Mankind Pharma IPO: ఫార్మా రంగంలో బిగ్గెస్ట్‌ ఐపీఓ.. సెబీకి మ్యాన్‌కైండ్‌ దరఖాస్తు

Mankind IPO: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మా (Mankind Pharma) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO)కు రానుంది. రూ.7,500 కోట్ల మేర నిధులు సమీకరించే లక్ష్యంతో తాజాగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. 

Published : 16 Sep 2022 17:09 IST

దిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మా (Mankind Pharma) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO)కు రానుంది. రూ.7,500 కోట్ల మేర నిధులు సమీకరించే లక్ష్యంతో తాజాగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఫార్మా రంగంలో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఇంతకుముందు 2020లో గ్లాండ్‌ ఫార్మా కంపెనీ ఐపీఓ ద్వారా రూ.6,480 కోట్లను సమీకరించింది. ఇప్పటి వరకు ఫార్మా స్యూటికల్‌ రంగంలో ఇదే అతిపెద్ద ఐపీఓగా ఉంది. 

ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 4 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనున్నట్లు మ్యాన్‌కైండ్‌ తన డ్రాఫ్ట్‌రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (DRHP)లో పేర్కొంది. ఇందులో ప్రమోటర్లైన రమేశ్‌ జునేజా, రాజీవ్‌ జునేజా, షీతల్‌ అరోరాకు చెందిన షేర్లతో పాటు ఇన్వెస్టర్ల షేర్లు కూడా ఉన్నాయి. ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జెఫ్రీస్‌ ఇండియా, జేపీ మోర్గాన్‌ ఇండియా లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

ఫార్మా రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల్లో మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఒకటి. ఏపీ సహా దేశవ్యాప్తంగా 23 చోట్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి. బ్రాండెడ్‌ జనరిక్‌ డ్రగ్స్‌తో పాటు.. ప్రెగాన్యూస్‌ పేరిట ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లను, మ్యాన్‌ ఫోర్స్‌ పేరిట కండోమ్‌లను, గ్యాస్‌-ఓ-ఫాస్ట్‌ పేరిట ఆయుర్వేదిక్‌ యాంటాసిడ్స్‌ను, మొటిమలకు సంబంధించి అక్నేస్టార్‌ వంటి ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయిస్తోంది. కండోమ్‌ల మార్కెట్‌లో 36 శాతం వాటా ఈ కంపెనీదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు