Tech Jobs: అత్యవసరంగా రమ్మని.. ఇంటికెళ్లిపొమ్మని!

అత్యవసరంగా ముఖాముఖి సమావేశం ఉందని చెబుతూ, తీరా వెళ్లిన తర్వాత కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి పంపించేస్తున్నారని అంటున్నారు.

Updated : 23 Jan 2023 19:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) 18,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇదొక్కటే కాదు, గూగుల్‌ (Google), మైక్రోసాఫ్ట్‌ (Microsoft) లాంటి పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత వేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు లే ఆఫ్‌ (Lay off)ల పేరుతో జీతానికి గండి కొడుతున్నాయి. దీనిపై ఉద్యోగులు (Employees) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉన్న కొలువు.. రేపు ఉంటుందో లేదోనని భయపడుతున్నారు. అటు సంస్థలు కూడా కేవలం గంటల వ్యవధిలోనే సంస్థ నుంచి పంపించేయడం గమనార్హం.

ఉద్యోగం తీసేయడానికి ఇదో ఎత్తుగడ

ఉద్యోగం కోల్పోయిన కొంత మంది మీడియా ఎదుట, సామాజిక మాధ్యమాల్లోనూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ‘‘అత్యవసరంగా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, తర్వాతి రోజే కార్యాలయానికి రావాలని సీనియర్‌ మేనేజర్‌ నుంచి ఓ అధికారిక మెయిల్‌ పంపిస్తున్నారు. అయితే, ఏ అంశంపై చర్చించనున్నారన్న సంగతి మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నందున  దూరంగా ఉన్నానని రిప్లై ఇస్తే.. విమానం టికెట్లు తీసుకోవాలని, వాటి ఛార్జీలను కూడా కంపెనీయే భరిస్తుందని చెబుతూ.. తప్పని సరిగా హాజరు కావాలని హుకుం జారీ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత సీనియర్‌ మేనేజర్‌, హెచ్‌ మేనేజర్‌ ఇద్దరూ తొలుత లే ఆఫ్‌ల గురించి చెబుతున్నారు. సమ్మతమైతే సంతకం చేయాలని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని అంటున్నారు. ఆలోచించుకునేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు. కొందరికి లే ఆఫ్‌ ప్రస్తావన తీసుకురాకుండానే సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు చెబుతున్నారు.’’ అని ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి జాతీయ మీడియా ఎదుట తన బాధను వ్యక్తం చేశాడు. ఉద్యోగులు కాదు, కూడదు అంటే వాళ్లకి సమాచారం ఇచ్చిన 4 గంటల తర్వాత సంస్థ అధికారిక లాగిన్‌లను బ్లాక్‌ చేస్తున్నారని చెప్పాడు. అమెజాన్‌ సంస్థ అయితే ఉద్యోగులకు విమాన ఛార్జీలతో పాటు, వసతికి అయ్యే ఖర్చు కూడా ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగ ఆఫర్లు రద్దు

అమెజాన్‌ సంస్థ తమ ఉద్యోగులను తొలగిస్తే 5 నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తోంది. కానీ, ఎలాన్‌మస్క్‌ సారథ్యంలోని ట్విటర్‌ మాత్రం అది పాటించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. లే ఆఫ్‌లు విధిస్తూ జీతాలకు కోతవిధిస్తున్న ట్విటర్‌.. ముందస్తు పరిహారంపై ఏమైనా ప్రకటన విడుదల చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. అయితే ట్విటర్‌ ఇండియా మాత్రం ఉద్యోగం కోల్పోయిన వారికి రెండు నెలల జీతాన్ని పరిహారంగా చెల్లించింది. కొలువు కోల్పోయిన చాలా మంది ట్విటర్‌, లింక్డ్‌ ఇన్‌ ద్వారా కొత్త ఉద్యోగాల కోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్‌ సంస్థ ఇటీవల రిక్రూట్‌ చేసుకున్న ఫుల్‌టైం ఉద్యోగ ఆఫర్లను కూడా ఉపసంహరించుకుంది. దీంతో ఎంపికైన వారికి కూడా ఉద్యోగం లేకుండా పోయింది. అమెజాన్‌ మాత్రమే కాదు.. మెటా సంస్థ కూడా ఉద్యోగ ఆఫర్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. 2023లో నియామకాల ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ కూడా గత వారం 22,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని