వరకూ సురక్షితం అనేది చాలామందికి వచ్చే అనుమానం. ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ)’ ద్వారా బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.లక్ష వరకూ హామీ ఉంటుంది. బ్యాంకు దివాలా తీసినా ఈ మొత్తం వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నమాట. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతా మొత్తం, రికరింగ్‌ డిపాజిట్‌, కరెంటు ఖాతాలకు ఇది వర్తిస్తుంది. అన్ని వాణిజ్య బ్యాంకులు అంటే.. ప్రభుత్వ, ప్రైవేటు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు (ప్రాథమిక సహకార బ్యాంకులు మినహా) తదితరాలన్నీ డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, పెద్ద బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేయాలనే ఆలోచన అనవసరం. రూ.లక్ష లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకున్నప్పుడు అధిక వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులనూ పరిశీలించవచ్చు. నష్టభయం ఉండకూడదు అనుకుంటే.. మీ దగ్గర ఉన్న డబ్బును విడగొట్టి.. రూ.లక్ష చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడమూ ఒక మార్గం. ఎందుకంటే..ఈ పథకం ప్రతి బ్యాంకులోని రూ.లక్ష లోపు డిపాజిట్లకు వర్తిస్తుంది.

వ్యవధి తీరకుండానే.. 
ఒకసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన తర్వాత వ్యవధి తీరేంత వరకూ కొనసాగించాలి. ఒకవేళ మధ్యలోనే తీసుకుంటే.. బ్యాంకులు 1.5శాతం వరకూ అపరాధ రుసుము విధించే అవకాశం ఉంటుంది. మీకు చెల్లించే వడ్డీ రేటు నుంచి ఈ శాతాన్ని తగ్గిస్తారన్నమాట. మీరు ఎఫ్‌డీని ప్రారంభించినప్పుడు ఇస్తామని హామీ ఇచ్చిన వడ్డీ రేటుకు బదులు 1.5శాతం తగ్గించి, ఆ రేటు ప్రకారం మీకు వడ్డీ చెల్లిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే.. ఎఫ్‌డీ చేసేప్పుడే స్వల్పకాలిక అవసరాలేమైనా ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఆ అవసరాల్ని బట్టి, వ్యవధిని నిర్ణయించుకోవాలి.

పరిమితిని మించితే.. 
ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ మొత్తం రూ.10వేలు దాటితే..బ్యాంకులు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధిస్తాయి. పాన్‌ వివరాలు ఇవ్వకపోతే.. 20శాతం మేరకు కోత ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు వచ్చే వడ్డీ రూ.50వేలు దాటితే పన్ను కోత విధిస్తుంది బ్యాంకు. అయితే, ఈ టీడీఎస్‌తోనే అంతా ముగియదు. సీనియర్‌ సిటిజన్లకు సెక్షన్‌ 80టీటీబీ ప్రకారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.50వేల వరకూ పన్ను వర్తించదు. ఈ పరిమితి మించినప్పుడు.. ఉన్న ఆదాయానికి ఈ వడ్డీని కూడా కలిపి మొత్తం ఆదాయం గణించాలి. అప్పుడు మీకు వర్తించే శ్లాబులను బట్టి, వడ్డీ ఆదాయానికి పన్ను మారుతుంది. టీడీఎస్‌ ద్వారా చెల్లించిన మొత్తాన్ని రిటర్నులు సమర్పించేప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు. కాబట్టి, మీ డిపాజిట్ల ద్వారా వచ్చే నికర వడ్డీ ఎంతన్నది తెలుసుకునేందుకు పన్ను మొత్తాన్ని తీసేయాలి. అప్పుడే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, హైబ్రీడ్‌, డెట్‌ పథకాల్లాంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల నుంచి వచ్చే రాబడులను పోల్చుకోవడానికి సులభం అవుతుంది. 
కొంతమంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను జీవిత భాగస్వామి లేదా పిల్లల పేర్లమీద చేస్తుంటారు. వచ్చే వడ్డీకి పన్ను చెల్లించనవసరం లేకుండా ఈ ఏర్పాటు అని భావిస్తారు. వాస్తవంలో ఇది నిజం కాదు. మీ జీవిత భాగస్వామి పేరుమీద మీరు ఎఫ్‌డీ చేసినా.. మైనర్‌ పిల్లల పేరుమీద ఎఫ్‌డీ చేసినా.. ఆ వచ్చే ఆదాయాన్ని మీ ఆదాయంగానే పరిగణిస్తారు. అప్పుడు మీకు వర్తించే శ్లాబులను బట్టే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల పేరుమీద ఉన్న ఎఫ్‌డీపై వచ్చే ఆదాయంలో రూ.1,500 వరకే మినహాయింపు ఉంటుంది.

పన్ను ఆదా ఎఫ్‌డీలకూ..

దాయపు పన్ను సెక్షన్‌ 80సీ ప్రకారం రూ.1,50,000 వరకూ వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేయడం ద్వారా మినహాయింపు పొందవచ్చు. ఇందులో ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా ఒకటి. వీటి వ్యవధి 5 ఏళ్లు. వీటిపై వచ్చే వడ్డీని కూడఆదాయంలో కలిపి చూపించాల్సి ఉంటుంది. అధిక పన్ను శ్లాబులో ఉన్న వారికి వీటిపై వచ్చే వడ్డీ పెద్దగా గిట్టుబాటేమీ కాదు. ఇలాంటి సందర్భాల్లో మూడేళ్ల వ్యవధి ఉన్న ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మెరుగైనవిగా చెప్పొచ్చు. వీటి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభం రూ.లక్ష దాటినప్పుడు దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, పన్ను ఆదా కోసం ఎంచుకునేప్పుడు ఈ రెండింటిని పోల్చి చూసుకొని, సరైన పథకాన్ని ఎంచుకోవాలి.
- నవీన్‌ కుక్రెజా, సీఈఓ, www.Paisabazaar.com
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని