Stock Market Update: మారని మార్కెట్‌ స్థితి.. మూడోరోజూ నష్టాలే!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి....

Updated : 25 May 2022 15:52 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడోరోజైన బుధవారమూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ దిగజారుతూ ఇంట్రాడే కనిష్ఠాలను తాకాయి. చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ రంగంలో భారీ అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఐటీ స్టాక్స్‌ సైతం భారీ నష్టాలను చవిచూశాయి. ఏషియన్‌ పెయింట్స్‌ వంటి దిగ్గజ షేర్లు కూడా నష్టాలను చవిచూడడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలూ దేశీయ సూచీలను ప్రభావితం చేశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 54,254.07 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో  54,379.59 - 53,683.16 మధ్య కదలాడింది. చివరకు 303.35 పాయింట్ల నష్టంతో 53,749.26 వద్ద ముగిసింది. 16,196.35 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 99.35 పాయింట్లు నష్టపోయి 16,025.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,223.35 - 16,006.95 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.52 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం వరకు పడ్డాయి. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ 17 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.

* గ్లోబస్‌ స్పిరిట్స్‌ షేర్లు ఈరోజు 15 శాతానికి పైగా కుంగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు నిరాశపర్చడమే ఇందుకు కారణం.

* మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోకపోవడంతో చంబల్‌ ఫర్జిలైజర్స్‌ షేర్లు ఈరోజు 14 శాతం కుంగి 10 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.

* హిందూస్థాన్‌ జింక్‌లో ప్రభుత్వం తన 29.5 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 7.6 శాతం మేర లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని