Zomato: ఒకే ఒక్కడు.. ఏడాదిలో జొమాటోలో 3వేలకు పైగా ఆర్డర్లు!

మీరు ఈ ఏడాదిలో ఎన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుంటారు?.. పది, ఇరవై లేదా ముప్పై. ఇంకాస్త ఎక్కువైతే ఓ ఎనభై లేదా వంద సార్లు. కానీ, దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2022లో రికార్డు స్థాయిలో ఫుడ్‌ ఆర్డర్ చేసినట్లు జొమాటో తన వార్షిక నివేదికలో పేర్కొంది. 

Updated : 28 Dec 2022 19:48 IST

దిల్లీ: వినియోగదారులకు అందించే సేవలకు సంబంధించి ప్రతి సంస్థ ఏడాది చివర్లో వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. ఇదే క్రమంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌ (Food Delivery App) జొమాటో (Zomato) సైతం ఈ ఏడాది వార్షిక నివేదికను వెల్లడించింది. ఇందులో యూజర్లు ఏ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్‌ చేశారు? టాప్‌ కస్టమర్ ఎవరు? ఏ నగరంవారు డిస్కౌంట్‌లను ఎక్కువగా ఉపయోగించారు వంటి వివరాలు ఉంటాయి.

జొమాటో తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక  ప్రకారం 2022లో ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్‌గా బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు, టాప్‌ కస్టమర్‌గా దిల్లీకి చెందిన అంకుర్‌ అనే వ్యక్తిని ప్రకటించింది. ఇతను ఈ ఏడాది జొమాటోలో 3,330సార్లు ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. జొమాటో నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఇతను రోజుకు తొమ్మిది  చొప్పున ఏడాది మొత్తంలో మూడువేల ఫుడ్‌ ఆర్డర్లు చేశాడట. దీంతో ఇతన్ని ‘‘ది నేషన్స్‌ బిగ్గెస్ట్ ఫుడీ’’గా జొమాటో తన నివేదికలో పేర్కొంది.

అంతేకాకుండా, జొమాటో ప్రొమో కోడ్‌లతో ఎక్కువ డిస్కౌంట్‌ పొందిన నగరవాసుల జాబితాను కూడా ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ నగరంలోని యూజర్లు డిస్కౌంట్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలిపింది. ఈ నగరం నుంచి వచ్చే 99.7 శాతం ఆర్డర్లకు జొమాటో ప్రొమో కోడ్‌లను అప్లై చేసినట్లు నివేదికలో పేర్కొంది. ముంబయికి చెందిన వ్యక్తి జొమాటో డిస్కౌంట్‌లతో సుమారు ₹ 2.3 లక్షలు ఆదా చేసుకున్నట్లు ప్రకటించింది. 

ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్‌గా బిర్యానీ తర్వాతి స్థానంలో పిజ్జా నిలిచింది. దేశవ్యాప్తంగా జొమాటో యూజర్లు ప్రతి నిమిషానికి 139 పిజ్జాలు ఆర్డర్‌ చేస్తున్నారట. మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ (Swiggy) వార్షిక నివేదిక ప్రకారం 2022లో నిమిషానికి 137 బిర్యానీలను డెలివరీ చేసినట్లు వెల్లడించింది. ఇక, ఎక్కువ మంది ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ జాబితాలో బిర్యానీ తర్వాత మసాలా దోశ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, పనీర్‌ బటర్‌ మసాలా, బటర్‌ నాన్‌, వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌, వెజ్‌ బిర్యానీ, తందూరి చికెన్‌ ఉన్నట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని