Anant Ambani Wedding: అనంత్‌ అంబానీ - రాధికా మర్చెంట్‌ ‘మామెరు’ ఫంక్షన్‌.. ఏంటీ వేడుక?

Anant Ambani Wedding: కాబోయే వధూవరులు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌కు ‘మామెరు’ వేడుక నిర్వహించారు. దీనికి బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

Updated : 04 Jul 2024 17:27 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) - రాధికా మర్చెంట్‌ వివాహం జరగనుంది. ఈ జంట నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బుధవారం రాత్రి వీరికి ‘మామెరు’ వేడుక నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ నటీనటులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ వేడుక ఏంటా అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

‘మామెరు’ ముచ్చట ఇదీ..

మామెరు (Mameru ceremony) అనేది గుజరాతీ సంప్రదాయ వేడుక. దీని ప్రకారం.. వివాహానికి ముందు వరుడు తల్లి పుట్టింటివాళ్లు/మేనమామలు సంప్రదాయబద్ధంగా కాబోయే వధూవరులకు కానుకలు తీసుకొచ్చి ఆశీర్వదిస్తారు. అనంత్‌-రాధిక జంటకు నిన్న ఈ వేడుక నిర్వహించారు. ఇందులో నీతా (Nita Ambani) తల్లి పూర్ణిమ దలాల్‌, ఆమె సోదరి మమత తదితరులు అంబానీ ఇంటికి వచ్చి కాబోయే దంపతులకు బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ వేడుకను అంబానీ కుటుంబం ఎంతో ప్రత్యేకంగా చేసింది.

అమ్మ ఆభరణాల్లో మెరిసిన రాధిక..

ఈ వేడుకలో పెళ్లికూతురు రాధిక మర్చెంట్‌ (Radhika Merchant).. ప్రముఖ డిజైనర్‌ మనీశ్ మల్హోత్రా రూపొందించిన రాణీ పింక్‌ లెహంగాలో మెరిసిపోయారు. ఈ లెహంగా బోర్డర్‌పై దుర్గాదేవి శ్లోకాలను బంగారు తీగలతో ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేశారు. ఈ ఫంక్షన్‌లో రాధిక తన తల్లి నగలను వేసుకున్నారు. ఇక, ఈ వేడుకలో ముకేశ్‌ అంబానీ మనవలు, మనవరాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు. బాలీవుడ్‌ తారలు జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌ తదితరులు హాజరయ్యారు.

సోనియా గాంధీకి ఆహ్వానం..

అనంత్-రాధిక వివాహానికి ఇప్పటికే అంబానీ కుటుంబం ఆహ్వానాలను మొదలుపెట్టింది. తొలి పత్రికను నీతా అంబానీ (Nita Ambani) వారణాసిలోని కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ముంబయిలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. తాజాగా గురువారం కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌కు వెళ్లారు. సోనియా కుటుంబాన్ని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు.

జులై 12న అనంత్‌-రాధికా మర్చెంట్‌ పెళ్లి వేడుక (Anant Ambani-Radhika Merchant wedding) జరగనుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్‌.. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని