NFT: మండేలా అరెస్టు వారెంటు ఎన్‌ఎఫ్‌టీకి ₹99 లక్షలు!

దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్‌ మండేలాకు సంబంధించిన అరెస్టు వారెంటు నుంచి రూపొందించిన ‘నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (NFT)’కు వేలంలో అనూహ్య స్పందన లభించింది....

Published : 27 Mar 2022 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్‌ మండేలాకు సంబంధించిన అరెస్టు వారెంటు నుంచి రూపొందించిన ‘నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (NFT)’కు వేలంలో అనూహ్య స్పందన లభించింది. ఓ వ్యక్తి 1,30,000 డాలర్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ సొమ్మును దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విశేషాలను సంరక్షిస్తున్న మ్యూజియం నిర్వహణకు ఇవ్వనున్నారు.

27 ఏళ్లు జైలు జీవితం గడిపిన నెల్సన్ మండేలా స్వతంత్ర దక్షిణాఫ్రికాకు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనను 1962లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. నాటి వారెంటుకు సంబంధించిన పత్రాలనే ఎన్‌ఎఫ్‌టీగా రూపొందించి వేలం వేయగా.. భారత కరెన్సీలో రూ.99.17 లక్షలు సమకూరాయి. ఈ మొత్తం లిలీస్‌లీఫ్‌ మ్యూజియానికి వెళ్లనుంది. మండేలా అరెస్టు వారెంటును 2004లో దాతలు ఈ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం దీని ఎన్‌ఎఫ్‌టీని సొంతం చేసుకున్న వ్యక్తికి ‘ఒరిజినల్‌ డాక్యుమెంట్‌’కు చూసేందుకు ప్రత్యేక అనుమతి ఉంటుంది.

గత ఏడాది మరో స్వాతంత్ర్య సమరయోధుడు ఒలివర్‌ టాంబోకు సంబంధించిన ఓ‘పెన్‌ గన్‌’ను వేలం వేయగా 50 వేల డాలర్లు సమకూరాయి. కరోనా సంక్షోభంతో దక్షిణాఫ్రికాలో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. అక్కడి పర్యాటక స్థలాలు, చారిత్రక కట్టడాల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఎన్‌ఎఫ్‌టీల వేలం ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు.

దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌కు శివార్లలో ఉన్న లిలీస్‌లీఫ్‌ ఫార్మ్‌ను కేంద్రంగా చేసుకొని నాటి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కార్యకలాపాలు కొనసాగించింది. మండేలా సహా ఆయన అనుచరులకు అప్పట్లో అది అడ్డాగా ఉండేది. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి వారంతా అక్కడే రహస్య ప్రాంతాల్లో తలదాచుకునేవారు. ఆ ప్రాంతమే ఇప్పుడు మ్యూజియంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని