సంప‌ద సృష్టికి ABCD పొదుపు మంత్రం!

డ‌బ్బును చిన్న చిన్న మొత్తాల‌లో దీర్ఘ‌కాలం పాటు నిల‌క‌డ‌గా ఆదా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు అధిగమించ‌డంతో పాటు సంపద‌ను సృష్టించుకోవచ్చు.

Published : 20 Dec 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇవాళ మనం చేసే పొదుపు.. రేప‌టి రోజున అనుకోకుండా సంపాద‌న ఆగిపోయినప్పుడు ఉప‌యోగ‌ప‌డుతుందని ఒకప్పుడు చాలా మంది పొదుపు చేసేవారు. కానీ ప్ర‌స్తుతం యువ‌త ఆలోచ‌న విధానం మారింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి వాటి కోసం డ‌బ్బు ఆదా చేయాలనే రోజులు పోయాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, సంప‌ద సృష్టిపై దృష్టి పెడుతున్నారు. ఈ రెండూ ఒక‌దానితో మ‌రొక‌టి ముడిప‌డి ఉన్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక స్వాతంత్ర్యం భ‌విష్య‌త్‌లో సంప‌ద‌ ఆర్జన‌కు స‌హాయ‌ప‌డుతుంది.

ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఒకరిపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే, సంప‌ద సృష్టికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్క‌టే స‌రిపోదు. సంపాద‌న కంటే ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఖ‌ర్చుల కంటే పొదుపు ఎక్కువ‌గా ఉండాలి. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌దుపు చేయాలి. ఒక‌వేళ పొదుపు త‌క్కువ‌గా ఉంటే సంప‌ద సృష్టి సాధ్యం కాదా? అంటే సాధ్య‌మే అంటున్నారు నిపుణులు.

ఆర్థిక విష‌యాల్లో రాణించాలంటే మాన‌సిక ప్ర‌శాంతత చాలా అవ‌స‌రం. పొదుపు టార్గెట్‌ను చేరుకునేందుకు త‌ప్ప‌నిస‌రి ఖ‌ర్చుల‌ను విస్మ‌రించ‌డం స‌రికాదు. దీనివ‌ల్ల ఒత్తిడి పెర‌గొచ్చు. డ‌బ్బును చిన్న చిన్న మొత్తాల్లో దీర్ఘ‌కాలం పాటు నిల‌క‌డ‌గా ఆదా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు అధిగ‌మించ‌డంతో పాటు, ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. పొదుపు అల‌వాటు రెగ్యుల‌ర్ సేవింగ్స్ అవ‌స‌రాన్ని తెలియ‌జేయ‌డంతో పాటు, కంఫ‌ర్ట్ జోన్‌లో ఉంటూనే అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

పొదుపు చేసేటప్పుడు డ‌బ్బును లిక్విడ్ అసెట్స్ రూపంలో సుర‌క్షిత ప‌థ‌కాల్లో ఉంచిన‌ప్ప‌టికీ, సంప‌ద సృష్టికి మాత్రం పెట్టుబ‌డులు పెట్టాలి. స్టాక్స్‌, రియ‌ల్ ఎస్టేట్‌, ఇత‌ర స్థిర ఆస్తుల కొనుగోలు అనేది దీర్ఘ‌కాల ప్ర‌క్రియ‌. ఈ త‌ర‌హా పెట్టుబ‌డుల కోసం మెరుగైన‌ దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక, వివిధ రకాల పెట్టుబ‌డి మార్గాల‌పై అవ‌గాహ‌న‌ అవ‌స‌రం. కానీ పొదుపును మాత్రం నెల‌వారీ బ‌డ్జెట్‌ను అంచ‌నా వేయ‌డం, ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డం, పొదుపు ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం, ఆర్థిక ప్రాధాన్య‌త‌ల‌ను నిర్ణ‌యించ‌డం, వృద్ధిని ట్రాక్ చేయ‌డంతో సుల‌భంగా ప్రారంభించొచ్చు.

ఇందుకోసం మీకు ఏయే మార్గాల నుంచి ఆదాయం వ‌స్తుందో అంచనా వేయండి. త‌ప్ప‌నిస‌రిగా నెల‌వారీ ఖ‌ర్చులు ఇంటి అద్దె, నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు, వైద్య ఖ‌ర్చులు వంటి వాటికి కావ‌ల‌సిన నిధుల‌ను పక్కన పెట్టండి. త‌ప్ప‌నిస‌రి కాని ఇత‌ర‌ ఖ‌ర్చులు.. విహార‌యాత్ర‌లు, సినిమాలు, రెస్టారెంట్‌ వంటి వాటికి కోసం కొంత మొత్తాన్ని తీసి మిగిలిన మొత్తాన్ని పొదుపు కోసం కూడ‌బెట్టాలి.

పొదుపుపై బ‌డ్జెట్ ప్ర‌భావం చాలానే ఉంటుంది. ఎప్పుడైతే బ‌డ్జెట్‌కు క‌ట్టుబ‌డి ఉంటామో అప్పుడే ప్ర‌ణాళిక ప్ర‌కారం పొదుపు, పెట్టుబ‌డులు చేయ‌గ‌లం. ఇందుకోసం 'ABCD' పొదుపు మంత్రాన్ని గుర్తించుకుంటే సుల‌భంగా సంప‌ద‌ను సృష్టించొచ్చు.
A అంటే Arranging. ఆదాయం, ఖ‌ర్చులు, పొదుపును స‌బ్‌-హెడ్స్‌లో వ‌ర్గీక‌రించి అరేంజ్ చేయ‌డం.

B అంటే Budgeting. ఆదాయంతో పొదుపు, ఖ‌ర్చుల‌ను స‌మ‌తుల్యం చేసుకోవాలి.

C అంటే Consistent approach.. పొదుపునకు స్థిరమైన విధానం ఉండాలి.

D అంటే Developing. స్వ‌ల్ప కాల పొదుపును దీర్ఘ‌ కాల పెట్టుబ‌డులుగా వృద్ధి చేయాలి.

యువ‌త సేవింగ్స్‌పై దృష్టిపెట్టాలి. కొంత కాలం పూర్త‌య్యే స‌రికి నిర్ధిష్ట మొత్తం పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఆర్థిక వ్య‌వ‌హారాల నిర్వ‌హ‌ణ విష‌యంలో చాలామంది గంద‌ర‌గోళానికి లోన‌వుతున్నారు. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మీ ఖ‌ర్చులను వేరువేరు భాగాలుగా వ‌ర్గీక‌రించేందుకు ప్ర‌య‌త్నించాలి. సంపాద‌నలో కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించాలి. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయాలి. అప్పుడు నెల‌లో మిగిలిన 15 రోజుల్లో ఖ‌ర్చును విశ్లేషించి అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌కు చెక్ పెట్టొచ్చు. చిన్న చిన్న ప్ర‌య‌త్నాలే మ‌న‌ల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. సంపాదించిన రూపాయిలో ప్ర‌తి పైసా విలువైన‌దే.

డ‌బ్బు పొదుపు కోసం కొన్ని చిట్కాలు..
* స్వీయ నియంత్రణ నేర్చుకోవాలి.

* పొదుపు అలవాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* సంపాద‌న‌ను వేరువేరు భాగాలుగా వ‌ర్గీకరించండి.

* చిన్న చిన్న పెట్టుబ‌డులతో ప్రారంభించ‌డం, చెల్లింపుల‌ను విశ్లేషించ‌డం నేర్చుకోండి.

* అత్య‌వ‌స‌ర నిధిని ప్రారంభించండి.

* సంపాద‌న‌, పొదుపు, ఖ‌ర్చుల మ‌ధ్య స‌మ‌తుల్య‌త ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వ‌ర‌కు అప్పు చేయ‌క‌పోవ‌డ‌మే శ్రేయ‌స్క‌రం.

* చిన్న చిన్న నీటి బింధువులే ప్ర‌వాహంగా మారతాయి. అలాగే మ‌నం ఈరోజు పొదుపు చేసిన చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలంలో సంప‌దగా మార‌తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని